వినీత్ నయ్యర్ పారితోషికం రూ.182 కోట్లు
2015-16లో టెక్‌మహీంద్రా వైస్ చైర్మన్ అత్యధిక ఆర్జన
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ 2015-16 సంవత్సరంలో అందుకున్న ప్యాకేజీ అక్షరాలా రూ.181.74కోట్లు. దేశంలో అత్యధికంగా పారితోషికం అందుకున్న ఎగ్జిక్యూటివ్‌గా ఆయన రికార్డు సృష్టించారు. ఈ వేతన ప్యాకేజీలో స్టాక్ ఆప్షన్లను నగదుగా మార్చుకున్న మొత్తం కూడా కలిపి ఉంది. వేతనం రూపంలో రూ.1.27 కోట్లు రాగా... మిగిలిన మొత్తం స్టాక్ ఆప్షన్లను విక్రయించడం వల్ల సమకూరినట్టు కంపెనీ వార్షిక నివేదిక తెలియజేసింది. టెక్‌మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా నయ్యర్ 2015 ఆగస్ట్ 9న పదవీ విరమణ చేయగా... ఆయనకున్న అనుభవం దృష్ట్యా తిరిగి అడిషనల్ డైరక్టర్‌గా నియమించి వైస్ చైర్మన్ హోదా కట్టబెట్టారు. కాగా, టెక్ మహీంద్రా ఎండీగా ఉన్న సీపీ గుర్నానీ సైతం గత ఆర్థిక సంవత్సరంలో రూ.45.27 కోట్ల వేతనాన్ని అందుకున్నారు.