
సాక్షి,ముంబై: విద్యుత్ వాహనాలకు పెరగనున్న ఆదరణ నేపథ్యంలో ప్రముఖ కార్ల సంస్థ తన పాపులర్ మోడల్ నెక్సాన్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. ఈ వాహనాల ఉత్పత్తి విషయంలో మరో అడుగు ముందుకేసిన టాటామోటార్స్ నెక్సాన్ ఈవీ పేరుతో మంగళవారం లాంచ్ చేసింది. టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ జిప్ట్రాన్‌తో దీన్ని రూపొందించింది. ఎక్స్‌జెడ్ ప్లస్, లగ్జరీ ఎక్స్ జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్ ఎం అనే మూడు వేరియంట్లలో, మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ రోజు నుండి 22 నగరాల్లోని 60 డీలర్ అవుట్‌లెట్లలో నెక్సాన్ ఈవీ కార్లు అందుబాటులో ఉంటాయి. మరోవైపు నెక్సాన్ ఈవీ బుకింగ్ గత ఏడాది డిసెంబర్ 20 నుండి ప్రారంభమైంది.
టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ.13,99,000 గా ఉండగా, హైఎండ్ మోడల్ ధర రూ .15,99,000 వరకు ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. ఫాస్ట్ డిసి ఛార్జర్‌లో ప్లగ్ చేసినప్పుడు, నెక్సాన్ ఈవీ 60 శాతం బ్యాటరీ సామర్థ్యాన్ని 60 నిమిషాల్లో భర్తీ చేస్తుంది. అలాగే 35 మొబైల్ యాప్ బేస్డ్ కనెక్ట్ ఫీచర్లను కూడా నెక్సాన ఈవీ అందిస్తుంది. ఎనిమిది సంవత్సరాలు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వారంటీతో లభించనుంది. మరో నాలుగు ఎలక్ట్రిక్ ఉత్పత్తులను, రెండు ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్ సెడాన్లను వచ్చే 24 నెలల్లో విడుదల చేయబోతున్నట్లు టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడం అత్యవసరమని అన్నారు. దేశంలో త్వరలోనే విద్యుత్ వాహనానలకు ఆదరణ పెరగనుందని టాటా మోటార్స్ సీఎండీ గుంటెర్ బుట్షేక్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment