టైటాన్ అతిపెద్ద వాచ్ స్టోర్ హైదరాబాద్‌లో..
• 2017లో 200 కొత్త మోడళ్లు
• కంపెనీ సీఈవో రవికాంత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వాచీల తయారీ దిగ్గజం టైటాన్ కంపెనీ అతి పెద్ద ఔట్‌లెట్ హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభమైంది. ఇక్కడి జూబ్లీహిల్స్‌లో 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో పునరుద్ధరించిన ఈకేంద్రంలో వరల్డ్ ఆఫ్ టైటాన్, హీలియోస్ స్టోర్లను నెలకొల్పారు. టైటాన్‌కు చెందిన ఫాస్ట్‌ట్రాక్, సొనాటా, జూప్, స్కిన్‌తోపాటు రేమండ్ వీల్, మొవాడో, గెస్, ఎంపోరియో అర్మాణీ, ఫాసిల్ వంటి 25 ప్రముఖ విదేశీ బ్రాండ్లుసైతం కొలువుదీరాయి. ఈ ఔట్‌లెట్‌లో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భాగంగా వాచీలపై 40 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తున్నట్టు టైటాన్ కంపెనీ వాచెస్, యాక్సెసరీస్ సీఈవో ఎస్.రవికాంత్ తెలిపారు. స్టోర్‌ను ప్రారంభించినఅనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడళ్ల ధర రూ.1.8 లక్షల దాకా ఉందని వివరించారు.
వచ్చే ఏడాదీ 200 మోడళ్లు..
ఇటీవల ప్రవేశపెట్టిన సొనాటా యాక్ట్ సేఫ్టీ వాచ్‌కు మహిళల నుంచి మంచి స్పందన ఉందని రవికాంత్ వెల్లడించారు. మొత్తంగా టైటాన్ ప్రస్తుత సంవత్సరంలో 200 మోడళ్లను ప్రవేశపెట్టింది. 2017లోనూ అదే స్థాయిలోమోడళ్లను పరిచయం చేస్తామని వెల్లడించారు. ఏటా 1.4 కోట్ల యూనిట్ల వాచీలను విక్రయిస్తున్నట్టు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వీటిలో అంతర్జాతీయ బ్రాండ్ల వాటా 10 శాతం దాకా ఉందన్నారు. స్మార్ట్ వాచీలవిభాగంలో మరిన్ని మోడళ్లను తేనున్నట్టు తెలిపారు. రూ.10 వేలలోపు ధరలో స్మార్ట్ వాచీలు ఆరు నెలల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్‌లో 6–7 శాతం అమ్మకాలుతగ్గాయన్నారు. 50 శాతమున్న కార్డు చెల్లింపులు 75%కి చేరాయని తెలిపారు.