టాటా మోటార్స్‌లో పెరిగిన టాటా సన్స్ వాటా
న్యూఢిల్లీ: టాటా సన్స్ సంస్థ, టాటా మోటార్స్‌లో తన వాటాను పెంచుకుంది. టాటా మోటార్స్‌కు చెందిన 5 కోట్ల షేర్లు(1.73% వాటాను) టాటా సన్స్‌కొనుగోలు చేసిందని ఎన్‌ఎస్‌ఈ బల్క్‌డీల్ గణాంకాలు వెల్లడించాయి. ఈ షేర్లను ఒక్కోటి రూ.486.13 సగటు ధరకు కొనుగోలు చేశారు. దీంతో ఈ డీల్‌విలువ రూ.2,431 కోట్లుగా ఉంది. టాటా మోటార్స్ నుంచి సైరస్ మిస్త్రీని డైరెక్టర్‌గా తొలగించేందుకు ఈ నెల 22న టాటా మోటార్స్ ఈజీఎమ్(అసాధారణ సర్వ సభ్య సమావేశం) నేపథ్యంలో ఈ డీల్‌ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ డీల్ నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్ బీఎస్‌ఈలో 3.4 శాతం లాభంతో రూ.470 వద్ద ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈలో ఇంట్రాడేలో 7 శాతం లాభపడి రూ.486ను తాకింది. ప్రస్తుతం టాటా మోటార్స్‌లో టాటా సన్స్‌కు 26.98 శాతం వాటా ఉంది. గత నెలలో నాటకీయంగా జరిగిన పరిణామాల కారణంగా టాటా సన్స్ చైర్మన్ గిరీ నుంచి సైరస్ మిస్త్రీ ఉద్వాసనకు గురయ్యారు. ఆయన స్థానంలోకి వచ్చిన రతన్ టాటా గ్రూప్ కంపెనీలపై తన పట్టు బిగించారు. ఇప్పటికే టాటా ఇండస్ట్రీస్, టీసీఎస్‌ల నుంచి మిస్త్రీ తొలగింపునకు వాటాదారులు ఓకే చెప్పారు.