దూసుకుపోయిన పసిడి, వెండి
ముంబై : ముంబై బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్లు 10 గ్రాముల ధర గురువారం ధరతో పోల్చితే రూ.495 పెరిగి రూ.26,995కు చేరింది. 22 క్యారెట్ల ధర కూడా అంతే స్థాయిలో ఎగసి రూ.26,845కు ఎగసింది. జూన్ 19 తరువాత రేట్లు ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. ఇక కేజీ వెండి విషయానికి వస్తే- రూ.240 పెరిగి రూ.37,035కు చేరింది. ఈ రేటు కూడా రెండు నెలల గరిష్ట స్థాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెరుగుదల ధోరణి, దేశంలో స్టాకిస్టుల డిమాండ్ పెరగడం వంటి కారణాలు పసిడి పరుగుకు కారణం. తాజా సమాచారం అందే సరికి నెమైక్స్ కమోడిటీ మార్కెట్‌లో పసిడి ధర (ఔన్స్ 31గ్రా)లాభాల్లో 1,160 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి ధర శుక్రవారం కూడా భారీ లాభాలతో కడపటి సమాచారం అందే సరికి రూ.27,290 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా రూ.100కుపైగా లాభంతో రూ.36,201 వద్ద ట్రేడవుతోంది.