
ప్రీమియం చీరల వ్యాపారంలోకి టైటాన్
తనైరా బ్రాండ్ ఆవిష్కరణ
బెంగళూరు: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ తాజాగా ప్రీమియం చీరలు, ఉమెన్ ఎత్‌నిక్ వేర్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘తనైరా’ బ్రాండ్ కింద వీటిని మార్కెట్‌లోకి తీసుకువచ్చినట్లు టైటాన్ పేర్కొంది. తొలి తనైరా స్టోర్‌ను బెంగళూరులో ఏర్పాటు చేసింది. ఇందులో చేతితో నేసిన చీరలను, ఎత్‌నిక్ వేర్ దస్తులను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. స్టోర్‌లోని ప్రొడక్టుల ధర రూ.2.5 లక్షల వరకు ఉంది. ‘హడావిడిగా వ్యాపారాన్ని విస్తరించాలని, పెద్ద సంఖ్యలో స్టోర్లను ఏర్పాటు చేయాలని మేం అనుకోవట్లేదు.
12–15 నెలల తర్వాత భవిష్యత్ వృద్ధి ప్రణాళికలను వెల్లడిస్తాం’ అని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజీ అండ్ బిజినెస్ ఇంక్యూబేషన్) అజయ్ హెచ్ చావ్లా తెలిపారు. తాము దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 వరకు చేనేత సంఘాలు, నేత వారు, మధ్యవర్తులు, డిజైనర్లు వంటి వారితో భాగస్వామ్యమై ఉన్నామని పేర్కొన్నారు. వాచ్‌లు, యాక్ససిరీస్‌లు, జువెలరీ, ఐవేర్ వంటి కేటగిరిల్లో టైటాన్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.