థాంక్యూ జియో: ఫోన్ బిల్లులు తగ్గాయ్
థాంక్యూ జియో: ఫోన్ బిల్లులు తగ్గాయ్
Published Wed, Aug 23 2017 9:11 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM
సాక్షి, ముంబై : రిలయన్స్ జియో టెలికాం మార్కెట్‌లోకి ఎంట్రీ... సంచలనాలనే సృష్టించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. జియో దెబ్బకు... టారిఫ్‌లతో మోత మోగిస్తున్న దిగ్గజ టెల్కోలన్నీ కిందకి దిగొచ్చాయి. దీంతో గత ఏడాదిగా వినియోగదారుల మొబైల్ బిల్లులు భారీగానే తగ్గినట్టు తెలిసింది. అంతేకాక టెలికాం ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న ధరల యుద్ధంతో మరింత స్థాయిలో ధరలు కిందకి పడిపోనున్నాయని ఇండస్ట్రి నిపుణులు చెబుతున్నారు.
వచ్చే ఏడాది సగటున 25-30 శాతం టారిఫ్‌లు కిందకి పడిపోవచ్చని విశ్లేషకులు, ఇండస్ట్రి ఇన్‌సైడర్స్ అంచనావేస్తున్నారు. ఒకవేళ మీరు ఎక్కువ డేటా వాడే వారైతే, మరింత లబ్ది పొందవచ్చంటూ పేర్కొంటున్నారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్కెట్‌లోకి ప్రవేశించిన అనంతరం గతేడాదిగా టారిఫ్ ధరలు కనీసం 25-32 శాతం కిందకి పడిపోయాయి. ఎక్కువ డేటా వాడేవారికి ధరల నుంచి 60-70 శాతం ఉపశమనం లభించిందని తెలిసింది.
జియో మార్కెట్‌లోకి ప్రవేశిస్తూనే.. ఉచిత లాంచ్ ఆఫర్లు, ఆల్ట్రా చీఫ్ టారిఫ్‌లతో ఇండస్ట్రిని అదరగొట్టింది. ఈ కొత్త టెల్కోకు కౌంటర్ ఇవ్వడానికి, తమ కస్టమర్లు, జియోకు తరలిపోకుండా ఆపేందుకు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు తమ ధరలను తగ్గించాయి. ప్రస్తుతం జియో, ఇతర టెల్కోలకు మధ్య నెలకొన్న ధరల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పట్లో ముగుస్తుందని అనుకోవడం లేదని ఇండస్ట్రి బాడీ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాజన్ మ్యాథ్యూస్ చెప్పారు. మరో ఏడాది పాటు ఈ వార్ కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది టెలికాం ఇండస్ట్రిలో నెలకొన్న ఒత్తిడి మరింత పెంచుతుందని తెలిపారు.
సగటున ఈ ఏడాది మొబైల్ బిల్లులు 25-18 శాతం తగ్గుతాయని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్‌ఎల్‌పీ పార్టనర్ హేమంత్ జోషి అన్నారు. వచ్చే ఏడాది 30 శాతం పడిపోయే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. రెండంకెల స్థాయిలో కూడా ధరలు పడిపోవచ్చని కేపీఎంజీ చెబుతోంది. పాపులర్ ప్యాకేజీ ధరల ట్యాగ్‌లు రూ.250 నుంచి రూ.500 మధ్యలో ఉండగా...వీటి వాలిడిటీ 28 రోజుల నుంచి 84 రోజుల మధ్యలో ఉంది. రోజుకు 8జీబీ డేటా వాడేవారు అత్యధికంగా లబ్ధి పొందనున్నారు. 2016లో రూ.250గా ఉన్న సగటు జీబీ డేటా, ప్రస్తుతం రూ.50కు పడిపోయింది.
Advertisement
Advertisement