టాటా మోటార్స్‌కు జేఎల్‌ఆర్‌ సెగ  | Tata Motors Q1 results: Weak Jaguar Land Rover sales drive company into 1st quarterly loss in 3 years | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్‌కు జేఎల్‌ఆర్‌ సెగ 

Published Wed, Aug 1 2018 12:41 AM | Last Updated on Wed, Aug 1 2018 12:41 AM

Tata Motors Q1 results: Weak Jaguar Land Rover sales drive company into 1st quarterly loss in 3 years - Sakshi

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో  రూ.3,200 కోట్ల నికర లాభం రాగా ఈ క్యూ1లో  రూ.1,863 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. ఈ కంపెనీ ఈ క్యూ1లో రూ.224 కోట్ల  నికరలాభం సాధించగలదని నిపుణులు అంచనా వేశారు. తొమ్మిదేళ్ల కాలంలో ఇదే అత్యంత అధ్వానమైన త్రైమాసిక ఫలితమని వారంటున్నారు. కాగా, గతేడాది క్యూ1లో జేఎల్‌ఆర్‌ కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణ కారణంగా కంపెనీకి వన్‌టైమ్‌ లాభం కింద రూ.3,600 కోట్ల మేర ప్రయోజనం లభించింది. దీన్ని మినహాయిస్తే.. ఆప్పుడు నికర నష్టం వచ్చినట్లు లెక్క. టాటా మోటార్స్‌ బ్రిటిష్‌ అనుబంధ సంస్థ, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) సమస్యలు టాటా మోటార్స్‌కు భారీ నష్టాలను మిగిల్చాయి. అయితే గత క్యూ1లో రూ.59,818 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 12 శాతం పెరిగి రూ.67,081 కోట్లకు పెరిగిందని టాటా మోటార్స్‌ తెలిపింది.  ఈ ఏడాది మార్చి 31కి రూ.39,977 కోట్లుగా ఉన్న నికర రుణ భారం ఈ ఏడాది జూన్‌ నాటికి రూ.62,436 కోట్లకు పెరిగిందని పేర్కొంది.

మెరుగ్గా స్టాండెలోన్‌ ఫలితాలు.. 
స్టాండెలోన్‌ పరంగా చూస్తే ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. గత క్యూ1లో రూ.463 కోట్ల నికర నష్టాలు రాగా, ఈ క్యూ1లో రూ.1,188 కోట్ల నికర లాభం వచ్చిందని టాటా మోటార్స్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.10,386 కోట్ల నుంచి 62 శాతం వృద్ధితో రూ.16,803 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అమ్మకాలు 59 శాతం వృద్ధితో 1,76,868కు పెరిగాయని,  వాణిజ్య, ప్రయాణికుల వాహన విక్రయాలు జోరుగా ఉండటంతో అమ్మకాలు ఈ స్థాయిలో ఎగిశాయని పేర్కొంది. దేశీయ మార్కెట్లో ప్రయాణికుల వాహనాలు 48 శాతం పెరిగాయి. మొత్తం అమ్మకాలు 61 శాతం వృద్ధితో 1,76,123కు పెరిగాయి. థాయ్‌లాండ్‌లో వాహన తయారీని ఆపేస్తున్నామని, వాహనాలను దిగుమతి చేసుకొని విక్రయాలు మాత్రం కొనసాగిస్తామని టాటా మోటార్స్‌ తెలిపింది. 

అంతా జేఎల్‌ఆర్‌ వల్లే.... 
జేఎల్‌ఆర్‌కు సంబంధించి పలు సమస్యలు తీవ్రమైన ప్రభావమే చూపుతున్నాయని టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. జేఎల్‌ఆర్‌ ఆదాయం 7 శాతం క్షీణించి  520 కోట్ల పౌండ్లకు తగ్గగా, 21 కోట్ల పౌండ్ల నికర నష్టాలు వచ్చాయని  రిటైల్‌ విక్రయాలు 6 శాతం వృద్ధితో 1,45,510కు పెరగ్గా, హోల్‌సేల్‌  విక్రయాలు 10% తగ్గాయని తెలిపారు. ఎల్‌ఆర్‌ అమ్మకాలు యూరప్‌లో 7% తగ్గగా, అతి పెద్ద మార్కెట్‌ అయిన చైనాలో 3% వరకూ తగ్గాయని తెలిపారు. చైనాలో సుంకాల సమస్య విషయమై తాత్కాలిక సమస్యలున్నాయని టాటా మోటార్స్‌ గ్రూప్‌ సీఎఫ్‌ఓ పీబీ బాలాజీ చెప్పారు.  సుంకాలు తగ్గించడంతో చైనాలో వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారని  వివరించారు.

టాటా మోటార్స్‌     ఏడీఆర్‌ 6 శాతం డౌన్‌... 
మన స్టాక్‌ మార్కెట్‌ ముగిసిన తర్వాత టాటా మోటార్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లో లిస్టైన టాటా మోటార్స్‌  ఏడీఆర్‌(అమెరికన్‌ డిపాజిటరీ రిసీట్‌) భారీ నష్టాల్లోకి జారిపోయింది. ఈ వార్త రాసే సమయానికి టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 6.5 శాతం నష్టంతో 18.12 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో నేడు(బుధవారం) స్టాక్‌ మార్కెట్లో ఈ షేర్‌ భారీగానే నష్టపోయే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement