గణాంకాలు, ఫలితాల ప్రభావం
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అభిప్రాయం
న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ, గెయిల్, కోల్ ఇండియా వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారంలోనే వెలువడుతున్నాయి. ఈ కంపెనీల ఆర్థిక ఫలితాలు, సేవల రంగానికి సంబంధించిన నెలవారీ గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. అంతర్జాతీయ సంకేతాలు, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, వర్షపాత విస్తరణ, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని నిపుణుల అభిప్రాయం.
ఫెడ్ కోత ఉండదు !: గత శుక్రవారం వెలువడిన అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా ఉండటంతో ఈ నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత అవకాశాలకు గండి పడిందని, ఈ ప్రభావం మంగళవారం నాటి ట్రేడింగ్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఎలాంటి ప్రధాన సంఘటనలు లేకపోతే, షేర్లను బట్టి ట్రేడింగ్ ఉంటుందని అమ్రపాలి అధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డెరైక్టర్ అభినాశ్ కుమార్ సుధాంశు చెప్పారు. షేర్ల విలువలు ఖరీదైనవిగా ఉన్నాయని, ప్రస్తుత స్థాయిల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశాలున్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు.
ఫలితాలతో ఒడిదుడుకులు
కోల్ ఇండియా కంపెనీ ఈ నెల 9న క్యూ1 ఫలితాలు వెల్లడించనున్నది. కోల్ ఇండియాతో పాటు ఓఎన్‌జీసీ, గెయిల్, భెల్, సెయిల్ వంటి కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను ఈ వారంలోనే వెల్లడిస్తాయని, ఫలితంగా మార్కెట్ ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. చైనా సేవల రంగం గణాంకాలు 5న(సోమవారం) వెలువడుతున్నాయి. ఈనెల 8న(గురువారం) యూరప్ కేంద్ర బ్యాంక్ ద్రవ్య పరపతి విధానాన్ని వెల్లడిస్తుంది.
నేడు సెలవు: వినాయక చవితి సందర్భంగా సోమవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు