
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ రువాండాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెలికం కంపెనీలో పూర్తి వాటాను కొనుగోలు చేయనున్నది. టిగో రువాండా బ్రాండ్ కింద టెలికం కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిల్లికామ్ ఇంటర్నేషనల్ సెల్యులర్ ఎస్‌ఏలో వంద శాతం వాటా కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకున్నామని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ వాటాను తమ అనుబంధ కంపెనీ ఎయిర్‌టెల్ రువాండా లిమిటెడ్ కొనుగోలు చేయనున్నదని పేర్కొంది.
దీంతో టిగోకు చెందిన 3.7 కోట్ల మంది వినియోగదారులు ఎయిర్‌టెల్‌కు లభిస్తారని, 8 కోట్ల డాలర్ల ఆదాయంతో రువాండాలో రెండో అతి పెద్ద టెలికం కంపెనీగా ఎయిర్‌టెల్ రువాండా నిలుస్తుందని వివరించింది. 40 శాతం మార్కెట్ వాటా ఎయిర్‌టెల్ రువాండాకు దక్కుతుందని పేర్కొంది. ఈ ఒప్పందానికి నియంత్రణ, చట్టబద్ధ ఆమోదాలు పొందాల్సి ఉందని వివరించింది. భారత్, దక్షిణాఫ్రికాలతో పాటు ఎయిర్‌టెల్ కంపెనీ మరో 15 ఆఫ్రికా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఆఫ్రికా దేశాల టెలికం కార్యకలాపాల నుంచి మార్జిన్లు సాధించడం మొదలవుతుందని సునీల్ మిట్టల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment