దేశీయ అతిపెద్ద టెక్ కంపెనీ టీసీఎస్
ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) వద్ద భారీ మొత్తంలో నగదు నిల్వలు ఉన్నాయి. గత ఏడాదే ఇన్వెస్టర్ల నుంచి రూ.16,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసిన టీసీఎస్, ఈ ఏడాది కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 16,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదించినట్టు పేర్కొంది. ఒక్కో షేర్‌ను రూ. 2,100 ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 1.99 శాతం అంటే రూ.16 వేల కోట్ల షేర్ బైబ్యాక్‌కు బోర్డు ఆమోదం తెలిపినట్టు టీసీఎస్ ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35కు బోర్డు మీటింగ్ ముగిసిన అనంతరం కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.2100 చెల్లించనుంది. ఇది నేటి స్టాక్ ప్రారంభ ధర రూ.1800కు 17 శాతం ప్రీమియం.
‘ముందుగా ప్రకటించిన మాదిరిగా కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నేడు సమావేశమయ్యారు. 7,61,90,476 వరకు ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. ఆ మొత్తం రూ.16 వేల కోట్ల వరకు ఉంటుంది. అంటే మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 1.99 శాతం. ఒక్కో షేరుకు రూ.2100 చెల్లించనున్నాం’ అని టీసీఎస్ నేడు మార్కెట్ ఫైలింగ్‌లో తెలిపింది. . గత ఏడాది బైబ్యాక్ చేసిన తరవాత కంపెనీ బోనస్ ఇష్యూ కూడా ఇచ్చింది. షేర్ బైబ్యాక్ ప్రకటించగానే.. టీసీఎస్ షేర్లు భారీగా ర్యాలీ చేపట్టాయి. సుమారు 3 శాతం మేర పైకి ఎగిసి, 52 పాయింట్ల లాభంలో రూ.1840.90 వద్ద ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment