ఇప్పటికే పలు విడతలుగా మొబైల్ టెలిఫోన్ చార్జీలను (Tariff Hike) పెంచినప్పటికీ.. మరింత పెంపు అవసరమని భారతీ ఎయిర్‌టెల్ (Airtel) వైస్ చైర్మన్, ఎండీ గోపాల్ విఠల్ వ్యాఖ్యానించారు. టెలికం రంగ ఆర్థిక స్థిరత్వం కోసం ఇది అవసరమన్నారు. డిసెంబర్ క్వార్టర్ కంపెనీ త్రైమాసిక ఫలితాల అనంతరం ఇన్వెస్టర్లతో ఏర్పాటు చేసిన ఎర్నింగ్స్ కాల్‌లో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు.
నెట్‌వర్క్‌పై పెట్టుబడులు తగ్గించి, ట్రాన్స్‌మిషన్ సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. తద్వారా కస్టమర్ల అనుభవంలో అంతరాలను తొలగించి, గృహ బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించనున్నట్టు తెలిపారు. ‘‘2023–24 కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలు తక్కువగా ఉంటాయి. 2025–26లోనూ మరింత తగ్గుతాయి. డిజిటల్ సామర్థ్యాల ఏర్పాటుపై మేము పెట్టిన దృష్టి ఇప్పుడు ఫలితాలనిస్తోంది’’అని చెప్పారు.
భారత్‌లో సగటు టెలికం యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) ప్రపంచంలోనే తక్కువగా ఉందన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుని, నిలకడైన రాబడుల కోసం మరో విడత టారిఫ్‌లకు చికిత్స అవసరమని వ్యాఖ్యానించారు. గతేడాది జూలైలో ఎయిర్‌టెల్ సహా ఇతర టెలికం కంపెనీలు టారిఫ్‌లను సగటున 10–21 శాతం మధ్య పెంచడం గమనార్హం.
మార్జిన్లు తక్కువగా ఉండే హోల్‌సేల్ వాయిస్, మెస్సేజింగ్ సేవల నుంచి ఎయిర్‌టెల్ తప్పుకుంటున్నట్టు విఠల్ ప్రకటించారు. కంపెనీ లాభాలపై దీని ప్రభావం ఉండదన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ రూ.16,134 కోట్ల లాభాలను నమోదు చేయడం గమనార్హం. ఒక్కో యూజర్ నుంచి సగటున రూ.245 ఆదాయం సమకూర్చుకుంది. ఇది కనీసం రూ.300 ఉండాలని ఎయిర్‌టెల్ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment