ఎన్‌పీఎస్‌ ఫండ్‌ మేనేజర్‌గా ఎస్‌బీఐ ఓకేనా? | tips for finacal basics from deerendra kumar | Sakshi
Sakshi News home page

ఎన్‌పీఎస్‌ ఫండ్‌ మేనేజర్‌గా ఎస్‌బీఐ ఓకేనా?

Published Mon, Jul 17 2017 1:36 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

ఎన్‌పీఎస్‌ ఫండ్‌ మేనేజర్‌గా ఎస్‌బీఐ ఓకేనా?

ఎన్‌పీఎస్‌ ఫండ్‌ మేనేజర్‌గా ఎస్‌బీఐ ఓకేనా?

నేను గత కొంత కాలంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేస్తూ ఉన్నాను. అయితే నేను ఇన్వెస్ట్‌ చేసిన కొన్ని ఫండ్స్‌ల్లో ఒక ఏడాదిలో  40–50 చొప్పున రాబడులు వచ్చాయనుకుందాం. అప్పుడు ఈ ఫండ్స్‌ యూనిట్లను విక్రయించి లాభాలు స్వీకరించవచ్చా?
–హరిబాబు, కరీంనగర్‌


మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్స్‌ ఏడాది కాలంలో 40–50 శాతం చొప్పున రాబడులు ఇచ్చినప్పుడు.. ఆ మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను విక్రయించాలా వద్దా అనేది మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యాల సాధనకు ఈ సొమ్ములు పూర్తిగా ఉపయోగపడతాయి అనుకుంటేనే ఈ మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను విక్రయించండి. అలా కాకుండా లాభాలు వచ్చాయని మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని వాటిని విలాసాలకో, మరో ఇతర వృధా విషయాలకో ఖర్చు చేయకండి. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోకుండా అలాగే కొనసాగిస్తే, మీ లాభాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉండొచ్చు.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు రీబ్యాలెన్సింగ్‌ ప్లాన్‌ తప్పనిసరిగా ఉండాలని గుర్తుంచుకోండి. రీబ్యాలెన్సింగ్‌ అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈక్విటీ, డెట్‌ సాధనాల్లో తగిన నిష్పత్తిలో ఇన్వెస్ట్‌ చేయడం. స్టాక్‌ మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు ఈ నిష్పత్తిని మార్చాలి. ఈక్విటీకి కేటాయించిన కొంత భాగాన్ని మార్చుకోవచ్చు. బాగా లాభాలు వచ్చాయనే ఒకే ఒక ఉద్దేశంతో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవడమనేది సరైన నిర్ణయం కాదు. మీకు తక్షణం డబ్బులు అవసరం లేనప్పుడు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడమే ఉత్తమం.

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌(ఎన్‌పీఎస్‌)కు సంబంధించి ఫండ్‌ మేనేజర్‌గా ఎస్‌బీఐను ఎంచుకోవచ్చా? ఎన్‌పీఎస్‌ ప్లాన్స్‌కు సంబంధించి ఏ ఏ విభాగాలకు ఎంత మేర కేటాయింపులు జరపడం సమంజసంగా ఉంటుంది? –చైతన్య, విశాఖపట్టణం
ఎన్‌పీఎస్‌ ఫండ్‌ మేనేజర్‌గా ఏ సంస్థను ఎంచుకున్నా, పనితీరులో స్వల్ప తేడా మాత్రమే ఉంటుంది. ఫండ్‌ మేనేజర్‌ను మార్చుకోవడం వల్ల స్పల్ప లాభాలు మాత్రమే వస్తాయని చెప్పవచ్చు. ఇక ఎన్‌పీఎస్‌ ఫండ్‌ మేనేజర్‌గా ఎస్‌బీఐ పనితీరు బాగానే ఉంది. మీరు నిరభ్యంతరంగా ఎస్‌బీఐను ఫండ్‌ మేనేజర్‌గా ఎంచుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో మూడు మేజర్‌ ప్లాన్‌లు ఉన్నాయి. అవి ఈక్విటీ(ఈ).గవర్నమెంట్‌ బాండ్స్‌(జీ), కార్పొరేట్‌ బాండ్స్‌(సి) మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో గరిష్టంగా 50 శాతం వరకూ ఈక్విటీ(ఈ) ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు.మీరు కనుక ఎన్‌పీఎస్‌లో 15–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలి అనుకుంటే, ఈక్విటీ(ఈ) ప్లాన్‌లో 50 శాతం వరకూ ఇన్వెస్ట్‌ చేయండి. కార్పొరేట్‌ బాండ్‌ ప్లాన్‌లో 25 శాతం, గవర్నమెంట్‌ బాండ్‌ ప్లాన్‌లో 25 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేయండి.

ఒకే మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు చెందిన ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ?
– తులసి, విజయవాడ

ఒకే ఫండ్‌హౌస్‌కు సంబంధించిన మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడమనేది సరైన నిర్ణయం కాదు.  మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం...పెట్టుబడుల డైవర్షిఫికేషనే కదా ! అయితే మీరు ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేస్తారు అనే విషయం మీద ఈ అంశం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు నెలకు రూ.2,500 వరకూ ఇన్వెస్ట్‌ చేయగలరు అనుకుందాం. అప్పుడు ఒకే మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు చెందిన ఒక బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ను లేదా ట్యాక్స్‌–సేవింగ్‌ ఫండ్‌ను ఎంచుకోవాలి. ఒకే ఫండ్‌హౌస్‌కు సంబంధించిన వివిధ ఫండ్స్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ టీమ్స్‌ కలసికట్టుగానే పనిచేస్తాయి. అందుకని ఒక మ్యూచువల్‌ ఫండ్‌కు సంబంధించిన వివిధ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌చేసినప్పటికీ, అన్ని ఫండ్స్‌పై ఈ కలసికట్టుగా పనిచేసే ప్రభావం తప్పక ఉంటుంది.  రూ.5,000 అంతకు మించి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, కనీసం 2–3 విభిన్నమైన మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు చెందిన మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడమే ఉత్తమం.

సీనియర్‌ సిటిజన్లకు సంబంధించి మంచి హెల్త్‌ ప్లాన్‌లు సూచించండి.
– మహబూబ్‌ ఖాన్, హైదరాబాద్‌

సీనియర్‌ సిటిజన్‌లకు సంబంధించి ఈ మూడు ప్లాన్‌లను పరిశీలించవచ్చు. అపోలో మ్యూనిక్‌ ఆప్టిమ సీనియర్, రెలిగేర్‌ హెల్త్‌కేర్, స్టార్‌ హెల్త్‌ సీనియర్‌ సిటిజన్స్‌ రెడ్‌ కార్పెట్‌. సీనియర్‌ సిటిజన్‌ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ యా సంస్థలు ఈ పాలసీలను రూపొందించాయి. హాస్పిటలైజేషన్, మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఇంటిదగ్గరే వైద్య సేవలు పొందే డొమిసిలరీ హాస్పిటలైజేషన్‌ కూడా కవరయ్యేలా ఈ ప్లాన్‌లు ఉన్నాయి. అయితే ఈ ప్లాన్‌ల ప్రీమియమ్‌లు కూడా అధికంగానే ఉన్నాయి. ప్రీమియమ్‌లు, ఈ ప్లాన్‌లు అందించే ఫీచర్లు, మినహాయింపులు, పాలసీ తీసుకోవడానికి ముందే ఉన్న వ్యాధులకు కవరేజ్, తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తగిన ప్లాన్‌ను ఎంచుకోండి.

ఆరోగ్య బీమా పాలసీలో నగదు రహిత వైద్యం అత్యంత కీలకమైన విషయం. మీరు తీసుకోబోయే ప్లాన్‌కు సంబంధించి ఇలాంటి నగదు రహిత వైద్యమందించే నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ మీ నగరంలో  ఉన్నాయో, లేదో చెక్‌ చేసుకోవడం మరచిపోకండి.  పెద్ద నగరాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్‌ అన్నీ బీమా కంపెనీలతో టై అప్స్‌ పెట్టుకోవడం సాధారణమైన విషయమే. ఇక చిన్న నగరాల్లో ఉండే వాళ్లు తమకు దగ్గర్లోని నగరాల్లో ఇలాంటి నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ ఉన్నాయో లేవో గమనించి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మీ అవసరాలకు తగ్గట్టుగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement