అవును.. కంపెనీలను తగ్గిస్తాం
న్యూయార్క్: ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ దాకా విస్తరించిన టాటా గ్రూప్... ‘వెయిట్‌లాస్’ ట్రీట్‌మెంట్‌ను మొదలుపెడుతోంది. ప్రస్తుతం వందకుపైగానే ఉన్న గ్రూప్ కంపెనీల సంఖ్యను కచ్చితంగా తగ్గిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. పతాక శీర్షికల కోసం తాము ఏదైనా వ్యాపారం నుంచి వైదొలగాలని భావించడం లేదని, రాబడులు ఇవ్వని వ్యాపారాలను మాత్రమే వదిలేయాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విఖ్యాత ఫార్చూన్ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాలను వెల్లడించారు. కాగా, టెక్నాలజీ సంబంధ కంపెనీలన్నింటినీ సాఫ్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్ గూటికిందికి...
అలాగే ఇతరత్రా సారూప్యతలున్న కంపెనీలను మరికొన్ని పెద్ద కంపెనీల్లో కలిపేసే ప్రణాళికల్లో టాటా గ్రూప్ ఉందంటూ ఇటీవల కొన్ని కథనాలు వచ్చిన నేపథ్యంలో చంద్రశేఖరన్ వ్యాఖ్యలు దీన్ని ధ్రువీకరించినట్లయింది. ‘ఇప్పటికే మాది 100 బిలియన్ డాలర్ల గ్రూప్. ఈ వృద్ధిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలంటే... పెద్ద కంపెనీలు అవసరం. ఎక్కువ సంఖ్యలో చిన్నచిన్న కంపెనీలతో భారీ వృద్ధి సాధ్యం కాదు. అందుకే మాకు ఇప్పుడు టాప్ కంపెనీలు కావాలి. అయితే, ఆయా వ్యాపార రంగాల్లో మాకున్న ప్రతి కంపెనీ నంబర్ వన్ లేదా రెండో ర్యాంకులో ఉండాలనేది నా అభిప్రాయం కాదు. టాప్ కంపెనీలు మాత్రం అత్యవసరం’ అని టాటా గ్రూప్ అధిపతి వివరించారు.
పనితీరు మెరుగ్గా ఉండాల్సిందే...
‘ఇప్పుడు రాబడులు ఇవ్వని కంపెనీలు రానున్న రోజుల్లో ఇస్తాయని నేను అనుకోను. అలాంటి వ్యాపారాల నుంచి వైదొలగుతాం. దీని గురించి చాలా ఆలోచించా. తప్పనిసరిగా కంపెనీల సంఖ్య(పోర్ట్‌ఫోలియో)ను తగ్గించుకుంటాం. గ్రూప్ నిర్వహణలో ఉన్న ప్రతీ కంపెనీ పనితీరు మెరుగ్గా ఉండాల్సిందే. వృద్ధి రేటు, లాభదాయకత, పెట్టుబడులపై రాబడి వంటి అంశాలన్నీ సమీక్షిస్తాం. పనితీరు బాగోలేకుంటే గ్రూప్‌లో ఉండటానికి అర్హత లేనట్టే. వేగంగా పరుగెత్తాలంటే బరువును తగ్గించుకొని సన్నబడాల్సిందే’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
నాకు చాలా స్వేచ్ఛ ఉంది...
టాటా గ్రూప్‌లో ప్రధాన వాటాదారులైన టాటా ట్రస్టులకు బోర్డు నిర్ణయాల గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పడంలో తప్పేముందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. అయితే, ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించి ఏం చేస్తున్నామనేది తాను ట్రస్టులకు వివరించడం లేదన్నారు. ఇక నానో కారు విషయంలో టాటా మోటార్స్‌కు ఇతర ప్రాధామ్యాలు ఉన్నాయని చెప్పారు. ‘దేశీయంగా టాటామోటార్స్ కార్ల విక్రయాలు చాలా తక్కువ. అందులోనూ ఈ నానో అనేది మరింత చిన్న విభాగం. నానో ప్లాంట్‌ను మూసేయాలన్న నిర్ణయాన్ని తమ బోర్డు తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఇక గ్రూప్ చైర్మన్‌గా నాకు చాలా స్వేచ్ఛ ఉంది’ అని చంద్ర పేర్కొన్నారు. అయితే, ఏదైనా నిర్ణయం తీసుకునేముందు మేనేజ్‌మెంట్‌తో విస్తృతంగా చర్చిస్తామన్నారు. కాగా, మిస్త్రీ కుటుంబంతో టాటా సన్స్ బంధం ఎలా ఉండబోతోందన్నదానిపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. మిస్త్రీతో వివాదం అంశం కోర్టుల్లో ఉన్నందున తాను దీనిపై మాట్లాడబోనని తేల్చిచెప్పారు.