
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జాయింట్ వెంచర్ నుంచి వైదొలగాలన్న టాటామోటర్స్ నిర్ణయం తొలుత తమకు షాక్ కలిగించిందని టాటా హిటాచీ సీనియర్ డైరెక్టర్ షిన్ నకజిమా చెప్పారు. అలాంటి అనూహ్య నిర్ణయాన్ని ఊహించలేదన్నారు. హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలివీ...
టాటా హిటాచీ జాయింట్ వెంచర్‌లో వాటాలను విక్రయానికి ఉంచినట్లు టాటామోటర్స్ గత త్రైమాసిక ఫలితాల సందర్భంగా ప్రకటించింది కదా! ఈ విక్రయం ఎంతవరకు వచ్చింది?
ఒక్కసారిగా టాటాల నుంచి అలాంటి ప్రతిపాదన రావడం విస్మయం కలిగించింది. నిజానికి టాటా హిటాచీ జాయింట్ వెంచర్‌లో పూర్తి వాటా తీసుకునేందుకు హిటాచీకి ఏ అభ్యంతరమూ లేదు. అలాంటప్పుడు మాతో నేరుగా చర్చిస్తారనుకున్నాం. ఈ లోపే టాటాల నుంచి ప్రకటన వచ్చింది. అనంతరం జపాన్ నుంచి హిటాచీ ప్రతినిధులు వచ్చి చర్చలు జరిపారు. ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు.
జేవీలో ఎవరి వాటా ఎంత? కంపెనీ పనితీరు ఎలా ఉంది?
జేవీలో టాటామోటర్స్‌కు 40 శాతం, హిటాచీకి 60 శాతం వాటా ఉంది. మాంద్యం సమయంలో కంపెనీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవటం నిజమే. కానీ 2015 నుంచి మంచి పనితీరు కనబరుస్తోంది. ప్రస్తుతం లాభాల్లోనే నడుస్తోంది. అందుకే వాటాలు విక్రయించాలని టాటా మోటర్స్ భావించి ఉండొచ్చు. వీలున్నంతవరకు జేవీలో వాటాలను విక్రయించడం జరిగితే హిటాచీనే సొంతం చేసుకుంటుంది.
రూపీ క్షీణత ఎంతవరకు ఉండవచ్చు?
రూపాయిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన చర్యలు త్వరలో ఫలితాలనివ్వవచ్చు. రూపీ స్వల్పకాలానికి 74– 75 రేంజ్‌లో స్థిరత్వం పొందవచ్చు.
యెన్ కదలికలు ఇండో జపనీస్ కంపెనీలపై ఎలా ఉండొచ్చు?
డాలర్ ఇండెక్స్ బలపడటంతో ఇతర కరెన్సీల్లాగానే యెన్ సైతం బలహీన పడింది. అయితే ఇటీవల కాలంలో తిరిగి యెన్ పుంజుకుంది. యెన్ బలపడితే ఇండో జపనీస్ కంపెనీలకు ఇబ్బందులు ఉండొచ్చు. కానీ డాలర్ స్థిరపడితే యెన్, రూపీల్లో సైతం స్థిరత్వం వస్తుంది. కరెన్సీల్లో ఈ కల్లోలం మరికొన్ని త్రైమాసికాలు కంపెనీల ఫలితాలపై నెగిటివ్ ప్రభావం చూపవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఎకానమీలు బుల్లిష్‌గా మారుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment