టాటా మోటార్స్‌.. ప్చ్‌! | Tata Motors Q3 profit plunges 96% on losses in India ops, lower JLR profit | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్‌.. ప్చ్‌!

Published Wed, Feb 15 2017 1:03 AM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

టాటా మోటార్స్‌.. ప్చ్‌!

టాటా మోటార్స్‌.. ప్చ్‌!

క్యూ3లో లాభం 96 శాతం డౌన్‌
మరింత పెరిగిన స్టాండెలోన్‌ నష్టాలు
నోట్ల రద్దుతో వాణిజ్య వాహన విక్రయాలు కుదేల్‌
తగ్గిన జేఎల్‌ఆర్‌ లాభాలు
ఇంట్రాడేలో 7 శాతం వరకూ క్షీణించిన షేర్‌


ముంబై: టాటా మోటార్స్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 96 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,953 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.112 కోట్లకు తగ్గిందని టాటా మోటార్స్‌ తెలిపింది. దేశీయ వ్యాపారంలో నష్టాలు, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌ )తక్కువ లాభం సాధించడంతో నికరలాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. నికర అమ్మకాలు రూ.69,398 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.67,865 కోట్లకు,  ఆదాయం రూ.71,616 కోట్ల నుంచి 4 శాతం క్షీణించి రూ.68,541 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది.

జేఎల్‌ఆర్‌ రిటైల్‌ అమ్మకాలు 9 శాతం వృద్ధి చెందినా,   హోల్‌సేల్‌ అమ్మకాలు తక్కువగా ఉండడం, జేఎల్‌ఆర్‌లో మోడళ్లు తక్కువగా ఉండడం, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా వాణిజ్య వాహనాల వ్యాపారంలో క్షీణత... తదితర అంశాల కారణంగా ఆదాయం తగ్గిందని వివరించింది.  నిర్వహణ ఆదాయం 42 శాతం క్షీణించి రూ.5,161 కోట్లకు,  మార్జిన్‌ 490 బేసిస్‌ పాయింట్లు క్షీణించి 7.6 శాతానికి,  వడ్డీ వ్యయాలు 24 శాతం తగ్గి రూ.871 కోట్లకు తగ్గాయని,  పన్ను వ్యయాలు 30 శాతం పెరిగి రూ.867 కోట్లకు చేరాయని పేర్కొంది.

రూ.1,046 కోట్ల స్టాండెలోన్‌ నష్టాలు
 ఇక స్టాండెలోన్‌ ప్రాతిపదికన చూస్తే కంపెనీ నికర నష్టాలు మరింతగా పెరిగాయి. గత క్యూ3లో రూ.137 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.1,046 కోట్లకు పెరిగాయని టాటా మోటార్స్‌ తెలిపింది. ఈ క్యూ2లో నష్టాలు రూ.631 కోట్లుగా ఉన్నాయి. ఆదాయం రూ.10,019 కోట్ల నుంచి 1% వృద్ధితో రూ.10,167 కోట్లకు చేరిందని పేర్కొంది. నిర్వహణ లాభం 85 శాతం తగ్గి రూ.77 కోట్లకు,  మార్జిన్‌ 430 బేసిస్‌ పాయింట్లు క్షీణించి 0.7 శాతానికి చేరినట్లు పేర్కొంది.

జేఎల్‌ఆర్‌ ఓకే...
తమ అనుబంధ సంస్థ, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఆదాయం 578 కోట్ల పౌండ్ల నుంచి 13 శాతం వృద్ధితో 654 కోట్ల పౌండ్లకు పెరిగిందని టాటా మోటార్స్‌  తెలిపింది. ఇక నికర లాభం 44 కోట్ల పౌండ్ల నుంచి 62 శాతం క్షీణించి 17 కోట్ల పౌండ్లకు తగ్గిందని పేర్కొంది. మార్కెటింగ్‌ వ్యయాలు పెరగడం, కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ఖర్చులు అధికంగా ఉండడం, హెడ్జింగ్‌ వ్యయాలు పెరగడం వంటి అంశాలు   ప్రతికూల ప్రభావం చూపాయని తెలిపింది. ఈ క్యూ3లో చైనా జేవీతో కలుపుకొని జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 9 శాతం వృద్ధితో 1,49,288కు పెరిగాయని పేర్కొంది.

కార్ల అమ్మకాలు 31 శాతం అప్‌..
మధ్య, భారీ తరహా వాణిజ్య వాహనాల విక్రయాలు 9% తగ్గగా, ప్రయాణికుల వాహన విక్రయాలు 25% పెరిగాయని టాటా మోటార్స్‌ పేర్కొంది. తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాల్లో పెద్దగా మార్పులేదని వివరించింది. టియాగో మోడల్‌ కార్లకు మంచి స్పందన కారణంగా కార్ల అమ్మకాలు 31 శాతం పెరిగాయని వివరించింది.

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్‌ షేర్‌ ఇంట్రాడేలో 7 శాతం తగ్గి రూ.468ను తాకింది. చివరకు 3.6 శాతం నష్టంతో రూ.487 వద్ద ముగిసింది. అమెరికా స్టాక్‌ మార్కెట్లో టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ కడపటి సమాచారం అందేసరికి 13 శాతం క్షీణించి 32.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో నేడు(బుధవారం) ఈ షేర్‌ భారీ నష్టాలతో ప్రారంభం అవుతుందన్న అంచనాలున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement