సెన్సెక్స్ను పడేసిన టాటా షేర్లు
• 88 పాయింట్ల నష్టం
• 17 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
ముంబై: టాటా గ్రూపు యాజమాన్య మార్పిడికి సంబంధించిన అనూహ్య పరిణామాలతో ఆ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 88 పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్ల చొప్పున నష్టపోయి వరుసగా 28,091.42, 8691.30 పాయింట్ల వద్ద ముగిశాయి. దీంతో సోమవారం నాటి లాభాలు ఆవిరైపోయాయి. టాటా గ్రూపు చైర్మన్‌గా సైరస్ మిస్త్రీకి హఠాత్తుగా ఉద్వాసన పలకడం.... దీనిపై మిస్త్రీ, టాటాల మధ్య న్యాయపరమైన పోరాటం మొదలు కావడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. ఈ పరిణామాలు అటు విదేశీ ఇన్వెస్టర్లను సైతం ప్రభావితం చేశాయి. మరోవైపు గురువారంతో అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల కాల వ్యవధి తీరనుండడం వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది. కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం, టాటా గ్రూపులో నెలకొన్న సందిగ్ధత వల్ల మార్కెట్ నెగటివ్ జోన్‌లో ట్రేడ్ అయ్యిందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
టాటా షేర్లకు అమ్మకాల ఒత్తిడి: టాటా గ్రూపు నిర్వహ ణలో అనిశ్చితితో ఆ కంపెనీల షేర్లు మంగళవారం మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. టాటా స్టీల్ 2.51 శాతం, టాటా పవర్ 1.5 శాతం, టీసీఎస్ 1.20 శాతం, టాటా మోటార్స్ 1.07 శాతం చొప్పున నష్టపోయాయి. టీసీఎస్ మార్కెట్ విలువ రూ.5753 కోట్లు, టాటా మోటార్స్ మార్కెట్ విలువ రూ.2432 కోట్లు, టాటా స్టీల్ రూ.1039 కోట్లు కరిగిపోయింది. టాటా స్పాంజ్ ఐరన్ 3 శాతం, టాటా కాఫీ 2.63 శాతం, టాటా గ్లోబల్ బెవరేజెస్ 2.47 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 2.26 శాతం, టాటా కెమికల్స్ 2.09 శాతం, టాటా ఎలెక్సీ 1.40 శాతం చొప్పున నష్టపోయాయి.