డీజిల్ నానో ఇప్పట్లో లేనట్లే!
పుణే: చిన్న కారు నానోలో డీజిల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టాలన్న టాటా మోటార్స్ ప్రతిపాదన ఇప్పుడప్పుడే కార్యరూపం దాల్చేట్లు లేదు. ఆర్థిక, సాంకేతికాంశాలు ఇందుకు కారణం. ఈ కారు కోసం తాము రూపొందించిన డీజిల్ ఇంజిన్‌లోని రిఫైన్‌మెంట్ స్థాయి (శబ్దం, వైబ్రేషన్, కాలుష్య నియంత్రణ మొదలైనవి) ప్రస్తుత కొనుగోలుదారులకు ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు టాటా మోటార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీశ్ వాఘ్ తెలిపారు.
పెపైచ్చు డీజిల్ ధరల రీత్యా ఆర్థికంగా చూసుకున్నా ఇది అటు కొనుగోలుదారులకు, ఇటు తయారీదారులకూ గిట్టుబాటు కాకపోవచ్చని పేర్కొన్నారు. అయితే, అలాగని డీజిల్ నానో ప్రతిపాదన ను పూర్తిగా అటకెక్కించినట్లు కాదని, డీజిల్ ఇంజిన్‌ను మరింత మెరుగుపర్చేందుకు కసరత్తు కొనసాగుతుందని వాఘ్ పేర్కొన్నారు. యువతను ఆకట్టుకునేందుకు జెన్‌ఎక్స్ నానో కారును త్వరలోనే ప్రవేశపెట్టబోతున్న టాటా మోటార్స్ డీజిల్ నానో కోసం 2 సిలిండర్ 800 సీసీ ఇంజిన్‌ను తయారు చేసింది.