ఒడిదుడుకుల వారం..!
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా
* క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం సెలవు
* ట్రేడింగ్ నాలుగు రోజులే
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ఈ వారం ఒడిదుడుకులమయంగా సాగుతుందని నిపుణులంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల కదలికలు కీలకం కానున్నాయి.
జీఎస్‌టీ బిల్లు ఆమోదంపై అనిశ్చితి వంటి దేశీయ అంశాల కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగాసాగుతుందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ముడి చమురు ధరల పతనం కొనసాగుతున్న నేపథ్యంలో మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్(రీసెర్చ్) వివేక్ గుప్తా చెప్పారు.
అంతర్జాతీయ మార్కెట్లో సెంటిమెంట్లు, రూపాయి కదలికలు, ముడి చమురు ధరలు కూడా ఈ వారం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. కాగా గత వారంలో సెన్సెక్స్ 478 పాయింట్లు లాభపడి 25,519 పాయింట్ల వద్ద ముగిసింది.
అటకెక్కిన జీఎస్‌టీ బిల్లు..!
జీఎస్‌టీ బిల్లు ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందగలదని అందరూ భావించారు. ఇప్పుడు ఆమోదం పొందితేనే అనుకున్న ప్రకారం ఈ జీఎస్‌టీ చట్టం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ బుధవారంతో ముగుస్తాయి. నేషనల్ హెరాల్డ్ విషయమై కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును స్తంభింపజేస్లుండటంతో ఈ బిల్లు ఆమోదంపై నీలినీడలు కమ్ముకున్నాయి.మరోవైపు జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందడం కష్టమేనని ఆర్థిక మంత్రి జైట్లీ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం.
వర్థమాన దేశాల ఈక్విటీల పట్ల జాగ్రత్త
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని షేర్ల ధరలు తక్కువ స్థాయిల్లో ఉండి అంతర్జాతీయ ఫండ్ మేనేజర్లను ట్రాప్‌లో పడేస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్‌ఏ) తాజా సర్వే పేర్కొంది.
అయితే వీటి భవిష్యత్తు ఆర్జన అవకాశాలు బలహీనంగా ఉన్నాయని హెచ్చరించింది. చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుండడం, డాలర్ బలపడుతుండడం, బాండ్‌ఈల్డ్స్ పెరుగుతుండడం వర్థమాన దేశాల స్టాక్‌మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. చైనా జీడీపీ వృద్ధి 2018 కల్లా 5.5 శాతానికి పడిపోతుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని తెలిపింది. కాగా అందరూ అంచనా వేసినట్లుగానే దాదాపు పదేళ్త తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచింది. ఈ రేట్ల పెంపు కారణంగా భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి విదేశీ నిధులు తరలిపోతాయనే ఆందోళన నెలకొన్నది.