పాత ఎయిర్‌లైన్స్‌ది గుత్తాధిపత్యం!
రతన్ టాటా తీవ్ర వ్యాఖ్యలు...
* విస్తార, ఎయిర్ ఏషియాలు ముందు దేశీ కార్యకలాపాలపై దృష్టిపెట్టాలి
* స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్ సూచన
న్యూఢిల్లీ: భారత్‌లోని పాత ఎయిర్‌లైన్స్ సంస్థలు గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ధ్వజమెత్తారు. వివాదాస్పదమైన 5/20 నిబంధనను కొనసాగింపజేసేవిధంగా పాత ఎయిర్‌లైన్స్ ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నాయని... ఇది గుత్తాధిపత్యమేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే, దీనిపై స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్ తీవ్రంగానే స్పందించారు.
ముందుగా టాటాలు తమ విస్తార, ఎయిర్‌ఏషియా ఇండియా ఎయిర్‌లైన్స్ ద్వారా దేశీయంగా పూర్తిస్థాయిలో సేవలందిస్తే మంచిదని.. ఆ తర్వాత విదేశీ కార్యకలాపాలపై దృష్టిపెట్టాలంటూ రతన్ టాటాకు సూచించారు. ఈ రెండు సంస్థలను తమ విదేశీ భాగస్వామ్య సంస్థలే నియంత్రిస్తున్నాయని.. పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నాయని కూడా సింగ్ ఆరోపించారు. అంతేకాకుండా, లెసైన్స్‌కు దరఖాస్తు చేసుకునేటప్పుడు 5/20 నిబంధనలను పాటిస్తామంటూ చెప్పిన ఈ కంపెనీలు.. ఇప్పుడు వాటిని తీవ్రంగా వ్యతిరేకించమేంటని కూడా ఆయన ప్రశ్నించారు.
సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఏషియాల భాగస్వామ్యంతో టాటా గ్రూప్... విస్తార, ఎయిర్ ఏషియా ఇండియాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఏషియా ఇండియా రెండేళ్ల క్రితం ప్రారంభం కాగా, దీనికి ప్రస్తుతం 6 విమానాలు ఉన్నాయి. ఇక 2015 జనవరిలో మొదలైన ‘విస్తార’ తొమ్మిది విమానాలతో సర్వీసులు నడుపుతోంది.
ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఏదైనా ఒక దేశీయ ఎయిర్‌లైన్ కంపెనీకి కనీసం 5 ఏళ్ల నిర్వహణ అనుభవం, కనిష్టంగా 20 విమానాలు ఉంటేతప్ప అంతర్జాతీయ రూట్లలో విమానాలు తిప్పేందుకు అనుమతి లేదు. దీన్నే 5/20 రూల్‌గా వ్యవహరిస్తున్నారు. టాటాల ఎయిర్‌లైన్స్‌కు దీనివల్ల ఇబ్బందిగా మారింది. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఖరారు చేయనున్న కొత్త పౌర విమానయాన పాలసీలో 5/20 నిబంధనను పూర్తిగా తొలగించే ప్రతిపాదన కూడా ఉండటం గమనార్హం. దీన్ని స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో, గోఎయిర్ సహా పలు పాత విమానయాన కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
రతన్ టాటా మాత్రం 5/20 నిబంధనను తొలగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను స్వాగతించడమే కాకుండా, దీన్ని సాకారం కాకుండా పాత ఎయిర్‌లైన్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. వాళ్ల లాబీయింగ్ చాలా దురదృష్టకరమని, కొత్తగా వచ్చిన ఎయిర్‌లైన్స్ ప్రయోజనాలను దెబ్బతీస్తాయనేది రతన్ వాదన. పోటీకి భయపడుతున్న కొన్ని సంస్థలే తమ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు.