
స్వతంత్ర డైరెక్టర్లపై విమర్శలు దారుణం!
టాటా-మిస్త్రీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. టాటా గ్రూప్ కంపెనీలు తన హయాంలో పూర్తిగా అదుపుతప్పాయన్న టాటా సన్‌స ఆరోపణలను సైరస్ మిస్త్రీ తిప్పికొట్టారు.
• ఇది దిగజారుడుతనానికి నిదర్శనం...
• టాటా సన్స్ పై మిస్త్రీ ఎదురుదాడి...
ముంబై: టాటా-మిస్త్రీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. టాటా గ్రూప్ కంపెనీలు తన హయాంలో పూర్తిగా అదుపుతప్పాయన్న టాటా సన్‌స ఆరోపణలను సైరస్ మిస్త్రీ తిప్పికొట్టారు. దీనిలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు దేశీ పారిశ్రామిక రంగంలో ఎంతో పేరుప్రఖ్యాతులున్న కొంతమంది గ్రూప్ కంపెనీల స్వతంత్ర డెరైక్టర్లపై టాటా సన్‌స విమర్శలు గుప్పించడంపైనా మండిపడ్డారు. ఇది అత్యంత దురదృష్టకరమైన అంశమని పేర్కొన్నారు. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని అర్ధంతరంగా తొలగించడం.. ఆతర్వాత రతన్ టాటా, టాటా సన్‌స బోర్డు సభ్యులపై మిస్త్రీ తీవ్రమైన ఆరోపణలు చేయడం తెలిసిందే. దీనికిబదులిస్తూ.. తాజాగా టాటా సన్‌స తొమ్మిది పేజీల లేఖను విడుదల చేసింది.
ఇందులో మిస్త్రీపై ఎదురుదాడి చేయడమే కాకుండా ఆయనను విశ్వాసఘాతకుడిగా కూడా అభివర్ణించింది. అంతేకాదు టీసీఎస్ చైర్మన్ పదవి నుంచి కూడా మిస్త్రీని తొలగించింది. గ్రూప్ కంపెనీలకు చెందిన చైర్మన్ పదవుల నుంచి కూడా ఆయనను పీకేయడానికి వేగంగా పావులు కదుపుతోంది. మరోపక్క, కొన్ని గ్రూప్ కంపెనీలకు చెందిన స్వతంత్ర డెరైక్టర్లు మిస్త్రీ నాయకత్వాన్ని సమర్థించడంతో వారిపైనా తీవ్ర విమర్శలు చేయడంతోపాటు పదవుల నుంచి తొలగించే చర్యలు చేపడుతోంది. ‘స్వతంత్ర డెరైక్టర్లుగా నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న వారిపై విమర్శలు చేయడం వ్యూహం ప్రకారమే జరుగుతోంది.
ఇదంతా కావాలనే చేస్తున్నట్లు కనబడుతోంది. ఇది టాటా సన్‌స దిగజారుడుతనానికి నిదర్శనం. దీపక్ పరేఖ్, నుస్లీ వాడియా, నాదిర్ గోద్రెజ్ తొమ్మిది మంది కార్పొరేట్ రంగ ప్రముఖుల ప్రవర్తన, పనితీరులను ప్రశ్నించడం నిజంగా దురదృష్టకరం’ అని మిస్త్రీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండియన్ హోటల్స్ కంపెనీని మిస్త్రీ తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించారని.. ఇందుకోసం ఆయన స్వతంత్ర డెరైక్టర్లను తనకు అనుకూలంగా మలచుకున్నారంటూ టాటా సన్‌స తన లేఖాస్త్రంలో ఆరోపించడం తెలిసిందే.
మద్దతిస్తున్నందుకేనా..
ఇటీవల జరిగిన బోర్డు సమావేశాల్లో ఇండియన్ హోటల్స్, టాటా కెమికల్స్ స్వతంత్ర డెరైక్టర్లు మిస్త్రీ సారథ్యాన్ని సమర్థించడం విశేషం.దీంతో టాటా కెమికల్స్ స్వతంత్ర డెరైక్టర్ పదవి నుంచి నుస్లీ వాడియాను తొలగించేలా టాటా సన్‌స చర్యలు చేపట్టింది.