True jet airline
-
పది విమానాలతో ట్రుజెట్ విస్తరణ
హైదరాబాద్: దేశవ్యాప్తంగా విమానయాన సేవలు విస్తరిస్తున్న టర్బో మేఘ ఎయిర్వేస్కు చెందిన విమానయాన సంస్థ ‘ట్రూజెట్’ ఈ ఏడాది చివరి నాటికి తన విమానాల సంఖ్యను చేయనుంది. అయిదు నుంచి ఆ సంఖ్యను 10కి పెంచుకుని మరిన్ని సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటయిన ప్రాంతీయ విమాన సర్వీసు సంస్థ ట్రుజెట్ క్రమంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు అనతికాలంలో విస్తరించింది. 2015 జూలైలో కార్యకలాపాలు ప్రారంభించిన ట్రూజెట్ దేశవ్యాప్తంగా 20 కేంద్రాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. ఓవైపు ప్రాంతీయ విమాన సర్వీసులు ఆర్థిక సమస్యలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మూతపడుతుంటే ఎంఇఐఎల్ ఏర్పాటు చేసిన ట్రుజెట్ మాత్రం తన సేవలను, వ్యాపారాన్ని క్రమంగా విస్తరిస్తూ పటిష్టపడటమే కాకుండా లాభాల బాటలోకి అడుగుపెట్టింది. ప్రధానంగా ‘ఉడాన్’ పథకం కింద సేవలను నిర్వర్తిస్తూ 2019 డిసెంబరు నాటికి 5 ఏటీఆర్-72 విమానాల నుంచి 10 ఏటీఆర్-72 విమానాలను పెంచుకునే విధంగా ఏర్పాట్లు, ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఎంఇఐఎల్ డైరెక్టర్ ప్రదీప్ తెలిపారు. ట్రుజెట్ ‘ఉడాన్’ రూట్లలో 73 శాతం సామర్ధ్యంతో సమర్ధంగా సేవలను అందిస్తోంది. ఈ పథకం కింద సేవలను అందించే అతిపెద్ద విమానయాన సంస్థగా ట్రుజెట్ పేరు సంపాదించుకుంది. గ్రామీణ, మధ్యతరగతి ప్రజలకు కూడా దేశంలో విమాన సేవలు అందుబాటులోకి తేవాలనే ప్రధానమంత్రి ఉద్దేశంలో భాగంగా ప్రారంభించిన ‘ఉడాన్’ పథకం కింద తొలుత దక్షిణ భారతదేశంలో సేవలు ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా సేవలను విస్తరిస్తోంది. ఈ నాలుగేళ్ల ప్రస్థానంలో... నాలుగేళ్ల క్రితం అంటే 2015 జులై నెలలో టర్బోమేఘా ఏవియేషన్ లిమిటెడ్ తన విమాన సేవల బ్రాండ్ ట్రుజెట్ పేరుతో తన సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్, అహ్మదాబాద్ కేంద్రాలుగా దేశంలో 20కి పైగా పట్టణాలకు వారానికి 300 విమాన సర్వీసులను అందిస్తున్నది. ముంబయ్, చెన్నయ్, బెంగళూరు, గోవా, ఔరంగాబాద్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప, సేలం, విద్యానగర్, మైసూర్, నాందేడ్, పోర్బందర్, నాసిక్, కాండ్లా, జైసల్మీర్, ఇండోర్ నగరాలకు తన విమానాలను నడుపుతున్నది. ప్రస్తుతం ట్రుజెట్ చేతిలో ఎటిఆర్ 72 రకం విమానాలు 5 వున్నాయి. దేశవ్యాప్తంగా 20 నగరాల్లో 700కు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఉడాన్ 1, ఉడాన్ 2 పథకంలో పేర్కొన్న అన్ని ప్రాంతాలకు విమాన సేవలను విస్తరించిన ఏకైక సంస్థ ట్రుజెట్. ఉడాన్ 3 పథకంలో పేర్కొన్న ప్రాంతాలకు కూడా తన సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నది. గత నాలుగేళ్లలో దాదాపు 2 మిలియన్ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి పలు అవార్డులను, ప్రశంసలను అందుకుంది. దేశంలో 20 నగరాలకు సేవల విస్తరణ గడచిన ఏడాది కాలంలో అహ్మదాబాద్‌ను ట్రుజెట్ రెండవ కేంద్రంగా చేసుకుని తన సిబ్బందిని 700కు పైగా పెంచుకుంది. త్వరలో మరో బేస్ కేంద్రాన్ని ట్రుజెట్ ఏర్పాటు చేయనుంది. అంతేకాక ప్రస్తుతం వున్న అయిదు విమానాలతో దేశంలోని 20 గమ్యస్థానాలకు సేవలను నిర్వహిస్తోంది. దీర్ఘకాలిక ప్రణాళికతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ట్రుజెట్ తన ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందుకోసం తక్కువ ధరకు టికెట్లు అందించడం, ముందుగానే సీట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించడం, బోర్డింగ్ పాస్ లో వ్యాపార ప్రకటనలు ముద్రించడం వంటి చర్యలను చేపట్టింది. దేశీయ విమానయాన సేవలు అందిస్తున్న ట్రుజెట్ అంతర్జాతీయ విమానయానం చేసే ప్రయాణికులకు సైతం ఉపయోగపడేలా వారికి కనెక్టివిటీ కల్పించేందుకు గానూ పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుందని ట్రూజెట్ సీఎఫ్ఓ విశ్వనాధ్ చెప్పారు. సామాజిక సేవలో కూడా.. కేరళలో వరదలు సంభవించినప్పుడు బాధితులకు తన వంతు సేవగా పలు ప్రాంతాల నుండి కేరళకు ఆహారం, మందు, మంచినీరు, దుస్తులు తన విమానాలల్లో ఉచితంగా రవాణా చేసిన ఏకైక విమానయాన సంస్థగా నిలిచింది. ‘వింగ్స్ ఆఫ్ హోప్’ కార్యక్రమంలో గ్రామీణ బాలలకు ఉచితంగా విమాన ప్రయాణాన్ని అందించింది. ట్రుజెట్ నాల్గవ వార్షికోత్సవ సందర్భంగా తలసీమియా బాధితులకు సంస్థ సిబ్బంది 100 మంది జులై 5న రక్తదానం నిర్వహించారు. అదే సమయంలో విమాన ప్రయాణం అంటే తెలియని పేద వృద్ధ మహిళలను 45 మందిని నాందేడ్‌కు ఉచితంగా తమ విమానంలో తీసుకువెళ్లి వెనక్కి తీసుకువచ్చారు. అదే విధంగా అనాధ పిల్లలను బళ్లారి, కడప తదితర ప్రాంతాలకు విమానంలో ఉచితంగా తీసుకువెళ్లడంతో పాటు అనేక ఉచిత, చైతన్య అవగాహన కార్యక్రమాలను ట్రుజెట్ నిర్వహించింది. లాభాలతో, విజయవంతంగా : కేవీ ప్రదీప్ ఎంఇఐఎల్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ గడచిన నాలుగేళ్లుగా ట్రుజెట్ ప్రాంతీయ విమానయాన రంగంలో తనదైన ముద్ర వేసిందన్నారు. ప్రాంతీయ సేవల విభాగంలో తమతోపాటుగా ప్రారంభమైన విమానసేవల కంపెనీల్లో ట్రుజెట్ ఒక్కటే విజయపథంలో సాగుతోందన్నారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ‘ఉడాన్’ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు విమాన సేవలు అందించడం తమకు మంచి అవకాశమని పేర్కొన్నారు. -
జెట్ ఎయిర్వేస్కు ఊరట: ట్రూజెట్ చేతికి జెట్ విమానాలు
సాక్షి,ముంబై: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్ వేస్ కష్టాలనుంచి గట్టెక్కేందుకు మల్ల గుల్లాలుపడుతోంది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్కు భారీ ఊరట లభించనుంది. హైదరాబాద్ ఆధారిత సంస్థ ట్రూజెట్ జెట్ ఎయిర్‌వేస్‌తో మంతనాలు జరుపుతోంది. ఈమేరకు చర్చలు కూడా ప్రారంభించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్భారీస్థాయిలో విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మార్చి 2019 నాటికి 7 కొత్త విమానాలతో 20 ప్రాంతాలకు ట్రూజెట్ బ్రాండ్ విమానాలను నడపాలని యాజమాన్యం భావిస్తోంది. ఈ నెలలోనే ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఖర్చులు తగ్గించుకుని అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలని జెట్ ఎయిర్వేస్ భావిస్తోంది. 7 ఏటీఆర్ విమానాలతో పాటు సిబ్బంది, నిర్వహణ, ఇన్సూరెన్స్ లను కూడా స్వల్ప కాల సబ్ లీజుకి తీసుకొనే ఉద్దేశంలో ఉన్నామని ట్రూజెట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ 7 విమానాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తే ట్రూజెట్ జెట్ ఎయిర్ వేస్ నుంచి మరిన్ని విమానాలను సబ్ లీజుకి తీసుకొనే అవకాశం ఉందని అంచనా. మరోవైపు తన అన్ని విమానాల వాడకానికి సంబంధించిన అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని జెట్ ఎయిర్వేస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. జెట్ ఎయిర్ వేస్ తో ఒప్పందం కుదిరితే 7 ఏటీఆర్ విమానాలు ట్రూజెట్ ఫ్లీట్ లో చేరతాయి. ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు అమలులో ఉంటుందని సమాచారం. కాగా జూలై 2015న ట్రూజెట్ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం 5 ఏటీఆర్-72 విమానాలతో 14 ప్రాంతాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. టైర్ 2, టైర్ 3 నగరాలను కలుపుతూ చౌకగా విమానయానం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కింద ట్రూజెట్ తన కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విస్తరణ అనంతరం పశ్చిమ మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు విమానాలు నడిపే యోచనలో ఉంది ట్రూజెట్. -
మార్చికల్లా 7 విమానాలు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘ట్రూజెట్’ బ్రాండ్‌తో విమానాలు నడుపుతున్న టర్బో మేఘా ఎయిర్‌లైన్స్... నేషనల్ కారియర్‌గా అవతరించింది. మూడేళ్ల కిందట రెండు విమానాలతో మొదలైన ట్రూజెట్ జర్నీలో ఇపుడు మరో రెండు విమానాలు చేరాయి. త్వరలో మరో కొత్త విమానం కూడా రానున్నట్లు టర్బో మేఘా ప్రమోటింగ్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ డైరెక్టర్ కె.వి.ప్రదీప్ చెప్పారు. ‘‘ప్రస్తుతం 36 ప్రాంతాలకు విమానాలు నడుపుతున్నాం. కొత్త విమానం రాకతో ఈ సంఖ్య 46కు చేరుతుంది. వచ్చే మార్చికి మరో 2 విమానాలను జోడించాలని, 2019 మార్చి నాటికి మొత్తం విమానాల సంఖ్యను 14కు చేర్చాలని లకియంచాం. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ (ఉడాన్) కింద తొలిదశలో 18 రూట్లను మేం సాధించాం. వీటిలో 14 మార్గాల్లో ఇప్పటికే సర్వీసులు ప్రారంభించాం. స్కీమ్ రెండోదశలో మరో 25 రూట్లు పొందాలని చూస్తున్నాం’’ అని ప్రదీప్ వివరించారు. త్వరలో హెడ్‌క్వార్టర్ తరలింపు హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప వంటి నగరాలకు సేవలందిస్తున్న ట్రూజెట్... త్వరలో తన హెడ్‌క్వార్టర్‌ను హైదరాబాద్ నుంచి విశాఖకు మార్చుకోవాలని చూస్తోంది. దానికి అనుగుణంగా విశాఖకు సర్వీసులు ఆరంభిస్తోంది. ‘‘బెంగళూరు, చెన్నై, విశాఖలను పార్కింగ్ కోసం ఉపయోగించే యోచనలో ఉన్నాం. షిర్డీలో విమానాశ్రయం సిద్ధమయింది కనక త్వరలో షిర్డీకి నేరుగా హైదరాబాద్ నుంచి సర్వీసు ప్రారంభిస్తాం’’ అని ప్రదీప్ వివరించారు. కాగా ట్రూజెట్ సీఈవోగా వి. మాన్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో వివిధ ఎయిర్వేస్ సంస్థల్లో, కన్సల్టెన్సీల్లో పనిచేశారు. గంట ప్రయాణానికి రూ.2,200!! కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ కనెక్టివిటీ పథకాన్ని ప్రవేశపెట్టడంతో దీనికి అనుగుణంగా తక్కువ దూరాలకు నడపటం కోసం ఇండిగో వంటి సంస్థలు కూడా ఏటీఆర్ విమానాల్ని సమకూర్చుకునే పనిలో పడ్డాయి. ఇండిగో తాజాగా 6 ఏటీఆర్‌లు కొనుగోలు చేసింది కూడా. ఇతర విమానాలతో పోలిస్తే వీటి నిర్వహణ ఖర్చు తక్కువ కావడంతో ట్రూజెట్ వంటివీ వీటినే ఉపయోగిస్తున్నాయి. ఏటీఆర్‌లో గంట ప్రయాణానికి టికెట్ ధర రూ.2,200 వసూలు చేస్తే నష్టం రాదన్నది విమానయాన సంస్థల మాట.నిజానికి ప్రాంతీయ విమానయాన పథకం కింద దేశంలోని పలు నగరాలకు విమానాలు నడపాలన్నది కేంద్రం ఆలోచన. అందులో భాగంగానే పలు రూట్లకు బిడ్లు ఆహ్వానించింది. ఈ పథకం కింద నిర్వహించే విమానాల్లో సగం సీట్లను గంట ప్రయాణానికి రూ.2,500 చొప్పున ఫిక్స్ రేటుకు విక్రయించాలి. మిగిలినవి మార్కెట్‌ను అనుసరించి విక్రయించవచ్చు. బిడ్‌లో గెలిచిన సంస్థలు మాత్రమే ఆయా రూట్లలో మూడేళ్ల పాటు విమానాలు నడుపుతాయి. వాటికి గనక నష్టం వస్తే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ద్వారా కేంద్రం భర్తీ చేస్తుంది. ఈ నిధులు కొన్ని నెలలు ఆలస్యంగా అందుతున్నాయనే వాదనలున్నా... నష్టం రాకుం డా ఉండాలంటే తప్పదనేది విమానయాన సంస్థల మాట. -
విజయవాడ, తిరుపతి, కడప ట్రూజెట్ సర్వీసులు ప్రారంభం
సాక్షి, గన్నవరం: ట్రూజెట్ విమాన సంస్థ తిరుపతి-విజయవాడ, కడప-విజయవాడ మధ్య మంగళవారం నుంచి నూతన విమాన సర్వీసులను ప్రారంభించింది. వారానికి మూడు రోజుల పాటు నడపనున్న ఈ సర్వీసులను రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌లు లాంఛనంగా ప్రారంభించారు. తొలుత కడప వెళ్తున్న తొలి ప్రయాణికుడికి ఎయిర్‌పోర్టు డెరైక్టర్ జి. మధుసూదనరావు బోర్డింగ్ పాస్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ, కడప విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మధ్యస్థాయి విమానాలు సైతం దిగే విధంగా ప్రస్తుతం ఉన్న రన్‌వేను మరో 300 మీటర్లు విస్తరించేందుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎయిర్‌పోర్టు డెరైక్టర్ మాట్లాడుతూ, ఇక్కడి నుంచి క్రమంగా సర్వీసులు పెంచేందుకు విమాన సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. త్వరలో ఇండిగో విమాన సంస్థ ఇక్కడి నుంచి పలు ప్రధాన నగరాలకు సర్వీసులను నడపనున్నట్లు చెప్పారు. పెరిగిన ప్రయాణికులు, విమాన సర్వీసులకు అనుగుణంగా పార్కింగ్ బే, నూతన టెర్మినల్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విమానం కడపకు బయలుదేరి వెళ్లింది. అనాథ పిల్లలకు ఉచిత ప్రయాణం కొత్త సర్వీసుల ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడకు చెందిన ఓ అనాథ ఆశ్రమానికి చెందిన 15 మంది పిల్లలు విజయవాడ-కడప మధ్య ఉచితంగా ప్రయాణించేందుకు ట్రూజెట్ అవకాశం కల్పించింది. వీరందరిని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడపకు తీసుకువెళ్ళి, మళ్లీ ఇక్కడికి తీసుకువచ్చారు.