సాక్షి, ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వ్యాపారంలో వరుస నష్టాలు, రుణభారం వెరసి అనిల్ అంబానీ వరుసగా ఆస్తులు, కంపెనీలలో షేర్లను అమ్మకానికి పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆడిటర్ల రూపంలో మరో షాక్ తగిలింది. రిలయన్న్ గ్రూపునకు చెందిన అనుబంధ కంపెనీలైన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లకు చెందిన ఆడిటర్లు రాజీనామా చేశారు. గత మూడు నెలలుగా చట్టబద్దమైన ఆడిటర్లుగా తప్పు కోవడం పెద్ద దెబ్బే. తాజాగా మరో రెండు కంపెనీల ఆడిటర్లు రాజీనామా చేశారు. దీంతో ఈ మూడు నెలల్లోనే రిలయన్స్ గ్రూప్‌లోని నాలుగు కంపెనీల ఆడిటర్లు వైదొలిగినట్లు అయింది.
కంపెనీకి చట్టబద్ధమైన ఆడిటర్లలో ఒకరైన బీఎస్‌ఆర్ అండ్ కం 2019 ఆగస్ట్ 9వ తేదీ నుంచి వై దొలిగిందని రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ పవర్ స్టాక్ ఎక్స్చేంజ్ సమాచారంలో వెల్లడించాయి. ఈ మేరకు ఆడిటర్లు కంపెనీలకు ఒక లేఖ రాసినట్టు తెలిపాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 14వ తేదీన రిలయన్స్ ఇన్‌ఫ్రా ఆడిట్ నివేదికలో ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ పైన ఆందోళన వ్యక్తం చేసిందని, తమకు వివిధ అంశాలపై సరైన సమాచారం లభించలేదని కంపెనీ పేర్కొంది.
కాగా ఒకవైపు అనిల్ అంబానీ సోదరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పట్టిందల్లా బంగారంలా దూసుకుపోతున్నారు. పెట్రో కెమికల్ బిజినెస్‌లో 20 శాతం విదేశీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. దుబాయ్ కంపెనీసౌదీ అరామ్‌కో ద్వారా మొత్తం 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో తన కంపెనీని అప్పుల్లేని కంపెనీగా తీర్చదిద్దుతామని కంపెనీ ఏజీఎం సందర్బంగా ప్రతిష్టాత్మకంగా వెల్లడించారు. మరోవైపు అనిల్ అంబానీ మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నారు
Comments
Please login to add a commentAdd a comment