
టాటా స్టీల్ నికర లాభం రెండు రెట్లు
ఆదాయం 17 శాతం డౌన్
న్యూఢిల్లీ: టాటా స్టీల్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రెండు రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ.337 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ క్యూ1లో రూ.763 కోట్లకు పెరిగిందని టాటా స్టీల్ తెలిపింది. భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు, వ్యయ నియంత్రణ పద్ధతులు, ఇతర ఆదాయం బాగా పెరగడం వల్ల భారీ స్థాయి నికర లాభం సాధించామని పేర్కొంది.
మార్కెట్ పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, దిగుమతులు పెరిగినప్పటికీ మంచి పనితీరును కనబరిచామని టాటా స్టీల్ గ్రూప్ ఈడీ(ఫైనాన్స్, కార్పొరేట్) కౌశిక్ చటర్జీ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.36,427 కోట్ల నుంచి 17 శాతం క్షీణించి రూ.30,300 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు రూ.33,705 కోట్ల నుంచి 14 శాతం క్షీణించి రూ.28,873 కోట్లకు తగ్గాయని తెలిపింది. ధమ్ర పోర్ట్‌లో తమ వాటాను రూ.1,270 కోట్లకు విక్రయించామని, ఇది ఇతర ఆదాయంలో భారీ పెరుగుదలకు తోడ్పడిందని వివరించారు.