ఆ ఐకానిక్‌ కారుకు ‘టాటా  | TataMotors to Stop Production and Sales of Nano cars from April 2020 | Sakshi
Sakshi News home page

ఆ ఐకానిక్‌ కారుకు ‘టాటా 

Published Thu, Jan 24 2019 8:16 PM | Last Updated on Thu, Jan 24 2019 8:20 PM

TataMotors to Stop Production and Sales of Nano cars from April 2020 - Sakshi

సాక్షి, ముంబై: లక్ష రూపాయల కారుగా పేరొందిన భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్  తీసుకొచ్చిన నానో కారు ప్రస్థానానికి  త్వరలో ఫుల్‌ స్టాప్‌ పడనుంది. రతన్ టాటా కలల కారు నానోకు టాటా మోటార్స్ గుడ్ బై చెప్పనుంది. వాహనాల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకొస్తున్న భద్రత, కాలుష్య నియంత్రణపై తాజా నిబంధనల ప్రకారం ఈ కారును రూపొందించలేమన్న సంకేతాలను కంపెనీ గురువారం వెల్లడించింది.  2020 ఏప్రిల్‌ నాటికి ఈ కారు తయారీని పూర్తిగా నిలిపేయనున్నట్లు కంపెనీ ప్రతినిధి పరోక్షంగా ప్రకటించారు. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా నానోను తీర్చిదిద్దడానికి తాము మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో లేమని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ చెప్పారు. నానోతోపాటు మరికొన్ని టాటా ప్యాసెంజర్ వెహికిల్స్ తయారీని కూడా నిలిపేయాలని  భావిస్తున్నట్లు పరీక్ చెప్పారు.

దేశంలోని మధ్య తరగతి ప్రజలకోసం, ఎంట్రీ లెవల్‌ కారుగా బడ్జెట్‌ ధరలో లాంచ్‌ చేసిన నానో కారు అమ్మకాలు, ఉత్పత్తికి  నిలిపివేయనున్నామని మయాంక్‌ వెల్లడించారు. ఈ కారును సనద్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నాం...జనవరిలో కొత్తగా కొన్ని భద్రతా నిబంధనలు వచ్చాయి, ఏప్రిల్‌లో మరికొన్ని రానున్నాయి. అలాగే అక్టోబర్‌లో మరికొన్ని..ఇలా 2020 ఏప్రిల్ నాటికి బీఎస్-6 ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నానో  కార్ల ఉత్పత్తిని కొనసాగించలేమని పేర్కొన్నారు. 

ఇప్పటికే విక్రయాలు  దారుణంగా పడిపోయిన నానో కారు ఆవిర్భావం 2009 సంవత్సరంలో జరిగింది. రూ.లక్ష ధరతో ఈ కారు మార్కెట్‌లోకి వచ్చినా వినియోగదారులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో దాదాపు పదేళ్లలోనే ఈ కారు కథ  కంచికి చేరనుంది. మరోవైపు రతన్‌ టాటా కలల ప్రాజెక్టు  ‘నానో’ కారు మూలంగా పైసా లాభం రాకపోగా, కంపెనీకి గుదిబండగా మారిందని, వేయికోట్ల రూపాయల వరకు నష్టపోయామని టాటా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement