
(సాక్షి, బిజినెస్ విభాగం):భారత్‌కు ఎగుమతి అవుతున్న హార్లీ డేవిడ్‌సన్ బైక్‌ల గురించి... సరిగ్గా నెల రోజుల కిందట వైట్ హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ‘‘ఈ మధ్యే ఒక దేశ ప్రధాన మంత్రి నాకు ఫోన్ చేసి.. మీ దేశం నుంచి దిగుమతి అవుతున్న హార్లీ డేవిడ్‌సన్ బైక్‌లపై సుంకాన్ని 100 శాతం నుంచి 50 శాతానికి తగ్గిస్తున్నామని చాలా గొప్పగా చెప్పారు. నిజంగా ఆయన గొప్ప వ్యక్తి. కాకపోతే, ఇక్కడ అమెరికాకు చేసిన మేలు ఏంటో నాకు అర్ధం కాలేదు. సుంకం తగ్గిస్తే మాకేంటి లాభం? ఇంకా మా కంపెనీల నుంచి 50 శాతం సుంకాన్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు కదా!!. దీనికి ప్రతీకారం తప్పదు’’ అంటూ ట్రంప్ కుండ బద్దలు కొట్టారు. చాలా దేశాలు అమెరికా ఎగుమతులపై భారీ సుంకాలు రాబడుతున్నాయని, తాము మాత్రం విదేశీ దిగుమతులకు ప్రోత్సాహకాల పేరుతో చాలా కోల్పోయామని నిప్పులు చెరిగారు. చైనా, భారత్‌లే కాదు... ఇక తమపై సుంకాలు విధిస్తున్న ఏ దేశాన్నీ వదలబోమంటూ వాణిజ్య యుద్ధానికి సంకేతాలిచ్చారు. ముందుగా తమ దేశంలోకి దిగుమతి అవుతున్న ఉక్కు ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం చొప్పున సుంకాలు విధిస్తూ ఆదేశాలు జారీచేసి ప్రపంచానికి షాక్ ఇచ్చారు. దీనితర్వాత ఇప్పుడు నేరుగా చైనా నుంచి దిగుమతి అయ్యే 60 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించడంతో పోరు తీవ్రమయింది. చైనా కూడా తక్షణం ప్రతీకార సుంకాలతో దూకింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య రేగిన ఈ చిచ్చు... ఇతర దేశాలను వణికిస్తోంది. చినికిచినికి గాలివానగా మారి తమనెక్కడ ముంచేస్తుందోనన్నది ఇతర దేశాల భయం.
వాణిజ్య యుద్ధం అంటే..?
ఒక దేశ వాణిజ్య ప్రయోజనాలను మరో దేశం దెబ్బతీయడాన్నే వాణిజ్య యుద్ధంగా చెప్పొచ్చు. యుద్ధాల్లో క్షిపణుల మాదిరే ఈ వాణిజ్య యుద్ధంలో ‘సుంకాల్ని’ ప్రయోగిస్తారు. ఇక్కడ అమెరికానే తీసుకుంటే... ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకం విధించడం వల్ల ఇప్పటివరకూ ఆ దేశానికి ఎగుమతులు చేస్తున్న చైనా, జపాన్, జర్మనీ, భారత్ ఇతరత్రా దేశాలపై భారం పడుతుంది. ఆయా దేశాల కంపెనీల లాభాలు హరించుకుపోతాయి. ఇతర మార్కెట్లను వెతుక్కోవాల్సి వస్తుంది. దీనికి ప్రతిగా ఇతర దేశాలు కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధిస్తాయి. వాణిజ్యం తీవ్రంగా దెబ్బతిని.. ఉద్యోగాల కోతలు... ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యే పరిస్థితికి దారితీస్తుంది.
చైనాపై ఎందుకీ మంట...!
ప్రపంచ వాణిజ్య మండలిలో (డబ్ల్యూటీఓ) సభ్యత్వం ఉన్న దేశాలు ఇష్టానుసారం మరో దేశంపై సుంకాలు వేయటానికి వీల్లేదు. అయితే, తయారీ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న చైనా... చౌక ఉత్పత్తులతో ఇతర దేశాల్ని ముంచేస్తోంది. దీంతో పలు దేశాలు యాంటీ డంపింగ్ సుంకాన్ని విధిస్తున్నాయి. దీనిపై చైనా డబ్ల్యూటీఓలో రచ్చ చేయడం వల్ల కొన్ని దేశాలు వెనక్కితగ్గాయి. ఇప్పుడు ట్రంప్ తమ వ్యాపార అవకాశాలు, ఉద్యోగాలను ఇతర దేశాలు తన్నుకుపోతున్నాయంటూ డబ్ల్యూటీఓ నుంచి వైదొలగుతామని కూడా హెచ్చరించడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. చైనాతో తమ వాణిజ్య లోటు 375 బిలియన్ డాలర్లకు పెరిగిపోయిందని.. దీనివల్ల ఏకంగా అమెరికాలో కల్పించాల్సిన 20 లక్షలకుపైగా ఉద్యోగాలను చైనా తన్నుకుపోయిందని ట్రంప్ సర్కారు దుమ్మెత్తిపోస్తోంది. వాణిజ్య బంధాల వల్ల అమెరికాకంటే చైనాయే అత్యధికంగా లబ్ధి పొందిందని లెక్కలతో సహా వివరించింది. డబ్ల్యూటీఓలో 2001లో చైనా చేరినప్పుడు ఆ దేశ జీడీపీ 1 ట్రిలియన్ డాలర్లు కాగా... ఇపుడది 12 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మరోపక్క, తమ ఆర్థిక వ్యవస్థ (ప్రస్తుతం 18 ట్రిలియన్ డాలర్లు) బలహీన పడిందని అమెరికా చెబుతోంది. కొన్నేళ్ల క్రితం 3.5 శాతం వృద్ధి రేటుండగా.. ఇపుడది 2 శాతానికి దిగజారిందని చైనాపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీనికి తోడు ఎన్నికల్లో ఇచ్చిన భారీ ఉద్యోగాల హామీ కూడా ఈ వాణిజ్య యుద్ధానికి ట్రంప్‌ను తెరతీసేలా చేసింది.
సుంకాలు ఒక్కటే కాదు..
ప్రపంచ వాణిజ్యంలో అమెరికా, చైనాలదే అత్యధిక వాటా. కానీ ట్రంప్ చైనాతో పాటు అమెరికాకు అత్యధికంగా ఎగుమతులు చేసే యూరప్ దేశాలనూ లక్ష్యంగా చేసుకున్నారు. తమ సుంకాలకు ప్రతిగా యూరప్ దేశాలు గనుక సుంకాలు విధిస్తే... అక్కడి ఆటోమొబైల్ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తామని బెదిరించారు కూడా. ఎందుకంటే ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ ఇతరత్రా అనేక దిగ్గజ వాహన కంపెనీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్. సుంకాలు విధిస్తే వాటి వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయి. దీనివల్ల ఆయా దేశాల్లో ఉద్యోగాలకు ముప్పు ఖాయం. సుంకాలతో పాటు ఇతర దేశాల వ్యాపార సంస్థలపైనా ట్రంప్ నేరుగా గురిపెట్టారు. ఇటీవలే అమెరికన్ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌ను సింగపూర్‌కు చెందిన బ్రాడ్‌కామ్ కొనుగోలు చేసేందుకు సంబంధించిన ఒప్పందాన్ని ట్రంప్ అడ్డుకున్నారు. ఇదీ వాణిజ్య యుద్ధమే. దీనికి భద్రతపరమైన కారణాలను ట్రంప్ తెరపైకి తెచ్చారు. ఈ డీల్ విలువ 117 బిలియన్ డాలర్లు. ట్రంప్ దెబ్బతో ఒప్పందాన్ని ఇరు సంస్థలూ విరమించుకోవాల్సి వచ్చింది. ఈ డీల్ కుదిరితే చైనా టెలికం దిగ్గజంహువావేకు భారీగా లబ్ధి చేకూరుతుందనేది అమెరికా భయం.
ఇకపై ఏం జరగొచ్చు?
వాణిజ్య యుద్ధంలో విజేతలెవరూ ఉండరని.. క్షతగాత్రులే మిగులుతారనేది ప్రపంచ ఆర్థిక వేత్తల మాట. డబ్ల్యూటీఓలో ప్రధాన సభ్యులు యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్‌లు తామూ అమెరికా సుంకాలపై ప్రతిదాడి చేస్తామని చెప్పాయి. ట్రంప్ మొండి వైఖరికి ప్రతిగా ఇతర దేశాలూ ప్రతీకారానికి దిగితే మున్ముందు ఈ సమస్య తీవ్రమవుతుందని డబ్ల్యూటీఓ చీఫ్ రాబర్ట్ అజెవెడో హెచ్చరించారు. కాగా, వాణిజ్య యుద్ధానికి వెనుకాడబోమన్న చైనా కూడా 3 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై తాజాగా సుంకాన్ని విధించింది. మరోవంక ట్రంప్ ఇప్పుడు చేస్తున్నది ఆరంభమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలోకి దిగుమతయ్యే యురేనియంపైనా సుంకాల పోటు ఉండొచ్చని భావిస్తున్నారు. చైనా కూడా అమెరికాపై మున్ముందు మరిన్ని ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. 2015లో అమెరికా కంపెనీ బోయింగ్‌తో చైనా ఎయిర్‌లైన్స్ కుదుర్చుకున్న 38 బిలియన్ డాలర్ల విమానాల కొనుగోలు ఆర్డర్లను రద్దు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా, వ్యవసాయం, టెక్నాలజీ ఇతరత్రా కీలక రంగాలకు చెందిన అమెరికా దిగుమతులపైనా చైనా సుంకాల మోత మోగిస్తుందనేది పరిశీలకుల అభిప్రాయం.
భారత్‌పై ప్రభావం ఏంటి?
అమెరికా సుంకాల ప్రభావం భారత్‌పై తక్కువే కానీ... అన్ని దేశాలూ అమెరికా పాటే పాడితే కచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థకు దెబ్బే. ఇప్పుడు భారత్ స్టీల్ ఎగుమతుల్లో అమెరికాకు వెళ్తున్నవి 2 శాతమే. అల్యూమినియం ఎగుమతులూ నామమాత్రమే. అయితే, ట్రంప్ సుంకాల ప్రకటన తర్వాత భారత్ లోహ కంపెనీల షేర్లు తీవ్ర కుదుపులకు గురవుతున్నాయి. ఇక ఎగుమతిదారులకు భారత్ అనేక సబ్సిడీ పథకాలను ఇస్తోందని.. ఇది పోటీతత్వాన్ని దెబ్బతీయడమేనని డబ్ల్యూటీఓకు కూడా అమెరికా ఫిర్యాదు చేసింది. ఐటీ ఇతరత్రా సేవల్లో అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలాంటి అగ్రరాజ్యంతో తలపడితే భారత్‌కు తలనొప్పులు ఖాయం. అందుకే ఈ సుంకాలపై భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇక చైనాపై అమెరికా సుంకాల వల్ల మన కంపెనీలకు కొంత మేలు జరగొచ్చనేది నిపుణుల మాట. అయితే, భవిష్యత్తులో భారత్‌కూ ఇలాంటి చిక్కులొస్తే పరిస్థితి ఏంటన్నది మన వ్యాపార సంస్థలకు గుబులు పుట్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment