
టీవీఎస్ ఇథనాల్ బైక్‌ను విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి గడ్కరీ, వేణు శ్రీనివాసన్, నీతిఆయోగ్ సీఈఓ అమితాభ్ కాంత్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టీవీఎస్ మోటార్’.. తాజాగా తన పాపులర్ మోడల్ అపాచీలో ‘ఇథనాల్’ వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘అపాచీ ఆర్‌టీఆర్ 200 ఫై ఈ100’ పేరిట శుక్రవారం విడుదలైన ఈ అధునాతన బైక్... ఇథనాల్ ఇంధనం ఆధారంగా నడుస్తుంది. ప్రారంభ ధర రూ.1.2 లక్షలు. దేశవ్యాప్తంగా ఇథనాల్ అందుబాటులో లేనందున ప్రస్తుతానికి చెరుకు పంటకు ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకల్లో ఈ బైక్‌ను విడుదల చేసినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ వేణు శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ‘ద్విచక్ర వాహన పరిశ్రమ పెట్రోల్, డీజిల్ బైక్‌ల నుంచి నెమ్మదిగా పర్యావరణ అనుకూల ఇంధనాలవైపునకు అడుగులు వేస్తోంది. కంపెనీలు విద్యుత్, హైబ్రిడ్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాల దిశగా దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇథనాల్ కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నాం. ఈ కారణంగానే.. ఈ బైక్‌ను ప్రవేశపెట్టాం’ అని అన్నారు.
త్వరలోనే ఇథనాల్ పంప్స్..
పెట్రోల్ బంకుల మాదిరిగా త్వరలోనే దేశవ్యాప్తంగా ఇథనాల్ పంప్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇథనాల్ బైక్ విడుదల కార్యక్రమానికి హజరైన ఆయన.. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖను ఇథనాల్ పంప్స్ ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment