వచ్చే నెలలోనే టాటా జెస్ట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఆగస్టులో కాంపాక్ట్ సెడాన్ ‘జెస్ట్’ విడుదల చేయనుంది. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. 16 అంగుళాల అలాయ్ వీల్స్, క్లైమేట్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, వాయిస్ కంట్రోల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, బ్లూటూత్, నావిగేషన్ వంటి సౌకర్యాలున్నాయి. వేరియంట్‌బట్టి ధర రూ.5-7.5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
సెప్టెంబరులో హ్యాచ్‌బ్యాక్ ‘బోల్ట్’ మార్కెట్లోకి రానుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. ధర రూ.4-6.5 లక్షల మధ్య ఉండొచ్చు. టచ్ స్క్రీన్ మల్టీమీడియా సిస్టమ్, వాయిస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లున్నాయి. జెస్ట్, బోల్ట్ కార్లలో రెవోట్రాన్ 1.2 లీటర్ టర్బో చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్లను పొందుపరుస్తున్నారు. స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ ఇలా 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అలాగే టాటా నానో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ఆగస్టులో విడుదల కానుంది.
కొత్త ఇంజన్‌తో..: మూడు ఇంజన్ల సమ్మేళనమే రెవోట్రాన్ టెక్నాలజీ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం దక్షిణ, తూర్పు ప్రాంత నేషనల్ సేల్స్ హెడ్ ఆశీష్ ధార్ తెలిపారు. దేశంలో తొలిసారిగా ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు చెప్పారు. మార్కెట్లో కంపెనీ వాటా పెరిగేందుకు రెవోట్రాన్ దోహదం చేస్తుందన్నారు. శుక్రవారమిక్కడ జీవీకే వన్‌లో రెవోట్రాన్ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మా ట్లాడారు. రాబోయే మోడళ్లనూ రెవోట్రాన్‌తో తయారు చేస్తామన్నారు. ఇతర మోడళ్లతో పోలిస్తే మైలేజీ 5-7% ఎక్కువని, 25-30% అధిక శక్తినిస్తుందని చెప్పారు. ఇంజిన్‌పై అవగాహన కల్పించేందుకే రెవోట్రాన్ ల్యాబ్‌లను 15 నగరాల్లో ఏర్పాటు చేసినట్టు ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
ఏటా 2 మోడళ్లు..: ప్యాసింజర్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ ఏటా రెండు నూతన మోడళ్లను పరిచయం చేయనుంది. 2020 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. కైట్, నెక్సన్ మోడళ్లు ఏడాదిలో మార్కెట్లోకి రానున్నాయి. సఫారీ స్టార్మ్, వెంచర్ మోడళ్లను పునరావిష్కరించనుంది. నానోలో మరిన్ని వేరియంట్ల విడుదలకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. నానో హైబ్రిడ్ మోడల్.. ఇ-రెవ్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఇక భారతీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమ ఈ ఏడాది 7-9% వృద్ధి నమోదు చేస్తుందని ఆశిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.