
సాక్షి, చెన్నై : జర్మనీ, లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ విద్యార్థులకు అందించడానికి ముందుకు వచ్చింది. భారతీయ విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ‘స్కిల్ నెక్ట్స్’ కార్యక్రమాన్ని క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ప్రారంభించింది. చెన్నైలోని బీఎండబ్ల్యూ ప్లాంట్ 11వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా మన దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు 365 బీఎండబ్ల్యూ ఇంజిన్ ట్రాన్సిమిషన్లను ఉచితంగా అందించనుంది. ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న వారు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశించే విద్యార్థులకు ‘స్కిల్ నెక్ట్స్’ ఎంతగానో తోడ్పాటు అందిచనుంది.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. మన దేశంలోని ఆటోమేటిక్ ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడంలో ‘స్కిల్ నెక్ట్స్’ ఉపయోగపడుతుందని గట్టిగా నమమ్ముతున్నానని అన్నారు. బీఎండబ్ల్యూ ఇంజిన్, ట్రాన్స్‌మిషన్‌ల సాయంతో విద్యార్థులు అధునాతన శిక్షణ పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా అన్నా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి బీఎండబ్ల్యూ ఇంజిన్, ట్రాన్స్‌మిషన్‌లను కారులో బిగించారు.
బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రం పవాహ్ మాట్లాడుతూ.. లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధి గణనీయంగా పెరుగుతుందన్నారు. అందుకు తగ్గట్టు నైపుణ్యం ఉన్న ఉద్యోగులు లభించడం లేదన్నారు. తాము ప్రారంభించిన ‘స్కిల్ నెక్ట్స్’ కార్యక్రమంలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.







Comments
Please login to add a commentAdd a comment