టీవీ ప్రసారాల పంపిణీదారులకు కొత్త మార్గదర్శకాలు
విడుదల చేసిన ట్రాయ్
న్యూఢిల్లీ: టెలివిజన్ ప్రసారాల పంపిణీలో అనైతిక విధానాలకు చెక్ పెట్టే దిశగా ట్రాయ్ కీలక ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. టీవీ చానళ్ల ప్రసారాలను అందించే కేబుల్, డీటీహెచ్, ఐపీటీవీ ఇలా అన్ని రకాల ప్లాట్‌ఫామ్‌లకు ఒకే విధమైన ఇంటర్ కనెక్షన్ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఒకే విధమైన నియంత్రిత విధానంతో ఈ రంగంలోని భిన్న రకాల పంపిణీదారులు అందరికీ పారదర్శకమైన, సమాన పోటీ అవకాశాలకు వీలు కలుగుతుందని శుక్రవారం తాను విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాల ప్రతిలో ట్రాయ్ పేర్కొంది. హెచ్‌ఐటీఎస్ (హెడ్ ఎండ్ ఇంద ద స్కై ఆపరేటర్), ఐపీటీవీ, డీటీహెచ్, కేబుల్ టీవీలకు ప్రస్తుతం రెండు రకాల వేర్వేరు నియంత్రిత విధానాలు అమల్లో ఉన్నాయి. వీటిలో హెచ్‌ఐటీఎస్ అనేది కేబుల్ చానల్స్‌ను ప్రసారం చేసే శాటిలైట్ మల్టిప్లెక్స్ సర్వీస్.
టెలివిజన్ ప్రసార రంగంలో వినియోగదారుడు, బ్రాడ్ కాస్టర్ మధ్య మధ్యవర్తులు చాలా మంది ఉంటారు. అందరికీ ఒకే విధమైన ఇంటర్ కనెక్షన్ నిబంధనను అమలు చేయడం వల్ల పోటీ వేగం పుంజుకుని, వినియోగదారుడికి నాణ్యమైన సేవలు అందుతాయన్నది ట్రాయ్ యోచన. టీడీహెచ్, కేబుల్ ఆపరేటర్లు టీవీ చానళ్లను ప్రసారం చేసినందుకు ఒక్కో చానల్‌కు ఒక్కో వినియోగదారుడి నుంచి గరిష్టంగా 20పైసలు మాత్రమే వసూలు చేసేలా ట్రాయ్ తాజా ముసాయిదా మార్గదర్శకాల్లో పరిమితి విధించింది.
ఇక ఏదేనీ బ్రాడ్‌కాస్టర్(చానల్), ఆ చానల్ పంపిణీదారుడి మధ్య ప్రత్యేక ఒప్పందాలను నిషేధించే నిబంధనను తీసుకొచ్చింది. చానల్, డిస్ట్రిబ్యూటర్ మధ్య ఈ విధమైన ఒప్పందంతో ఇతర పంపిణీదారులు సదరు చానల్ ప్రసారాలను అందించే అవకాశం ఉండదు. టెలివిజన్ ప్రసారాల పంపిణీలో వివిధ దశల్లో పారదర్శకత, వివక్ష లేకుండా ఉండడం వల్ల ఆరోగ్యకరమైన పోటీకి దోహదం చేస్తుందని ట్రాయ్ పేర్కొంది.