హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత విమానాశ్రయాల వ్యాపారంలోకి టాటా గ్రూప్ ప్రవేశించింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌లో 20 శాతం వాటా కొనుగోలు చేయడం ద్వారా ఈ ఎంట్రీ ఇచ్చింది. టాటా గ్రూప్‌తోపాటు సింగపూర్ వెల్త్ ఫండ్ జీఐసీ 15 శాతం, ఎస్‌ఎస్‌జీ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ 10 శాతం వాటాను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో దక్కించుకున్నాయి. వాటా కొనుగోలు కోసం ఈ మూడు కంపెనీలు రూ.8,000 కోట్లకుపైగా వెచ్చించనున్నాయి. ఇందులో రూ.3,560 కోట్లు టాటా గ్రూప్ చెల్లిస్తోంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఇప్పటి వరకు జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 92 శాతం, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు, ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్‌కు 8 శాతం వాటాలు ఉండేవి. డీల్ పూర్తి అయ్యాక జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాటా 53 శాతానికి, ఎంప్లాయీస్ వెల్ఫేర్ ట్రస్ట్ వాటా 2 శాతానికి వచ్చి చేరుతుంది.
భారీ పీఈ డీల్ ఇదే..
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) ఇన్వెస్టర్లు అయిన మెక్వరీ–ఎస్‌బీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టాండర్డ్ చార్టర్డ్ ప్రైవేట్ ఈక్విటీ–3 (మారిషస్), జేఎం ఫైనాన్షియల్ ఓల్డ్ లేన్ ఇండియా కార్పొరేట్ అపార్చునీటీస్ ఫండ్‌కు 5.86 శాతం వాటా ఉంది. ఈ వాటా కోసం జీఐసీ రూ.2,670 కోట్లు, ఎస్‌ఎస్‌జీ రూ.1,780 కోట్లు చొప్పున వెచ్చిస్తున్నాయి. విమానాశ్రయాల రంగంలో దేశంలో ఇదే అతి పెద్ద పీఈ డీల్ కావడం గమనార్హం. ఇక పెట్టుబడుల్లో రూ.1,000 కోట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఈక్విటీ రూపంలో ఉంటుంది. మిగిలిన రూ.7,000 కోట్లతో జీఎంఆర్ ఇన్‌ఫ్రా, దాని అనుబంధ కంపెనీల నుంచి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కు చెందిన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తాయి. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ విలువ రూ.18,000 కోట్లుగా లెక్కించారు. వచ్చే అయిదేళ్లలో రాబడులు రూ.4,475 కోట్లతో కలిపి పెట్టుబడుల తదనంతరం మొత్తం విలువ (పోస్ట్ మనీ వాల్యుయేషన్) రూ.22,475 కోట్లుగా గణించారు. మంగళవారం జీఎంఆర్ ఇన్‌ఫ్రా మార్కెట్ క్యాప్ రూ.11,709 కోట్లుగా ఉంది. డీల్ తర్వాత జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో మేనేజ్‌మెంట్ కంట్రోల్ జీఎంఆర్ ఇన్‌ఫ్రా చేతుల్లోనే ఉంటుంది. బోర్డులోకి కొత్త ఇన్వెస్టర్లు వచ్చి చేరతారు.
తగ్గనున్న జీఎంఆర్ రుణ భారం..
విమానాశ్రయాల వ్యాపారాన్ని లిస్టెడ్ కంపెనీ అయిన జీఎంఆర్ ఇన్‌ఫ్రా నుంచి విడదీయాలన్నది గ్రూప్ ప్రణాళిక. ప్రస్తుతం విమానాశ్రయాల వ్యాపారం నుంచి జీఎంఆర్ ఇన్‌ఫ్రాకు 60% ఆదాయం సమకూరుతోంది. తాజా డీల్‌తో జీఎంఆర్ ఇన్‌ఫ్రా రుణ భారం భారీగా తగ్గుతుందని కంపెనీ ఎండీ గ్రంథి కిరణ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ‘విమానాశ్రయాల వ్యాపారాన్ని విడగొట్టడం ద్వారా కంపెనీ పునర్ వ్యవస్థీకరణ జరుగనుంది. బ్యాలెన్స్ షీట్ మరింత పటిష్టం అవుతుంది’ అని వివరించారు. జీఎంఆర్ ఇన్‌ఫ్రాకు సుమారు రూ.20,000 కోట్ల నికర అప్పులు ఉన్నాయి. ఇందులో రూ.6,800 కోట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కు సంబంధించినవి. కాగా, బుధవారం జీఎంఆర్ ఇన్‌ఫ్రా షేరు ధర ఒకానొక దశలో రూ.21.25 దాకా వెళ్లింది. క్రితం ముగింపుతో పోలిస్తే 0.26 శాతం తగ్గి 19.40 వద్ద స్థిరపడింది.
చేతిలో కొత్త ప్రాజెక్టులు..
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ గోవా ఎయిర్‌పోర్టును రూ.1,880 కోట్లతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈక్విటీ కింద రూ.550 కోట్లు, రుణాల ద్వారా రూ.1,330 కోట్లు వెచ్చిస్తోంది. ప్రాజెక్టు జీవిత కాలం 40 ఏళ్లు. ఇక నాగ్‌పూర్ విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టును సైతం కంపెనీ చేపట్టనుంది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాలు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహణలో ఉన్నాయి. ఎయిర్‌పోర్టుల వ్యాపారాన్ని డీమెర్జ్ చేసిన తర్వాత ఎనర్జీ, హైవేస్, అర్బన్ ఇన్‌ఫ్రా అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ బిజినెస్‌లను సైతం విడగొట్టాలని భావిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.
విమానాశ్రయాల వ్యాపారంలోకి టాటా
Published Thu, Mar 28 2019 12:00 AM | Last Updated on Thu, Mar 28 2019 12:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment