పన్నుల హేతుబద్దీకరణ, డిజిటలైజేషన్ కీలకం
• బడ్జెట్‌పై హెచ్‌ఎస్‌బీసీ నివేదిక
• ద్రవ్యలోటు గాడి తప్పరాదని సూచన
న్యూఢిల్లీ: పన్నుల హేతుబద్ధీకరణ, డిజిటలైజేషన్ కోసం చర్యలు వచ్చే బడ్జెట్ కీలక అంశాల్లో కొన్నని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– హెచ్‌ఎస్‌బీసీ నివేదిక అంచనావేసింది. వీటితోపాటు గ్రామీణాభివృద్ధికి అధిక కేటాయింపులు, సామాజిక వ్యయాల పటిష్టత కూడా బడ్జెట్‌లో చోటుచేసుకుంటాయని భావిస్తున్నట్లు నివేదిక వివరించింది.
ద్రవ్యలోటు బాట తప్పరాదు...
అయితే ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు బాట (వచ్చే ఏడాది లక్ష్యం జీడీపీలో 3 శాతం) తప్పరాదని నివేదిక కేంద్రానికి సూచించింది. అలాగే వస్తుసేవల పన్ను వల్ల జరిగే నష్టాన్ని రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో కేంద్రం భర్తీ చేయాలని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ ప్రంజుల్ భండారీ పేర్కొన్నారు. కంపెనీలకు మినహాయింపులను తగ్గిస్తూ... పన్నులను ప్రస్తుత 30 శాతం నుంచి 25 శాతానికి క్రమంగా తీసుకువస్తారని విశ్వసిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ వ్యయాలు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలు, రహదారులు, నీటిపారుదల రంగాలపై కేంద్రం దృష్టి సారించే వీలుందని అన్నారు. డిజిటలైజేషన్‌కు తగిన ప్రోత్సాహకాలను బడ్జెట్ కల్పిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కఠిన ప్రతిపాదనలు ఉండకపోవచ్చు: డీఅండ్‌బీ
రాబోయే బడ్జెట్‌లో కఠిన ప్రతిపాదనలేమీ ఉండకపోవచ్చని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(డీఅండ్‌బీ) సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. ఒకవైపు ఆర్థిక అనిశ్చితి, మరోవైపు డీమోనిటైజేషన్ వల్ల డిమాండ్‌పరమైన షాక్‌లతో దేశం పెనుసవాళ్లను ఎదుర్కొంటుండటమే ఇందుకు కారణమని వివరించింది. సంపన్న దేశాల్లో మందగమన ప్రభావం మరిన్ని దేశాలకు విస్తరించే రిస్కులు ఎక్కువగా ఉన్నాయని డీఅండ్‌బీ తెలిపింది. నోట్ల రద్దుతో భారత ఎకానమీ సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుందని వివరించింది. అలాగే, అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు పెరగడం.. దేశీయంగా వృద్ధి వేగం మందగించడం వంటి సవాళ్లు కూడా ఉన్నాయని డీఅండ్‌బీ పేర్కొంది.