సెబీ ‘షెల్‌’ బాంబు! | These 331 shell company stocks have stopped trading from today; do you own any? | Sakshi
Sakshi News home page

సెబీ ‘షెల్‌’ బాంబు!

Published Wed, Aug 9 2017 12:26 AM | Last Updated on Sun, Sep 17 2017 5:19 PM

సెబీ ‘షెల్‌’ బాంబు!

సెబీ ‘షెల్‌’ బాంబు!

331 కంపెనీల్లో ట్రేడింగ్‌ నిలిపివేత
వాటిలో జేకేఐల్, ప్రకాశ్‌ ఇండస్ట్రీస్, పార్శ్వనాథ్‌ వంటివి కూడా
వీటి మార్కెట్‌ విలువ తలా రూ.1,000– 2,000 కోట్ల పైమాటే
ఈ కంపెనీల్లో ఇన్వెస్టర్ల వాటా దాదాపు రూ.9,000 కోట్లు బ్లాక్‌
ఇన్వెస్టర్లకు విక్రయించి బయటపడే అవకాశమూ ఇవ్వని సెబీ
సవాలక్ష నిబంధనల మధ్య ఇక ప్రతినెలా తొలి సోమవారమే ట్రేడింగ్‌


సెబీ ఆదేశాలు మార్కెట్లపై... ఇంకా చెప్పాలంటే ఇన్వెస్టర్లపై సర్జికల్‌ స్ట్రయిక్‌ లాంటివే. ఎందుకంటే రాత్రికి రాత్రి 331 అనుమానాస్పద షెల్‌ కంపెనీలనూ నిఘా చర్యలకు సంబంధించి (జీఎస్‌ఎం) గ్రేడ్‌–6లో పెడుతున్నట్లు సెబీ ప్రకటించటం వాటిలో ఇన్వెస్ట్‌ చేసిన మదుపరులపై పిడుగుపడేయటమే. ఎందుకంటే సోమవారం వరకూ ఆయా కంపెనీల్లో షేర్లు కొనటం, విక్రయించటం చేసిన ఇన్వెస్టర్లు... మంగళవారం నుంచి వాటిలో ట్రేడింగ్‌ను నిషేధించటంతో హతాశులయ్యారు. వాటిని విక్రయించి బయటపడటానికి కూడా అవకాశం లేకపోవటంతో ఆందోళన చెందారు. ప్రతినెలా తొలి సోమవారంనాడు మాత్రమే వాటిలో ట్రేడింగ్‌ జరుగుతుందని నిబంధనల్లో పేర్కొనటంతో... అప్పటిదాకా వేచి చూడక తప్పని పరిస్థితి. అవి షెల్‌ కంపెనీలో, మోసపూరిత కంపెనీలో అయితే చర్యలు తీసుకోవాల్సింది వాటి ప్రమోటర్లపై తప్ప అందులో ఇన్వెస్ట్‌ చేసిన మదుపరులపై కాదనే విషయాన్ని సెబీ గమనంలోకి తీసుకోలేదన్నది స్పష్టంగా కనిపించింది.

జె– కుమార్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌. 2008 ప్రాంతంలో స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన ఈ షేరు ధర సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి 285 రూపాయలు. దీని మార్కెట్‌ విలువ దాదాపు రూ.2,156 కోట్లు. గతేడాది రూ.1,437 కోట్ల వ్యాపారంపై రూ.105 కోట్ల లాభాన్ని కూడా ఆర్జించింది. ఈ కంపెనీలో ప్రమోటర్ల వాటా 44 శాతం. మిగిలింది మ్యూచ్‌వల్‌ ఫండ్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల చేతుల్లో ఉంది. దీనివిలువ దాదాపు రూ.1,200 కోట్లు. ఇలా ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్లలో యూటీఐ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ వంటి దిగ్గజ ఎంఎఫ్‌లున్నాయి. అయితే ఇది షెల్‌ కంపెనీ అని, దీన్లో ట్రేడింగ్‌ చేయటానికి వీల్లేదని సెబీ సోమవారం రాత్రి వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మరి రూ.1,200 కోట్ల విలువైన షేర్లను ఈ రిటైల్‌ ఇన్వెస్టర్లు గానీ, మ్యూచ్‌వల్‌ ఫండ్లు గానీ ఏం చేస్తాయి? వచ్చేనెల మొదటి వారం వరకూ ఎదురు చూసి... ట్రేడింగ్‌ మొదలయ్యాక విక్రయిస్తే కొనేదెవరు? పోనీ ఇంకొన్నాళ్లు అలాగే ఉంచుకుందామంటే సెబీ ఏకంగా వీటిని తదుపరి డీలిస్ట్‌ కూడా చేసేస్తామని చెబుతోంది. మరి వీళ్ల ఇన్వెస్ట్‌మెంట్లన్నీ

బూడిదలో పోసినట్లేనా?
జె కుమార్‌ ఇన్‌ఫ్రా ఒక్కటే కాదు. రూ.2వేల కోట్ల మార్కెట్‌క్యాప్‌ ఉన్న ప్రకాశ్‌ ఇండస్ట్రీస్, రూ.1,000 కోట్లకుపైగా మార్కెట్‌ క్యాపిటల్‌ ఉన్న రియల్టీ సంస్థ పార్శ్వనాథ్‌ డెవలపర్స్, రూ.500 కోట్లపైనే మార్కెట్‌ క్యాప్‌ ఉన్న ఎస్‌క్యూఎస్‌ ఇండియా బీఎఫ్‌ఎస్‌ఐ లిమిటెడ్‌ వంటి పెద్ద కంపెనీలు చాలానే ఈ జాబితాలో ఉన్నాయి.

అనుమానాస్పద షెల్‌ కంపెనీలైతే?
నిజానికి షెల్‌ కంపెనీలంటే ఏవో నేరం చేసిన కంపెనీలు కావు. ఏ కార్యకలాపాలూ లేకుండా... కేవలం పేపర్‌కు మాత్రమే పరిమితమైన కంపెనీలు. ఇవి పేపర్‌పై కనిపిస్తాయి తప్ప ఎలాంటి కార్యకలాపాలూ ఉండవు. అయితే సెబీ తాను చర్యలు తీసుకున్న జాబితాలోని కంపెనీలను ‘అనుమానాస్పద షెల్‌ కంపెనీలు’ అని మాత్రమే పేర్కొంది. ఆదాయపన్ను శాఖ (ఐటీ), తీవ్ర నేరాల పరిశోధన విభాగం (ఎఫ్‌ఎఫ్‌ఐవో) వివిధ దర్యాప్తుల్లో, వివిధ సందర్భాల్లో అనుమానాలు వ్యక్తం చేయడంతో, వాటి ఆధారంగా ఈ 331 కంపెనీలను షెల్‌ కంపెనీలుగా అనుమానిస్తున్నామంటూ సదరు జాబితాను సెబీకి కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంపించింది. వెంటనే సెబీ వీటిలో ట్రేడింగ్‌ను నిలిపేస్తూ వీటిని జీఎస్‌ఎం–6 గ్రేడ్‌లోకి బదలాయిస్తున్నట్లు రాత్రికి రాత్రే ఆదేశాలిచ్చింది. మొత్తం 331 కంపెనీల్లో కనీసం 124 కంపెనీలు పన్నులు ఎగ్గొట్టాయని భావిస్తుండగా, 175 కంపెనీలు ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. షెల్‌ కంపెనీల జాబితాలో తమ పేర్లు కూడా ఉండడం చూసి పార్శ్వనాథ్‌ డెవలపర్స్, జే కుమార్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌ షాక్‌కు గురయ్యాయి. తమ కంపెనీలు షెల్‌ కంపెనీలు కావని స్పష్టం చేశాయి.

నిజానికి అనుమానాస్పదం... అంటే దానర్థం అవి నిజంగా షెల్‌ కంపెనీలని కాదు! అది తేల్చటానికి ఆయా కంపెనీల ఆడిటింగ్, ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ కూడా చేస్తామని సెబీ పేర్కొంది. అవన్నీ చేసి... ఆ కంపెనీలు ఎలాంటి వ్యాపారమూ చేయకుండానే పేపర్లపై లాభాలు చూపించి ఇన్వెస్టర్లను మోసం చేస్తున్నాయని తేలితే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. వాటిపై ఆడిటింగ్‌ జరుగుతున్నట్లు కూడా బయటకు వస్తుంది కనక... ఆయా కంపెనీలపై నమ్మకం ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే తమ పెట్టుబడులు కొనసాగిస్తారు. లేనివారు అది తేలేలోగానే ఎగ్జిట్‌ అవుతారు. అపుడు ఇన్వెస్టర్లకు కూడా ఎగ్జిట్‌ అవకాశం ఇచ్చినట్లుంటుంది. అలాంటివేవీ లేకుండా... ఆడిటింగ్‌ ఇంకా నిర్వహించకుండానే వీటిపై చర్యలు కూడా తీసేసుకోవటంతోనే అసలు సమస్య వచ్చిపడింది. ఈ 331 కంపెనీలకు సంబంధించి దాదాపు రూ.9,000 కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద బ్లాక్‌ అయిపోయింది.

కేరాఫ్‌ పశ్చిమబెంగాల్‌ 127 అక్కడివే; మహారాష్ట్ర వాటా 50
సెబీ ప్రకటించిన అనుమానిత 331 షెల్‌ (ఉత్తుత్తి) కంపెనీల్లో అధిక శాతం పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందినవి కావడం గమనార్హం. 127 కంపెనీలు ఈ రాష్ట్రానికి చెందినవే ఉన్నాయి. దీని తర్వాత అధికంగా మహారాష్ట్ర నుంచి 50 కంపెనీలు ఉన్నాయి. గుజరాత్, ఢిల్లీలో 30 కంపెనీల చొప్పున ఉండగా, ఒడిశా, అసోం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కంపెనీలు కూడా ఉండడం గమనార్హం. ఈ కంపెనీలను నిఘా చర్యల పరిధిలోకి మార్చాలన్న సెబీ ఆదేశాల మేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు వాటిపై చర్యలు తీసుకున్నాయి. ఫలితం... ఈ 331 కంపెనీలు ఉన్నట్టుండి మంగళవారం ట్రేడింగ్‌కు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో సామాన్య ఇన్వెస్టర్లకు ఏమైందో అంతుబట్టలేదు. ఈ కంపెనీల స్టాక్స్‌లో ప్రతీ నెలా మొదటి సోమవారమే ట్రేడింగ్‌కు అనుమతిస్తారు.

మా పేరు చూసి షాకయ్యాం...
అనుమానిత షెల్‌ కంపెనీల్లో మా పేరు ఉండడం చూసి షాకయ్యాం. కనీసం ఊహల్లోనూ మాది షెల్‌ కంపెనీ కానేకాదు.    
– పార్శ్వనాథ్‌ డెవలపర్స్‌

నిబంధనలను పాటిస్తున్నాం...
ఎక్స్ఛేంజ్‌లతో, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌తో మా కంపెనీ నిబంధనలను అనుసరిస్తున్న విధానం తప్పు పట్టని విధంగా ఉంది.
– జే కుమార్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌

ఆదేశాలు సరికాదు...
సెబీ ఆదేశాల్లో యోగ్యత లేదు. ఇలా చేసి ఉండాల్సింది కాదు. స్టాక్‌ మార్కెట్‌లో మా కంపెనీ తప్పుడు విధానాలకు పాల్పడిన సందర్భమే లేదు.    
– ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌

దిగ్భ్రాంతికి గురిచేసింది...
నిఘా జాబితాలో మా కంపెనీ పేరును చేర్చడం దిగ్భ్రాంతికి గురిచేసింది. అధికారులకు కావాల్సిన అన్ని వివరాలు ఇవ్వడంతోపాటు పూర్తిగా సహకారం అందిస్తాం. ఈ అంశం త్వరగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం.
– ఎస్‌క్యూఎస్‌ ఇండియా బీఎఫ్‌ఎస్‌ఐ లిమిటెడ్‌

ఈ నిబంధనలతో నష్టం కాదా?
నిజంగా తప్పు చేసిన కంపెనీలో, లేదా ఇన్వెస్టర్లను మోసం చేస్తున్న కంపెనీలో అయితే వాటిపై ఎవరెలాంటి చర్యలు తీసుకున్నా తప్పు కాదు. కాకపోతే ఏ కంపెనీపై చర్య తీసుకున్నా... అది అందులో షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లపై ప్రభావం చూపించకుండా ఉండాలి. కానీ సెబీ చర్య మదుపరులపై సర్జికల్‌ స్ట్రయిక్‌గా మారింది. సెబీ చర్యలను పలువురు విమర్శించే పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ఒకసారి చూద్దాం...

(1) నిబంధన: ఆయా కంపెనీల్లో ఇకపై ప్రతినెలా మొదటి సోమవారం మాత్రమే ట్రేడింగ్‌ జరుగుతుంది.
విమర్శ: సెబీ ఈ ఉత్తర్వులు వెలువరించింది ఈ నెల 7వ తేదీ రాత్రి. అంటే మొదటి సోమవారం ట్రేడింగ్‌ అప్పటికే ముగిసిపోయింది. ఆయా కంపెనీల్లో అప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన వారు వైదొలగాలంటే... వచ్చేనెల మొదటి సోమవారం వరకూ వేచి చూడక తప్పదు. అప్పటివరకూ తన పెట్టుబడి ఆయా కంపెనీల్లో లాక్‌ అయిపోయి ఉంటుంది. ఆ లోపు ఏఏ పరిణామాలు జరుగుతాయో ఊహించటం కూడా కష్టం.

(2) నిబంధన: ట్రేడ్‌–టు–ట్రేడ్‌ విభాగంలో ఇవి ట్రేడవుతాయి. షేర్‌ ధర ముందురోజు ముగింపు కన్నా పెరగటానికి వీలుండదు.
విమర్శ: ట్రేడ్‌–టు–ట్రేడ్‌ విభాగమంటే... దానికి సర్క్యూట్లు ఉండవు. అంటే ఒకేరోజు ఎంతయినా పెరగవచ్చు... లేదా ఎంతయినా తగ్గొచ్చు కూడా. ఇలా టీ2టీ విభాగంలో ఉండటం ఒకందుకు మంచిదే. అందరికీ ఎగ్జిట్‌ అయ్యే అవకాశం వస్తుంది. కాకపోతే ఇక్కడో చిక్కుంది. షేర్‌ ధర ముందు రోజు ముగింపుకన్నా పెరగకూడదనే నిబంధన ఉంది. ఉదాహరణకు... ఈ జాబితాలోని షేరు సోమవారంనాడు రూ.200 దగ్గర క్లోజయిందని అనుకుందాం. వచ్చేనెల మొదటి సోమవారం దీన్లో ట్రేడింగ్‌ జరుగుతుంది కానీ ధర మాత్రం రూ.200 కన్నా మించటానికి వీలుండదు. అంటే పెరిగే అవకాశం ఉండదన్న మాట. మరి పెరిగే అవకాశం లేనప్పుడు దీన్నెవరు కొంటారు? స్టాక్‌ మార్కెట్లో కొనే వాళ్లెవరైనా లాభాల కోసమే కదా!! పెరిగే అవకాశం ఉంటుందన్న ఆశతోనే ఎవరైనా షేర్లు కొంటారు. పెరగదని తెలిస్తే ఎవరూ కొనరు కూడా. మరి ఎవరూ కొనుగోలు చేయకపోతే ఒకేరోజు రూ.200 ఉన్న షేరు ధర రూ.10, రూ.5కు పడిపోయినా కూడా ఆశ్చర్యం అక్కర్లేదు. మరి ఈ లెక్కన వీటిలో ఇప్పటి దాకా ఇన్వెస్ట్‌ చేసినవారు దెబ్బతిన్నట్లే కదా!. ఇదెక్కడి తీరు?

331 కంపెనీల జాబితా గిగిగి.  WWW.SAKSHIBUSINESS.COM లో..
సెబీ చర్యలు తీసుకున్న కంపెనీల్లో దేశీయ ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్స్, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా ఉండడం గమనార్హం. జాబితాలోని 331 కంపెనీల్లో కేవలం 162 కంపెనీల స్టాక్స్‌లో ట్రేడింగ్‌ను నెలకోసారికి పరిమితం చేశామని, మిగిలిన కంపెనీల్లోనూ త్వరలో ఇదే విధమైన చర్యలు తీసుకోనున్నట్టు సెబీ అధికారి ఒకరు తెలుపగా, దీనిపై స్పష్టత లేదు. ఇక ఆదాయపన్ను శాఖ, ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు ఫలితాల ఆధారంగా మరిన్ని చర్యలు కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. 37,000 షెల్‌ కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించామని, 3 లక్షలకుపైగా కంపెనీలపై అనుమానిత లావాదేవీలకు సంబంధించి నిఘా కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో ఓ సందర్భంలో వెల్లడించారు.

క్యాపిటల్‌ గెయిన్స్‌ ప్రయోజనం పొందేందుకేనా?
ఐటీ విభాగం, సెబీ జరిపిన విచారణల్లో లిస్టెడ్‌ షెల్‌ కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల మాధ్యమంగా మనీలాండరింగ్‌ కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయని పలు సందర్భాల్లో బయటపడింది. ఈ కార్యకలాపాలు నిర్వహించే వారు... డొల్ల కంపెనీల షేర్లను కొనుక్కుని, రేట్లను కృత్రిమంగా పెంచేసి.. ఏడాది తర్వాత అమ్ముకోవడం ద్వారా దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ (ఎల్‌టీసీజీ) మినహాయింపు ప్రయోజనాలు పొందుతున్నారని వెల్లడైంది.  

అన్ని నిబంధనలూ పాటిస్తున్నా...
సెబీ చర్యలకు సంబంధించి పలు కంపెనీలు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, సెబీకి మంగళవారం వినతిపత్రాలు సమర్పించాయి. తమవి షెల్‌ కంపెనీలు కాదని, అర్థవంతమైన కార్యకలాపాలు నిర్వహిస్తూ... ఎప్పటికప్పుడు ఫలితాలను స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు పంపిస్తున్నామని, ఏ సమాచారాన్నయినా ఇన్వెస్టర్లతో పంచుకుంటున్నామని అవి పేర్కొన్నాయి. అన్ని నిబంధనలూ పాటిస్తున్నా ఈ చర్యలు తీసుకోవటం సమంజసం కాదని అవి అభిప్రాయపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement