విజయవాడ, తిరుపతి, కడప ట్రూజెట్ సర్వీసులు ప్రారంభం
సాక్షి, గన్నవరం: ట్రూజెట్ విమాన సంస్థ తిరుపతి-విజయవాడ, కడప-విజయవాడ మధ్య మంగళవారం నుంచి నూతన విమాన సర్వీసులను ప్రారంభించింది. వారానికి మూడు రోజుల పాటు నడపనున్న ఈ సర్వీసులను రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌లు లాంఛనంగా ప్రారంభించారు. తొలుత కడప వెళ్తున్న తొలి ప్రయాణికుడికి ఎయిర్‌పోర్టు డెరైక్టర్ జి. మధుసూదనరావు బోర్డింగ్ పాస్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ, కడప విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మధ్యస్థాయి విమానాలు సైతం దిగే విధంగా ప్రస్తుతం ఉన్న రన్‌వేను మరో 300 మీటర్లు విస్తరించేందుకు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఎయిర్‌పోర్టు డెరైక్టర్ మాట్లాడుతూ, ఇక్కడి నుంచి క్రమంగా సర్వీసులు పెంచేందుకు విమాన సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. త్వరలో ఇండిగో విమాన సంస్థ ఇక్కడి నుంచి పలు ప్రధాన నగరాలకు సర్వీసులను నడపనున్నట్లు చెప్పారు. పెరిగిన ప్రయాణికులు, విమాన సర్వీసులకు అనుగుణంగా పార్కింగ్ బే, నూతన టెర్మినల్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విమానం కడపకు బయలుదేరి వెళ్లింది.
అనాథ పిల్లలకు ఉచిత ప్రయాణం
కొత్త సర్వీసుల ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడకు చెందిన ఓ అనాథ ఆశ్రమానికి చెందిన 15 మంది పిల్లలు విజయవాడ-కడప మధ్య ఉచితంగా ప్రయాణించేందుకు ట్రూజెట్ అవకాశం కల్పించింది. వీరందరిని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడపకు తీసుకువెళ్ళి, మళ్లీ ఇక్కడికి తీసుకువచ్చారు.