నల్లధనంపై తెల్లమొహం..!!
♦ అసలు ఉందా లేక తెల్లగా మారిందా?
♦ రద్దయిన రూ.1,000 నోట్లలో 99 శాతం వెనక్కి
♦ వెనక్కి రాని నోట్ల విలువ కేవలం రూ. 8,925 కోట్లే.
♦ రూ.500 నోట్లపై బయటకు రాని పూర్తి గణాంకాలు
♦ ఆర్‌బీఐ తాజా నివేదికతో బయటపడిన వాస్తవాలు...
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రూపంలో భారీగా నల్లధనం పోగుపడిందన్న అంచనాలతో, అవినీతిపరుల వెన్ను విరిచేందుకు నరేంద్ర మోదీ సర్కారు చేపట్టిన డీమోనిటైజేషన్ అస్త్రం సత్ఫలితాలను ఇచ్చిందా..? అన్న ప్రశ్నకు అవును అనే సమాధానం మాత్రం వినిపించడం లేదు. ఎందుకంటే ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన గణాంకాలు మరోలా ఉన్నాయి మరి. గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం అప్పటికి మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.1,000 నోట్ల విలువ రూ.6.86 లక్షల కోట్లు. కేంద్ర మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ స్వయంగా ఈ ఏడాది ఫిబ్రవరి 3న లోక్‌సభకు ఈ విషయాన్ని వెల్లడించారు.
మరి డీమోనిటైజేషన్ కార్యక్రమం ముగిసిపోయిన ఈ ఏడాది మార్చి నాటికి కేవలం రూ.8,925 కోట్ల విలువ చేసే రూ.1,000 నోట్లు మాత్రమే వెనక్కిరాలేదని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. దీని ప్రకారం చూస్తే మొత్తం రూ.1,000 నోట్లలో 99 శాతానికిపైగా తిరిగి వెనక్కి వచ్చాయి. కేవలం ఓ పావు శాతం లోపు నోట్లు మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాకుండా ఆగిపోయాయనేది స్పష్టమైంది.
రూ.500 నోట్లపై అయోమయం!
ఇక రూ.500 నోట్ల విలువ గురించి ఈ విధంగా లెక్కించేందుకు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే వ్యవస్థలోకి కొత్త రూ.500 నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక ఆర్‌బీఐ పాత, కొత్త రూ.500 నోట్లకు సంబంధించి వేర్వేరు గణాంకాలను ప్రకటించలేదు. దీంతో రూ.500 నోట్ల చలామణి విషయమై అస్పష్టత నెలకొంది. కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ రూ.15.4 లక్షల కోట్లు కాగా, వీటిలో సగానికి పైగా రూ.500 నోట్లే. రద్దయిన రూ.500 నోట్లలో వాస్తవానికి ఎన్ని వెనక్కి వచ్చాయన్నది తెలియాలంటే ఆర్‌బీఐ స్పష్టమైన గణాంకాలు వెల్లడిస్తేనే సాధ్యం. వెనక్కిరాని 500 నోట్ల విలువ రూ.7,075 కోట్లుగా లెక్కతేలుతోంది.
నల్లధనం ఎంత పట్టారు?
రూ.500 నోట్లపై స్పష్టమైన గణాంకాలు బయటకు రానప్పటికీ వ్యవస్థలో ఉన్న నల్లధనాన్ని కేంద్రం ఏ మేరకు ఏరి పారేసిందో రూ.1,000 నోట్ల గణాంకాలను బట్టి అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రూ.1,000 నోట్లలో దాదాపు 99.5% వెనక్కి వచ్చినట్టుగానే రద్దయిన రూ.500 నోట్లు కూడా అదే స్థాయిలో వ్యవస్థలోకి వచ్చినట్లు తాజా నివేదిక చెబుతోంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థకు వెలుపల చలామణి అవుతున్న నల్లధనాన్ని కేంద్రం తుడిచేసింది ఏముందున్న ప్రశ్న తలెత్తక మానదు. అసలు నల్లధనం పెద్దగా లేకపోయి ఉండొచ్చు. లేదా అవినీతిపరులు నేరుగా లేదా బినామీల ద్వారా బ్యాంకుల నుంచి, ఇతర మార్గాల్లో (రాజకీయ విరాళాలు, కొనుగోళ్లు) తమ నల్లధనాన్ని తెల్లగా మార్చేసుకుని అయినా ఉండొచ్చు. ఒకవేళ ఇలా చేస్తే వీరికి పన్ను అధికారుల నుంచి తాఖీదులు అందుతాయి. భారీ పనిభారంతో సతమతం అవుతున్న ఐటీ శాఖ.. నిందితులను పట్టుకునేందుకు ఎన్నేళ్లయినా పట్టొచ్చు. అప్పటికీ జరిమానాలతో బయటపడే మార్గాలు ఉండనే ఉన్నాయి.
ఆర్‌బీఐ అందుకే వెల్లడించడం లేదా?
ఆర్‌బీఐ డీమోనిటైజేషన్ నివేదిక ప్రకారం చూస్తే... కేంద్రం కొండను తవ్వి పట్టిన నల్లధనం ఏ మేరకు ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది. భారీగా నల్లధనం వ్యవస్థలో ఉందని... నకిలీ నోట్లు కూడా భారీస్థాయిలో ఇతర దేశాల నుంచి వస్తున్నాయంటూ ఊదరగొట్టిన మోదీ సర్కారు.. ఆర్‌బీఐ వద్దనున్న గణాంకాలను కావాలనే ఇన్నాళ్లూ తొక్కిపెట్టిందన్నది తాజా నివేదికతో బట్టబయలైంది. డీమోనిటైజేషన్ జరిగిన తొమ్మిది నెలలకుగాని ఈ గణాంకాలను ఆర్‌బీఐ వెల్లడించకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనబడుతోంది. నిజానికి డీమోనిటైజేషన్ తర్వాత ప్రతీ బ్యాంకు శాఖ ఎంత మేర నల్లధనం స్వీకరించిందీ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలో గణాంకాలతో సహా నమోదు చేశాయి. అలాగే, నకిలీ నోట్లను గుర్తించే పరికరాలతో స్కాన్ చేయడం కూడా ఎప్పుడో పూర్తయింది.
దీంతో ఎంత మేర వెనక్కి వచ్చిందన్న దానిపై ఆర్‌బీఐ, ప్రభుత్వం వద్ద అంచనాలు చాన్నాళ్ల క్రితమే ఉన్నాయన్నది సుస్పష్టం. అయినా వెనక్కి వచ్చిన నోట్లు అసలా, నకిలీయా లెక్కింపు పూర్తి కాలేదంటూ ఆర్‌బీఐ ఇన్నాళ్లూ కాలయాపన చేయడం ఆశ్చర్యాన్ని కలిగించేదే. ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి కూడా రద్దయిన నోట్ల లెక్కింపు పూర్తి కాదని ఇటీవలే ఒక సందర్భంలో అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. మరి ఆర్‌బీఐ నోట్ల లెక్కింపు పూర్తి కాకుండానే... ప్రధాని మోదీ స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో రూ.3 లక్షల కోట్ల మేర నల్లధనం వ్యవస్థలోకి రా లేదని ఎలా చెప్పారో ఆయనకే తెలియాలి మరి.
నోట్ల రద్దుతో మిగిలిందేంటి..?
కేంద్రంలోని మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల నల్లధనం తుడిచిపెట్టుకుపోయిందో, లేదోగానీ... పన్ను చెల్లింపుదారుల సంఖ్య మాత్రం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు రూ. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలను రద్దు చేయడంతో పన్ను ఎగవేతలకు చెక్ పడుతుందంటున్నారు. కానీ, అసలు డీమోనిటైజేషన్ కార్యక్రమానికి కీలకమైన నల్లధనం ఏరివేత ప్రయోజనం మాత్రం సిద్ధించినట్టు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.