గచ్చిబౌలిని వదలనివారు సీమాంధ్రకా..
- ఐటీ అంటేనే హైదరాబాద్
- ఏపీతో సమానంగా తెలంగాణలో పన్ను ప్రయోజనాలు కల్పిస్తాం
- పెట్టుబడుల మందగమనానికి ఉద్యమం కారణం కాదు
- ఐటీ కంపెనీల ప్రతినిధుల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కంపెనీలు తరలిపోతున్నాయని అంటున్నారు. ఉప్పల్, శంషాబాద్ వద్ద కార్యాలయాన్ని పెట్టుకోండని ఓ కంపెనీకి సూచిస్తే.. గచ్చిబౌలిలోనే పెట్టుకుంటామని ఆ కంపెనీ వారు తెగేసి చెప్పారు. గచ్చిబౌలిని వదలని వారు ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వెళ్తారు’ అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. అసలు ఐటీ అంటేనే హైదరాబాద్ అని తెలిపారు. తెలంగాణకు చెందిన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కంపెనీలు శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసలు పన్ను ప్రయోజనాలు ఏమిటో ఇప్పటికీ స్పష్టత లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏవైతే వర్తిస్తాయో అవే ప్రయోజనాలు తెలంగాణలోనూ అమలవుతాయన్న అంశాన్ని కేంద్రం స్పష్టం చేసిందన్నారు.
ఐటీ హైదరాబాద్
ఐటీ పెట్టుబడులకు తొలి ప్రాధాన్య కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎగుమతుల్లో వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇంక్యుబేషన్ ఫెసిలిటీ ద్వారా మంచి ఆలోచనలు కార్యరూపంలోకి వచ్చేలా ప్రోత్సహిస్తామని అన్నారు. ‘తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ద్వారా ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ విద్య పూర్తి అవగానే విద్యార్థులను పరిశ్రమకు అవసరమైన విధంగా తీర్చిదిద్దుతాం. సామాజిక బాధ్యతలో భాగంగా కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాలి’ అని చెప్పారు. 1,000 మంది విద్యార్థులను తీసుకునేందుకు సైయంట్(ఇన్ఫోటెక్) ముందుకొచ్చింది అని అన్నారు. హైదరాబాద్‌లో చదువు పూర్తి అయిన విద్యార్థులంతా వెంటనే ఉద్యోగం సంపాదించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
చిన్న నగరాలకూ...
కంప్యూటర్ అక్షరాస్యతను తాలూకా స్థాయికి తీసుకువెళ్తామని మంత్రి చెప్పారు. హైస్కూల్ విద్యార్థులకు కనీసం 20 శాతం కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించాలన్నది తమ ధ్యేయమన్నారు. ఇక ఐటీని చిన్న నగరాలకూ తీసుకువెళ్తామని చెప్పారు. ‘వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి జిల్లా ప్రధాన కేంద్రాలు హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లలోపే ఉంటాయి. నిపుణులు దొరకడం లేదని కంపెనీలు చిన్న నగరాలవైపు దృష్టిసారించడం లేదు. ఐటీ పార్కులను ఈ నగరాల్లోనూ పెడతాం’ అని పేర్కొన్నారు. కంపెనీలు ముందుకు రావాలని మంత్రి సూచించారు. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల మాదిరిగా నగరంలోని ఇతర ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఉద్యమం కారణం కాదు
గత ఐదేళ్లుగా పెట్టుబడులు మందగించడానికి తెలంగాణ ఉద్యమం ఏమాత్రం కారణం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్, ఢిల్లీలోని విధాన కర్తల్లో అభివృద్ధి చేయాలన్న తపన లేకపోవడమే కారణమన్నారు. నిర్ణయాత్మక నాయకత్వం తెలంగాణలో, భారత్‌లో ఉందని తెలిపారు. మహేశ్వరం వద్ద రానున్న రెండు హార్డ్‌వేర్ పార్కుల్లో రూ.2,600 కోట్ల పెట్టుబడులు అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఐటీఐఆర్ విషయంలో పారదర్శక విధానం అమలు చేస్తామన్నారు. మూడేళ్లలో విద్యుత్ కొరతలు లేని రాష్ట్రంగా చేస్తామన్నారు.
ఐడియాలకు తోడ్పాటు
మంచి ఐడియాలకు నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర తెలిపారు. ఔత్సాహిక కంపెనీ 50 శాతం పెట్టుబడి పెడితే, ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరుస్తుందని వివరించారు. ప్రైవేటు ఈక్విటీ సంస్థలతోనూ ప్రభుత్వం చర్చిస్తుం దన్నారు. ఐటీ కార్యాలయాలు, ఉద్యోగుల భద్రత విషయంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఐసీటీ పరిశ్రమను తదుపరి స్థాయికి తీసుకు వెళ్లేందుకు పూర్తి మద్ధతు ఉంటుందని హైసియా ప్రెసిడెంట్ రమేశ్ లోగనాథన్ చెప్పారు. 5 ఏళ్లలో కొత్తగా 6 లక్షల ఉద్యోగాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. సమావేశంలో సుమారు 800 మంది పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు.