సాక్షి,ముంబై: దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుక అందించింది. రాబోయే నాలుగైదేళ్లలో మహిళా ఉద్యోగుల నియమాకాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ప్రకటించింది. తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 25శాతం మహిళలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వచ్చే నాలుగు నుండి ఐదు సంవత్సరాలలో 25శాతం మహిళా ఉద్యోగుల లక్ష్యాన్ని భర్తీ చేస్తామనే ఆశాభావాన్ని టాటా మోటార్స్ చీఫ్ హెచ్ఆర్ అధికారి గజేంద్ర చందేల్ వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా తమ ఉద్యోగుల్లో మహిళల సంఖ్యను పెంచుకుంటున కృషిలో తమ సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. 2016 నాటికి మహిళా ఉద్యోగుల సంఖ్య 13శాతానికి, 2017 నాటికి 19 శాతానికి చేరుకుందన్నారు. దీంతో రాబోయే సంవత్సరాల్లో దీన్ని 20-25శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
జెండర్ డైవర్సిటీ లక్ష్యంలో 2014లో టాటా లీడ్ ఇనీషియేటివ్‌లో భాగంగా అయిదుగురు మహిళలను నియమించుకున్నామని, ఇది ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇచ్చిందన్నారు. పురుషులతోపాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు, లింగ సమానత్వాన్ని సాధించేందుదిశగా క్రమంగా, స్థిరంగా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా మహిళల ఎంపిక, సంస్కృతి-భావజాలంలో మార్పు, అభివృద్ధి అనే మూడు అంశాలపై దృష్టి పెట్టినట్టు చందేల్ వివరించారు.
ఒకపుడు 'మహిళలు దరఖాస్తు చేయరాదు' అంటూ నిబంధన విధించి, సుధామూర్తి (ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్) ఆగ్రహానికి గురై, అనంతరం ఆమెనే టాటా మోటర్స్ పూణే ప్లాంట్లో మొట్టమొదటి మహిళా ఇంజనీర్‌గా నియమించుకున్న ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment