మార్చికల్లా 7 విమానాలు..! | 7 flights to convert in march | Sakshi
Sakshi News home page

మార్చికల్లా 7 విమానాలు..!

Published Thu, Nov 2 2017 12:01 AM | Last Updated on Thu, Nov 2 2017 12:01 AM

 7 flights to convert  in march - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘ట్రూజెట్‌’ బ్రాండ్‌తో విమానాలు నడుపుతున్న టర్బో మేఘా ఎయిర్‌లైన్స్‌... నేషనల్‌ కారియర్‌గా అవతరించింది. మూడేళ్ల కిందట రెండు విమానాలతో మొదలైన ట్రూజెట్‌ జర్నీలో ఇపుడు మరో రెండు విమానాలు చేరాయి. త్వరలో మరో కొత్త విమానం కూడా రానున్నట్లు టర్బో మేఘా ప్రమోటింగ్‌ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) గ్రూప్‌ డైరెక్టర్‌ కె.వి.ప్రదీప్‌ చెప్పారు. ‘‘ప్రస్తుతం 36 ప్రాంతాలకు విమానాలు నడుపుతున్నాం. కొత్త విమానం రాకతో ఈ సంఖ్య 46కు చేరుతుంది. వచ్చే మార్చికి మరో 2 విమానాలను జోడించాలని, 2019 మార్చి నాటికి మొత్తం విమానాల సంఖ్యను 14కు చేర్చాలని లకియంచాం. రీజనల్‌ కనెక్టివిటీ స్కీమ్‌ (ఉడాన్‌) కింద తొలిదశలో 18 రూట్లను మేం సాధించాం. వీటిలో 14 మార్గాల్లో ఇప్పటికే సర్వీసులు ప్రారంభించాం. స్కీమ్‌ రెండోదశలో మరో 25 రూట్లు పొందాలని చూస్తున్నాం’’ అని ప్రదీప్‌ వివరించారు.

త్వరలో హెడ్‌క్వార్టర్‌ తరలింపు
హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప వంటి నగరాలకు  సేవలందిస్తున్న ట్రూజెట్‌... త్వరలో తన హెడ్‌క్వార్టర్‌ను హైదరాబాద్‌ నుంచి విశాఖకు మార్చుకోవాలని చూస్తోంది. దానికి అనుగుణంగా విశాఖకు సర్వీసులు ఆరంభిస్తోంది. ‘‘బెంగళూరు, చెన్నై, విశాఖలను పార్కింగ్‌ కోసం ఉపయోగించే యోచనలో ఉన్నాం. షిర్డీలో విమానాశ్రయం సిద్ధమయింది కనక త్వరలో షిర్డీకి నేరుగా హైదరాబాద్‌ నుంచి సర్వీసు ప్రారంభిస్తాం’’ అని ప్రదీప్‌ వివరించారు. కాగా ట్రూజెట్‌ సీఈవోగా వి. మాన్‌ సింగ్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో వివిధ ఎయిర్‌వేస్‌ సంస్థల్లో, కన్సల్టెన్సీల్లో పనిచేశారు.

గంట ప్రయాణానికి రూ.2,200!!
కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ కనెక్టివిటీ పథకాన్ని ప్రవేశపెట్టడంతో దీనికి అనుగుణంగా తక్కువ దూరాలకు నడపటం కోసం ఇండిగో వంటి సంస్థలు కూడా ఏటీఆర్‌ విమానాల్ని సమకూర్చుకునే పనిలో పడ్డాయి. ఇండిగో తాజాగా 6 ఏటీఆర్‌లు కొనుగోలు చేసింది కూడా. ఇతర విమానాలతో పోలిస్తే వీటి నిర్వహణ ఖర్చు తక్కువ కావడంతో ట్రూజెట్‌ వంటివీ వీటినే ఉపయోగిస్తున్నాయి. ఏటీఆర్‌లో గంట ప్రయాణానికి టికెట్‌ ధర రూ.2,200 వసూలు చేస్తే నష్టం రాదన్నది విమానయాన సంస్థల మాట.నిజానికి ప్రాంతీయ విమానయాన పథకం కింద దేశంలోని పలు నగరాలకు విమానాలు నడపాలన్నది కేంద్రం ఆలోచన. అందులో భాగంగానే పలు రూట్లకు బిడ్లు ఆహ్వానించింది. ఈ పథకం కింద నిర్వహించే విమానాల్లో సగం సీట్లను గంట ప్రయాణానికి రూ.2,500 చొప్పున ఫిక్స్‌ రేటుకు విక్రయించాలి. మిగిలినవి మార్కెట్‌ను అనుసరించి విక్రయించవచ్చు. బిడ్‌లో గెలిచిన సంస్థలు మాత్రమే ఆయా రూట్లలో మూడేళ్ల పాటు విమానాలు నడుపుతాయి. వాటికి గనక నష్టం వస్తే వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) ద్వారా కేంద్రం భర్తీ చేస్తుంది. ఈ నిధులు కొన్ని నెలలు ఆలస్యంగా అందుతున్నాయనే వాదనలున్నా... నష్టం రాకుం డా ఉండాలంటే తప్పదనేది విమానయాన సంస్థల మాట.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement