జీఎస్‌టీపై కేంద్రం మొబైల్ యాప్
న్యూఢిల్లీ: త్వరలో అమల్లోకి రానున్న వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేకంగా మొబైల్ యాప్ ఆవిష్కరించింది. జీఎస్‌టీలో కొంగొత్త మార్పులు, చేర్పులకు సంబంధించిన అప్‌డేట్ సమాచారాన్ని పన్ను చెల్లింపుదారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వార్ తెలిపారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ డివైజ్‌లకు ఇది అందుబాటులో ఉంటుందని, తర్వాత ఐఓఎస్ వెర్షన్ కూడా ప్రవేశపెడతామని ఆయన వివరించారు.
జీఎస్‌టీ విధానానికి మారేందుకు మార్గదర్శకాలు, ముసాయిదా చట్టం, రిజిస్ట్రేషన్..రిటర్నులు.. రీఫండ్ మొదలైన వివరాలన్నీ ఈ యాప్‌లో ఉంటాయి. ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ తదితర పరోక్ష పన్నుల స్థానంలో ప్రవేశపెట్టనున్న జీఎస్‌టీని జులై 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య తుది చర్చలు జరుగుతున్నాయని గాంగ్వార్ వివరించారు.