టాప్ 10 కార్పొరేట్ గ్రూప్‌ల రుణం 5.73 లక్షల కోట్లు!
రాజ్యసభలో కేంద్రం ప్రకటన...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు ఈ ఏడాది మార్చి నాటికి టాప్ 10 కార్పొరేట్ గ్రూపులు చెల్లించాల్సిన రుణ మొత్తం రూ.5.73 లక్షల కోట్లు. ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభలో మంగళవారం ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. రూ.5 కోట్లకుపైగా రుణం ఉన్న కంపెనీల సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సమీకరించిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అయితే కొన్ని నిర్దిష్ట పరిస్థితులు మినహా రుణ సమాచారాన్ని వెల్లడించడానికి ఆర్‌బీఐ నిబంధనలు అంగీకరించడం లేదనీ వెల్లడించారు.
ఎన్‌పీఏలకు మందగమనమూ కారణమే...
మొండిబకాయిల సమస్య పెరగడానికి ఆర్థిక వ్యవస్థ మందగమన పరిస్థితులు కూడా కారణమని తెలిపారు. ఎన్‌పీఏలు అధికంగా ఉన్న మౌలిక, ఉక్కు, జౌళి వంటి రంగాలకు పునరుత్తేజానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవడం ద్వారా సమస్య పరిష్కారంలో కొంత ముందడుగు వేయాలని ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోందని తెలిపారు. అలాగే బ్యాంకింగ్ సత్వర రుణ వసూలు ప్రక్రియకు కొత్తగా ఆరు డెట్ రికవరీ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకూ ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందన్నారు. చెల్లింపుల్లో రుణ గ్రహీత విఫలమైతే.. గ్యారెంటార్ మీదా చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం బ్యాంకర్లకు సూచించినట్లు తెలిపారు.
రూ.59,547 కోట్ల రుణాల రద్దు...
మరో ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, రాజీసహా ప్రభుత్వ రంగ బ్యాంకులు 2015-16లో రూ.59,547 కోట్ల రుణాలను పద్దుల నుంచి తొలగించినట్లు (మాఫీ) పేర్కొన్నారు. ప్రైవేటు రంగం విషయంలో ఈ మొత్తం రూ.12,017 కోట్లుగా తెలిపారు. విదేశీ బ్యాంకుల విషయంలో ఈ పరిమాణం రూ.1,057 కోట్లు. ప్రముఖ అకౌంట్ హోల్డర్ల రైటాఫ్ వివరాలు అందలేదని ఆర్‌బీఐ తెలిపిందని మంత్రి వెల్లడించారు.
కేవీఐసీ... బలహీన రుణ రికవరీ వ్యవస్థ: కాగ్
ఇదిలావుండగా, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) రుణ రికవరీ వ్యవస్థ, ప్రక్రియ అత్యంత బలహీనంగా ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పార్లమెంటుకు సమర్చించిన ఒక నివేదికలో తెలిపింది. రాబట్టుకోవాల్సిన మొత్తం రూ.551.46 కోట్లని సైతం వెల్లడించింది.