తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య రిజిస్టర్డ్ ఆఫీసుల బదిలీ జటిలం | Telangana, AP states complicate the transfer of the registered office | Sakshi
Sakshi News home page

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య రిజిస్టర్డ్ ఆఫీసుల బదిలీ జటిలం

Published Sat, Jun 28 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య రిజిస్టర్డ్ ఆఫీసుల బదిలీ జటిలం

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య రిజిస్టర్డ్ ఆఫీసుల బదిలీ జటిలం

 సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత కంపెనీల నమోదిత కార్యాలయాల బదిలీ ప్రక్రియ మరింత జటిలమయింది. దీంతో అటు వెళదామా లేక ఇక్కడే ఉందామా అన్న ఊగిసలాటలో  పలు కంపెనీల యాజమాన్యాలు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.   దీనికి కారణం...రాష్ట్ర విభజనకు సంబంధించి, అపాయింటెడ్ డే(జూన్ 2) ప్రకటించిన తర్వాత నమోదిత కార్యాలయాన్ని ఒక రిజిస్ట్రార్ పరిధి నుండి ఇంకో రిజిస్ట్రార్ పరిధిలోకి మార్చాలంటే చాలా ప్రొసీజర్ పాటించాల్సి వస్తోంది.

ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే కనీసం 45 రోజుల నుండి 60 రోజుల వ్యవధి అవసరం అవుతోందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ అధికారులు చెబుతున్నారు. అపాయింటెడ్ డే కన్నా ముందు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నుండి వైజాగ్, విజయవాడ, తిరుపతి లాంటి ప్రాంతాలకు( అంటే ఒకే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు )నమోదిత కార్యాలయాన్ని బదిలీ చేయడానికి సింపుల్ ప్రొసీజర్ ఉండేది.
 
బదిలీ కోరుతూ ఫారమ్-18ను దాఖలు చేస్తే బదిలీకి అనుమతులు లభించేవి. ఈ ప్రక్రియ తెలిసిన దాదాపు 750 కంపెనీలు సరళమైన తేలికైన పద్ధతిలో తమ నమోదిత కార్యాలయాలను అపాయింటెండ్ డే కన్నా ముందు మార్చుకున్నాయి. అయితే అవగాహన లేక  ఈ వెసులుబాటు ఉపయోగించుకోని కంపెనీలు ఇప్పుడు సతమతమవుతున్నాయి. నమోదిత కార్యాలయాల బదిలీలో కంపెనీ చట్టం 2013 మరింత కఠినమైన ప్రొవిజన్స్ పెట్టింది. ప్రస్తుతం తెలంగాణలో 73,260 కంపెనీలు, ఏపీలో 19,647 కంపెనీలు నమోదై ఉన్నాయి. తెలంగాణలో నమోదైన కంపెనీలలో 80% కంపెనీలు ఏపీలో వివిధ ప్రాంతాల్లో నమోదిత కార్యాలయాలను బదిలీ చేసుకోనున్నాయని కార్పొరేట్ వర్గాల అంచనా. అపాయింటెడ్ డే తర్వాత ఇంత వరకు తెలంగాణలో 129 కంపెనీలు నమోదయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో 187 కంపెనీలు నమోదయ్యా యి. తెలంగాణ రాష్ట్ర కం పెనీలకు టీజీ , ఆంధ్ర ప్రదేశ్ కంపెనీలకు ఏపీ ఐడెంటీతో కార్పొరేట్ గుర్తింపు నెంబర్లు(సిన్ నంబర్లు) కేటాయిస్తున్నారు.
 
చిన్న కంపెనీలకు భారం ఎక్కువ
రిజిస్టర్డ్ కార్యాలయం బదిలీకి చిన్న కంపెనీలకు భారం ఎక్కువ. ఉదాహరణకు లక్ష రూపాయల పెయిడ్‌అప్ క్యాపిటల్ స్థాయి కంపెనీలు బదిలీ కోసం పాతిక వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. బదిలీకి సంబంధించి రెండు దిన పత్రికలలో  పత్రికా ప్రకటన మొదలు ప్రతి డిబెంచర్ హోల్డర్, డిపాజిటర్, క్రెడిటార్‌లకు విధిగా వ్యక్తిగత నోటీసులు పంపాలని చట్టం నిర్దేశిస్తోంది. అంతేగాక నమోదిత కార్యాలయ బదిలీ చేయటం ద్వారా కంపెనీలో పనిచేసే ఏ ఉద్యోగినీ తొలగించటం లేదని సంస్థ డెరైక్టర్లు ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement