పది విమానాలతో ట్రుజెట్‌ విస్తరణ | TruJet expand fleet, increase number of flights | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్‌ విస్తరణ

Published Fri, Jul 12 2019 2:42 PM | Last Updated on Fri, Jul 12 2019 2:42 PM

TruJet expand fleet, increase number of flights  - Sakshi

హైదరాబాద్‌:  దేశవ్యాప్తంగా విమానయాన సేవలు విస్తరిస్తున్న టర్బో మేఘ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానయాన సంస్థ ‘ట్రూజెట్‌’ ఈ ఏడాది చివరి నాటికి తన విమానాల సంఖ్యను చేయనుంది. అయిదు నుంచి ఆ సంఖ్యను 10కి పెంచుకుని మరిన్ని సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటయిన ప్రాంతీయ విమాన సర్వీసు సంస్థ ట్రుజెట్‌ క్రమంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు అనతికాలంలో విస్తరించింది. 2015 జూలైలో కార్యకలాపాలు ప్రారంభించిన ట్రూజెట్‌ దేశవ్యాప్తంగా 20 కేంద్రాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. ఓవైపు ప్రాంతీయ విమాన సర్వీసులు ఆర్థిక సమస్యలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మూతపడుతుంటే ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేసిన ట్రుజెట్‌ మాత్రం తన సేవలను, వ్యాపారాన్ని క్రమంగా విస్తరిస్తూ పటిష్టపడటమే కాకుండా లాభాల బాటలోకి అడుగుపెట్టింది.

ప్రధానంగా ‘ఉడాన్‌’ పథకం కింద సేవలను నిర్వర్తిస్తూ 2019 డిసెంబరు నాటికి 5 ఏటీఆర్‌-72 విమానాల నుంచి 10 ఏటీఆర్‌-72 విమానాలను పెంచుకునే విధంగా ఏర్పాట్లు, ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఎంఇఐఎల్‌ డైరెక్టర్‌  ప్రదీప్‌ తెలిపారు. ట్రుజెట్‌ ‘ఉడాన్‌’ రూట్లలో 73 శాతం సామర్ధ్యంతో సమర్ధంగా సేవలను అందిస్తోంది. ఈ పథకం కింద సేవలను అందించే అతిపెద్ద విమానయాన సంస్థగా ట్రుజెట్‌ పేరు సంపాదించుకుంది. గ్రామీణ, మధ్యతరగతి ప్రజలకు కూడా దేశంలో విమాన సేవలు అందుబాటులోకి తేవాలనే ప్రధానమంత్రి ఉద్దేశంలో భాగంగా ప్రారంభించిన ‘ఉడాన్‌’ పథకం కింద తొలుత దక్షిణ భారతదేశంలో సేవలు ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా సేవలను విస్తరిస్తోంది.

ఈ నాలుగేళ్ల ప్రస్థానంలో...
నాలుగేళ్ల క్రితం అంటే 2015 జులై నెలలో టర్బోమేఘా ఏవియేషన్‌ లిమిటెడ్‌ తన విమాన సేవల బ్రాండ్‌ ట్రుజెట్‌ పేరుతో తన సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌, అహ్మదాబాద్‌ కేంద్రాలుగా దేశంలో 20కి పైగా పట్టణాలకు వారానికి 300 విమాన సర్వీసులను అందిస్తున్నది. ముంబయ్‌, చెన్నయ్‌, బెంగళూరు, గోవా, ఔరంగాబాద్‌, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప, సేలం, విద్యానగర్‌, మైసూర్‌, నాందేడ్‌, పోర్‌బందర్‌, నాసిక్‌, కాండ్లా, జైసల్మీర్‌, ఇండోర్‌ నగరాలకు తన విమానాలను నడుపుతున్నది. ప్రస్తుతం ట్రుజెట్‌ చేతిలో ఎటిఆర్‌ 72 రకం విమానాలు 5 వున్నాయి. దేశవ్యాప్తంగా 20 నగరాల్లో 700కు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఉడాన్‌ 1, ఉడాన్‌ 2 పథకంలో పేర్కొన్న అన్ని ప్రాంతాలకు విమాన సేవలను విస్తరించిన ఏకైక సంస్థ ట్రుజెట్‌. ఉడాన్‌ 3 పథకంలో పేర్కొన్న ప్రాంతాలకు కూడా తన సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నది. గత నాలుగేళ్లలో దాదాపు 2 మిలియన్‌ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి పలు అవార్డులను, ప్రశంసలను అందుకుంది. 

దేశంలో 20 నగరాలకు సేవల విస్తరణ
గడచిన ఏడాది కాలంలో అహ్మదాబాద్‌ను ట్రుజెట్‌ రెండవ కేంద్రంగా చేసుకుని తన సిబ్బందిని 700కు పైగా పెంచుకుంది. త్వరలో మరో బేస్‌ కేంద్రాన్ని ట్రుజెట్‌ ఏర్పాటు చేయనుంది. అంతేకాక ప్రస్తుతం వున్న అయిదు విమానాలతో దేశంలోని 20 గమ్యస్థానాలకు సేవలను నిర్వహిస్తోంది. దీర్ఘకాలిక ప్రణాళికతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ట్రుజెట్‌ తన ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందుకోసం తక్కువ ధరకు టికెట్లు అందించడం, ముందుగానే సీట్లను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించడం, బోర్డింగ్‌ పాస్‌ లో వ్యాపార ప్రకటనలు ముద్రించడం వంటి చర్యలను చేపట్టింది. దేశీయ విమానయాన సేవలు అందిస్తున్న ట్రుజెట్‌ అంతర్జాతీయ విమానయానం చేసే ప్రయాణికులకు సైతం ఉపయోగపడేలా వారికి కనెక్టివిటీ కల్పించేందుకు గానూ పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుందని ట్రూజెట్ సీఎఫ్ఓ విశ్వనాధ్ చెప్పారు.

సామాజిక సేవలో కూడా..
కేరళలో వరదలు సంభవించినప్పుడు బాధితులకు తన వంతు సేవగా పలు ప్రాంతాల నుండి కేరళకు ఆహారం, మందు, మంచినీరు, దుస్తులు తన విమానాలల్లో ఉచితంగా రవాణా చేసిన ఏకైక విమానయాన సంస్థగా నిలిచింది. ‘వింగ్స్‌ ఆఫ్‌ హోప్‌’ కార్యక్రమంలో గ్రామీణ బాలలకు ఉచితంగా విమాన ప్రయాణాన్ని అందించింది. ట్రుజెట్‌ నాల్గవ వార్షికోత్సవ సందర్భంగా తలసీమియా బాధితులకు సంస్థ సిబ్బంది 100 మంది జులై 5న రక్తదానం నిర్వహించారు. అదే సమయంలో విమాన ప్రయాణం అంటే తెలియని పేద వృద్ధ మహిళలను 45 మందిని  నాందేడ్‌కు ఉచితంగా తమ విమానంలో తీసుకువెళ్లి వెనక్కి తీసుకువచ్చారు. అదే విధంగా అనాధ పిల్లలను బళ్లారి, కడప తదితర ప్రాంతాలకు విమానంలో ఉచితంగా తీసుకువెళ్లడంతో పాటు అనేక ఉచిత, చైతన్య అవగాహన కార్యక్రమాలను ట్రుజెట్‌ నిర్వహించింది.

లాభాలతో, విజయవంతంగా : కేవీ ప్రదీప్‌
ఎంఇఐఎల్‌ డైరెక్టర్‌ కేవీ ప్రదీప్‌ మాట్లాడుతూ గడచిన నాలుగేళ్లుగా ట్రుజెట్‌ ప్రాంతీయ విమానయాన రంగంలో తనదైన ముద్ర వేసిందన్నారు. ప్రాంతీయ సేవల విభాగంలో తమతోపాటుగా ప్రారంభమైన విమానసేవల కంపెనీల్లో ట్రుజెట్‌ ఒక్కటే విజయపథంలో సాగుతోందన్నారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ‘ఉడాన్‌’ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు విమాన సేవలు అందించడం తమకు మంచి అవకాశమని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement