రేపు జ్యువెలరీ షాపులు బంద్!
పాన్‌కార్డు నమోదు తప్పనిసరికి నిరసనగా జీజేఎఫ్ దేశవ్యాప్త సమ్మె
కోల్‌కతా: దాదాపు 300 అసోసియేషన్స్‌కు చెందిన లక్షకు పైగా జ్యువెలరీ షాపు యజమానులు ఫిబ్రవరి 10న దేశవ్యాప్త సమ్మె చేయనున్నారు. రూ.2 లక్షలు, అంతకు మించి విలువైన బంగారు ఆభరణాల కొనుగోలుకు పాన్ కార్డు తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా సమ్మె చేపడుతున్నట్లు ‘ఆల్ ఇండియా జెమ్స్, జ్యువెలరీ ట్రేడ్ ఫెడరేషన్’ (జీజేఎఫ్) తెలిపింది. ప్రభుత్వపు చర్య.. దేశవ్యాప్తంగా ఉన్న అధిక సంఖ్యాక జ్యువెలర్స్, నగల తయారీదారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని పేర్కొంది. అన్ని అసోసియేషన్స్ సహకారంతోనే సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
ఆదాయపు పన్ను చెల్లించలేని, గ్రామాల్లో నివసించే, వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్నవారు అధికంగా ఉండే ప్రాంతాల్లోని బంగారు షాపుల వారి వ్యాపారానికి పాన్ కార్డు తప్పనిసరి చర్య అడ్డుగా పరిణమిస్తోందని జీజేఎఫ్ డెరైక్టర్ బచ్‌రాజ్ బమల్వా వివరించారు. భారత్‌లో కేవలం 22 కోట్ల పాన్ కార్డుల జారీ జరిగిందని, ప్రభుత్వపు చర్య వల్ల జ్యువెలరీ పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. పాన్ కార్డు తప్పనిసరి చర్య అమల్లోకి వచ్చిన దగ్గరి నుంచి పరిశ్రమ మొత్తం టర్నోవర్ 30 శాతం తగ్గిందన్నారు.
చిన్న వ్యాపారులు, పనివారు, నగల తయారీదారుల ఉపాధి కల్పన ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని బంగారు షాపు యజమానులు నష్టపోయే పరిస్థితి నెలకొందని జీజేఎఫ్ తూర్పు జోనల్ చైర్మన్ శంకర్ సేన్ పేర్కొన్నారు. దాదాపు 50 శాతంపైగా బంగారం వ్యాపారం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుంద న్నారు. కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి రూ.2 లక్షలు, అంతకు మించి విలువైన బంగారు ఆభరణాల కొనుగోలుపై పాన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.