న్యూఢిల్లీ: ఇటీవల కేంద్ర సర్కార్ కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకొని మార్కెట్‌లో జోష్ నింపిన విషయం తెలిసిందే. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం మందగమనంలో ఉన్న ఉపాధి రంగానికి ఊతమిస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక మందగమనంతో డీలా పడ్డ ముఖ్యమైన రంగాలకు ఊరట లభించింది. కాగా, కన్స్యూమర్, రిటైల్, నిర్మాణం వంటి రంగాలలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వ, పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. ప్రధానంగా భారీగా అమ్మకాలు పడిపోయి సంక్షోభంలో చిక్కుకున్న ఆటో పరిశ్రమ ఉపశమనం లభించినట్ల యిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మ్యాన్ పవర్ సర్వీసెస్ ఇండియా ప్రెసిడెంట్ మన్‌మీత్ సింగ్ మాట్లాడుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్పోరేట్ పన్నుకోత తయారీ రంగంలో పెట్టుబడులు పెరిగి లక్షలాది ఉద్యోగ కల్పనకు సాధ్యపడుతుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంనుంచి కోలుకునే ఆశలు కోల్పోతున్న తరుణంలో, నిర్మలా సీతారామన్ నిజమైన లక్ష్మీ దేవత అవతారంలో ఆదుకున్నారని ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష గోయెంకా ప్రశంసించారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవాలని ప్రార్థిస్తున్న లక్షలాదిమంది భారతీయుల్లో ఆశలునింపారని, మూలధన వ్యయ పునరుద్ధరణకు, కొత్త ఉద్యోగాలు సృష్టికి ఈ చర్య సహాయ పడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
తాజా నిర్ణయంతో ఇప్పుడే దీపావళి వచ్చినట్లుందని మహేంద్ర అండ్ మహేంద్ర ఎండీ పవన్ గోయంకా ట్వీట్ చేశారు. మరోవైపు కాంటినెన్షియల్ ఇండియా టైర్ల కంపెనీకి చెందిన ప్రశాంత్ దొరస్వామి స్పందిస్తూ పెట్టుబడులకు ఎంతో ఉపకరిస్తుందని ఉపాధి రంగానికి సానుకూల అంశమని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సిందేనని అయితే పెట్టుబడులు పెరిగినప్పుడే అనుకున్న లక్ష్యాలు సిద్ధిస్తాయని ఆదిత్య బిర్తా గ్రూపుకు చెందిన సంతృప్త మిశ్రా అన్నారు. ప్రభుత్వం తీసుకున్న పన్ను మినహాయింపులు, అందులో తమ కంపెనీకి చెందిన చాలా ఉత్పత్తులు ఉండడం హర్షించదగ్గ విషయమని డాబర్ కంపెనీకి చెందిన హెచ్‌ఆర్ వికృష్ణన్ అన్నారు. ఉద్యోగులు జీతాల పెరుగుదలకు మరికొంత సమయం వేచి చూడక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment