Rajan Mathews
-
5జీ వేలం ఈ ఏడాదే..
న్యూఢిల్లీ: 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రం వేలాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిర్వహించనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. స్పెక్ట్రం ధరలకు సంబంధించి సంస్కరణలు ఉంటాయని టెలికం పరిశ్రమకు హామీ ఇచ్చారు. సోమవారం ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2019 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘టెలికం పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రభుత్వానికి తెలుసు. స్పెక్ట్రం వేలం ఈ ఆర్థిక సంవత్సరంలోనే జరుగుతుంది. ధరకు సంబంధించి కొన్ని సంస్కరణలు చేపడుతున్నాం‘ అని ప్రసాద్ చెప్పారు. మరోవైపు, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వదంతుల వ్యాప్తి అంశంపై స్పందిస్తూ ఎన్క్రిప్షన్ను ప్రభుత్వం కూడా గౌరవిస్తుందని చెప్పారు. అయితే, హింసను ప్రేరేపించే విధమైన తప్పుడు వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు .. దర్యాప్తు సంస్థలు వాటి మూలాలను కచ్చితంగా కనుగొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు అనువైన వ్యవస్థ ఉండటం తప్పనిసరన్నారు. స్పెక్ట్రం రేటును సంస్కరిస్తామంటూ ప్రసాద్ ప్రకటించడాన్ని సెల్యులార్ సంస్థల సమాఖ్య సీవోఏఐ స్వాగతించింది. ఇది టెలికం కంపెనీలకు ‘భారీ ఊరట‘ ఇస్తుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ చెప్పారు. తగినంత స్పెక్ట్రం, సరైన ధర ఉంటే రాబోయే వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు టెల్కోలు కూడా ఆసక్తి చూపుతాయని పేర్కొన్నారు.5జీ స్పెక్ట్రం వేలానికి రూ. 4.9 లక్షల కోట్ల బేస్ ధరను నిర్ణయించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) గతేడాది సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న టెలికం పరిశ్రమ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. తొలి రోజున 5జీ టెక్నాలజీ మెరుపులు.. దేశీ టెలికం సంస్థలకు కీలక కార్యక్రమమైన ఐఎంసీ అక్టోబర్ 16 దాకా మూడు రోజుల పాటు సాగనుంది. ఈసారి ఒక లక్ష మంది దాకా దీన్ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. ఇందులో 500 పైచిలుకు కంపెనీలు, 250 స్టార్టప్‌లు, 110 మంది విదేశీ కొనుగోలుదారులు పాల్గొంటున్నారు. తొలి రోజున వివిధ టెలికం దిగ్గజాలు పలు కొత్త కాన్సెప్ట్స్‌ను సందర్శకులకు ప్రదర్శించాయి. గాయకులు ఒక చోట పాడుతుంటే, మ్యూజిక్ కంపోజర్ మరోచోట కంపోజ్ చేస్తుండగా..రెండింటినీ అనుసంధానం చేసి ఏకకాలంలో పూర్తి పాటను లైవ్‌లో వినిపించే 5జీ టెక్నాలజీ కాన్సెప్ట్‌ను ఎరిక్సన్, ఎయిర్టెల్ ప్రదర్శించాయి. స్మార్ట్ వాహనాల్లో 5జీ టెక్నాలజీ వినియోగాన్ని వొడాఫోన్ ఐడియా ప్రదర్శించింది. వైద్యం, విద్యా రంగాల్లో లైవ్ 3డీ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్‌ను చూపించింది. రిలయన్స్ జియో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో కాల్ అసిస్టెంట్‌ను ప్రదర్శించింది. రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ, భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఈసారి హాజరు కాకపోవడం గమనార్హం. నియంత్రణ వ్యవస్థ తోడ్పాటు ఉండాలి: బిర్లా కొత్త డిజిటల్ భారతదేశాన్ని నిర్మించాలంటే టెలికం రంగం కీలకమని వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. ఈ రంగం వృద్ధికి నియంత్రణ వ్యవస్థ తోడ్పాటు ఉండాలని, ప్రభుత్వం ఇందుకు అనువైన పరిస్థితులు కల్పించాలని పేర్కొన్నారు. మరోవైపు, భారీ స్పెక్ట్రం ధరలు, నెట్వర్క్ విస్తృతికి భారీగా వ్యయాలు చేయాల్సి వస్తుండటం టెలికం రంగంపై మరింత భారం మోపుతోందని భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ భారతి మిట్టల్ చెప్పారు. 5జీ స్పెక్ట్రంనకు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న రిజర్వ్ ధర మిగతా దేశాలతో పోలిస్తే ఏకంగా ఏడు రెట్లు అధికమన్నారు. 5జీ లో భారత్ లీడరుగా ఎదగాలంటే స్పెక్ట్రం ధర సహేతుకంగా ఉండేలా చూడటం అవసరమని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా తెలిపారు. -
థాంక్యూ జియో: ఫోన్ బిల్లులు తగ్గాయ్
-
థాంక్యూ జియో: ఫోన్ బిల్లులు తగ్గాయ్
సాక్షి, ముంబై : రిలయన్స్ జియో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ... సంచలనాలనే సృష్టించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. జియో దెబ్బకు... టారిఫ్‌లతో మోత మోగిస్తున్న దిగ్గజ టెల్కోలన్నీ కిందకి దిగొచ్చాయి. దీంతో గత ఏడాదిగా వినియోగదారుల మొబైల్ బిల్లులు భారీగానే తగ్గినట్టు తెలిసింది. అంతేకాక టెలికాం ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న ధరల యుద్ధంతో మరింత స్థాయిలో ధరలు కిందకి పడిపోనున్నాయని ఇండస్ట్రి నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది సగటున 25-30 శాతం టారిఫ్‌లు కిందకి పడిపోవచ్చని విశ్లేషకులు, ఇండస్ట్రి ఇన్సైడర్స్ అంచనావేస్తున్నారు. ఒకవేళ మీరు ఎక్కువ డేటా వాడే వారైతే, మరింత లబ్ది పొందవచ్చంటూ పేర్కొంటున్నారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్కెట్లోకి ప్రవేశించిన అనంతరం గతేడాదిగా టారిఫ్ ధరలు కనీసం 25-32 శాతం కిందకి పడిపోయాయి. ఎక్కువ డేటా వాడేవారికి ధరల నుంచి 60-70 శాతం ఉపశమనం లభించిందని తెలిసింది. జియో మార్కెట్లోకి ప్రవేశిస్తూనే.. ఉచిత లాంచ్ ఆఫర్లు, ఆల్ట్రా చీఫ్ టారిఫ్‌లతో ఇండస్ట్రిని అదరగొట్టింది. ఈ కొత్త టెల్కోకు కౌంటర్ ఇవ్వడానికి, తమ కస్టమర్లు, జియోకు తరలిపోకుండా ఆపేందుకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు తమ ధరలను తగ్గించాయి. ప్రస్తుతం జియో, ఇతర టెల్కోలకు మధ్య నెలకొన్న ధరల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పట్లో ముగుస్తుందని అనుకోవడం లేదని ఇండస్ట్రి బాడీ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాజన్ మ్యాథ్యూస్ చెప్పారు. మరో ఏడాది పాటు ఈ వార్ కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది టెలికాం ఇండస్ట్రిలో నెలకొన్న ఒత్తిడి మరింత పెంచుతుందని తెలిపారు. సగటున ఈ ఏడాది మొబైల్ బిల్లులు 25-18 శాతం తగ్గుతాయని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీ పార్టనర్ హేమంత్ జోషి అన్నారు. వచ్చే ఏడాది 30 శాతం పడిపోయే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. రెండంకెల స్థాయిలో కూడా ధరలు పడిపోవచ్చని కేపీఎంజీ చెబుతోంది. పాపులర్ ప్యాకేజీ ధరల ట్యాగ్లు రూ.250 నుంచి రూ.500 మధ్యలో ఉండగా...వీటి వాలిడిటీ 28 రోజుల నుంచి 84 రోజుల మధ్యలో ఉంది. రోజుకు 8జీబీ డేటా వాడేవారు అత్యధికంగా లబ్ధి పొందనున్నారు. 2016లో రూ.250గా ఉన్న సగటు జీబీ డేటా, ప్రస్తుతం రూ.50కు పడిపోయింది. -
'జియో ధరలతో ఇండస్ట్రీ అతలాకుతలమే'
ముంబై : ప్రైమ్ ఆఫర్ మరో 15 రోజులు, రూ.303తో మరో మూడు నెలలు ఉచిత ఆఫర్లంటూ రిలయన్స్ జియో అనూహ్య ఆఫర్లు ప్రకటించడంపై మళ్లీ ఇండస్ట్రిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జియో ప్రస్తుతం అందిస్తున్న ఛార్జీలు ఇండస్ట్రీని కంటిన్యూగా అంతలాకుతలం చేస్తాయని సెల్యులార్ ఆపరేటర్ బాడీ కోయ్ ఆందోళన వ్యక్తంచేసింది. టెలికాం ఇండస్ట్రీలో అసోసియేట్ అయ్యే బ్యాంకులపై, ఇతరులపై ఈ ప్రమాద ప్రభావం ఎక్కువగా పొంచి ఉన్నదని పేర్కొంది. అయితే తక్కువ ధరలతో సర్వీసులు అందించడం కస్టమర్లకు మంచిదే, కానీ అవి టారిఫ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదోననేదే అతిపెద్ద ప్రశ్నగా మారిందని అభిప్రాయం వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని కోర్టులు, టెలికాం ట్రిబ్యునలే తేల్చాల్సి ఉందన్నారు. టెలికాం ఇండస్ట్రి రూ.4.60 లక్షల కోట్లు వివిధ ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లకు, బ్యాంకులకు రుణపడి ఉంది. జియో ప్రస్తుతం అందిస్తున్న ఈ ధరలు కంటిన్యూగా ఇండస్ట్రీని దెబ్బతీయనున్నాయని, ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ పేమెంట్లు, బ్యాంకుల రుణాల విషయంలో ప్రమాదం పొంచి ఉన్నాయని కోయ్ డైరెక్టర్ రాజన్ మ్యాథ్యూ చెప్పారు. కానీ ప్రత్యేకంగా రిలయన్స్ జియో టారిఫ్స్ పై స్పందించడానికి ఆయన తిరస్కరించారు. జియో మరింత కొంతమంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ముందస్తుగా ప్రకటించిన ప్రైమ్ ఆఫర్ ను మరో 15 పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ 15 రోజుల లోపట ప్రైమ్ ఆఫర్ తో పాటు రూ.303తో రీఛార్జ్ చేసుకున్న వారికి మూడు నెలల పాటు ఉచితంగా సేవలందించనున్నట్టు జియో ప్రకటించింది. -
మోత మోగనున్న మొబైల్ బిల్లులు!
కోల్కత్తా : నాలుగంచెల ఏకీకృత పన్ను విధాన నిర్మాణం ఎట్టేకేలకు విడుదలైంది. ఈ నేపథ్యంలో వేటిపై ఎంత భారం పడనుందని కంపెనీలు అంచనావేసుకుంటున్నాయి. జీఎస్టీ విధానం అమల్లోకి వస్తే వినియోగదారుల మొబైల్ బిల్స్ ఎక్కువగా పెరగనున్నాయని తెలుస్తోంది. మొబైల్ కంపెనీలు వారు అందించే సర్వీసులపై పన్ను రేటు పెరగనుందని, దీనికి అనుగుణంగా కంపెనీలు మొబైల్ బిల్లులపై మోత మోగించనున్నాయని సమాచారం. టెలికాం పరిశ్రమ ప్రస్తుతం 15 శాతం పన్నుల పరిధిలోకి వస్తోంది. అయితే గురువారం జీఎస్టీ మండలి ఆమోదించిన నాలుగంచెల జీఎస్టీ విధానం రేట్లు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్నాయి. టెలికాం పరిశ్రమను 12 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తే, ప్రభుత్వ రెవెన్యూలకు గండికొట్టనుందని, దీంతో ఈ పరిశ్రమను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్‌లు అంటున్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్ మేయింటెన్స్ యాక్ట్, 1968 నేతృత్వంలో టెలికాంలు ముఖ్యమైన సర్వీసులుగా పరిగణించబడుతున్నాయని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(కోయ్) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమైన ఉత్పత్తులు, సేవల కిందకు టెలికాం పరిశ్రమ పన్ను రేట్లను తీసుకురావాలని, 15శాతానికి తక్కువగా పన్ను విధించాలని ఆయన కోరారు. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో సభ్యులుగా ఉన్నాయి. టెలికాం పరిశ్రమపై విధించే ఎక్కువ పన్ను రేట్లతో వినియోగదారుల నెలవారీ సెల్‌ఫోన్ బిల్స్ కూడా 3 శాతం మేర పెరుగనున్నాయని కంపెనీలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వినియోగదారులు చెల్లిస్తున్న నెలవారీ బిల్లు రూ.1000కు అదనంగా రూ.30ల కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నాయి.. అదేవిధంగా పెట్రో ప్రొడక్ట్‌లపై విధించే పన్ను రేట్లు కూడా టెలికాం కంపెనీలపై ప్రభావం చూపనున్నాయని మాథ్యూస్ చెప్పారు. రైల్వే తర్వాత డీజిల్‌కు రెండో అతిపెద్ద వినియోగదారిగా టెలికాం రంగం ఉందని పేర్కొన్నారు.