చైనా ట్విట్టర్ కు అమ్మాయే అధినేత
చైనాలో బిజినెస్ విస్తరణ కోసం ట్విట్టర్ కొత్త అధినేతగా ఓ మహిళను నియమించింది. ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న కాథే చెన్ ను చైనా కొత్త మేనేజింగ్ డెరైక్టర్ గా ప్రకటించింది. ఈ నియమకాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. చైనాలో సోషల్ మీడియా సైట్‌లు 340 శాతం వృద్ధిలో ఉన్నాయని, చాలామంది ప్రకటనదారులు ట్విట్టర్ నే మాద్యమంగా ఎంచుకుంటున్నారని ఆసియా- పసిఫిక్ ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్ శైలేష్ రావ్ తెలిపారు. ట్విట్టర్ ఇంత విజయవంతమైనందున తమ బిజినెస్ లను విస్తరించుకుంటామని రావ్ ప్రకటించారు. ట్విట్టర్ ను అభివృద్ధిలో నడిపిస్తూ వ్యాపారం నిర్వహించే బాధ్యత కాథే చెన్ పై ఉంటుందని చెప్పారు.
సరైన సమయంలో చైనీయులు తమ సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి ట్విట్టర్ ఎంతో దోహదం పడుతుందని చెన్ ట్వీట్ చేశారు. అయితే 2009 నుంచి ఆ దేశంలో నిషేధంలో ఉన్న ట్విట్టర్, గతేడాది హాంకాంగ్‌లో కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయం ద్వారా చైనీస్ కంపెనీలకు ప్రకటన సేవలను అందిస్తోంది.