new managing director
-
ఎస్బీఐ ఎండీగా రామ మోహన్ రావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎండీగా తెలుగువారైన రామ మోహన్ రావు అమరను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్బీఐ బోర్డులో ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉంటారు. రామ మోహన్ రావు బాధ్యతలు స్వీకరిస్తే ఎండీల సంఖ్య నాలుగుకు చేరుకుంటుంది. సంస్థ చైర్మన్ సి.ఎస్.శెట్టి కూడా తెలుగు వారు కావడం విశేషం. ఎస్బీఐ చరిత్రలో ఒకేసారి రెండు కీలక పదవులను తెలుగువారు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డైరెక్టర్ల పేర్లను సిఫార్సు చేసే ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో రామ మోహన్ రావును ఎస్బీఐ ఎండీగా ప్రతిపాదించింది. ఎస్బీఐ ఎండీ పోస్టుకు ఎఫ్ఎస్ఐబీ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదనలపై ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవోగా కూడా రామ మోహన్ రావు పనిచేశారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. -
ఎస్బీఐ కొత్త ఎండీగా రాణా అశుతోశ్ కుమార్ సింగ్!
న్యూఢిల్లీ: ఎస్బీఐ కొత్త ఎండీగా రాణా అశుతోశ్ కుమార్ సింగ్ పేరును ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆయన ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా ఉన్నారు.ఎస్బీఐలో ప్రస్తుతం ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉన్నారు. ఎస్బీఐ కొత్త ఎండీ నియామకం కోసం 16 మందిని ఇంటర్వ్యూ చేశారు. కాగా ఇండియన్ బ్యాంక్ నూతన ఎండీగా ఆశీష్ పాండే పేరును బ్యూరో ప్రతిపాదించింది. -
నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటర్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స నియమితులయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాకేశ్ శ్రీవాస్తవ మార్చి 31తో రిటైరవుతున్నారు. ఇటీవల జనవరి 15నే కంపెనీలో ఆయన డిప్యుటీ ఎండీగా నియమితులయ్యారు. అనుభవజు్ఞడైన వత్స సారథ్యం .. కంపెనీ తదుపరి వృద్ధికి దోహదపడగలదని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. -
ఎల్ఐసీ ఎండీగా సత్పాల్ భాను
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరిగా సత్పాల్ భానూను ప్రభుత్వం నియమించింది. ఏప్రిల్‌లో ఎల్ఐసీ చైర్మన్‌గా నియమితులైన సిద్ధార్థ మొహంతి స్థానంలో సత్పాల్ భాను నియమితులయ్యారు. ఆయన బాధ్యతలను చేపట్టిన నాటి నుంచీ ఈ నియామకం వర్తిస్తుంది. 2025 డిసెంబర్ 31న పదవీ విరమణ వరకూ లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు (ఏది ముందైతే అది) భాను బాధ్యతల్లో కొనసాగుతారని ఎల్ఐసీ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. -
టెక్ మహీంద్రా ఎండీగా మోహిత్ జోషి
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తాజాగా మరో ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా కొత్త ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ హోదాల్లో ఉన్న సీపీ గుర్నాణీ డిసెంబర్ 19న పదవీ విరమణ చేశాక .. జోషి బాధ్యతలు చేపడతారు. బాధ్యతల మార్పిడి, కార్యకలాపాలపై అవగాహన కోసం అంతకన్నా ముందుగానే కంపెనీలో చేరతారని టెక్ మహీంద్రా తెలిపింది. మరోవైపు, జోషి తన పదవికి రాజీనామా సమర్పించారని, మార్చి 11 నుంచి ఆయన సెలవులో ఉంటారని ఇన్ఫీ పేర్కొంది. కంపెనీలో ఆయన ఆఖరు పని దినం జూన్ 9గా ఉంటుందని వివరించింది. జోషి 2000లో ఇన్ఫీలో చేరారు. అంతకు ముందు ఆయన ఏబీఎన్ ఆమ్రో, ఏఎన్జెడ్ గ్రిండ్లేస్ తదితర సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, కొత్త టెక్నాలజీలు, భారీ డీల్స్ విషయంలో జోషికి ఉన్న అపార అనుభవం టెక్ మహీంద్రాకు సహాయకరంగా ఉండగలదని గుర్నాణీ తెలిపారు. టెక్ మహీంద్రా కొత్త మైలురాళ్లను అధిగమించడంలో అందరితో కలిసి పనిచేస్తానని, సానుకూల ఫలితాలు సాధించడానికి కృషి చేస్తానని జోషి పేర్కొన్నారు. -
రామ్‌కో సిమెంట్స్ చైర్మన్‌గా ఎంఎఫ్ ఫారూఖి
హైదరాబాద్: రామ్‌కో సిమెంట్స్ చైర్మన్‌గా ఎంఎఫ్ ఫారూఖిని నియమించుకుంది. చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవులు రెండింటినీ ఒక్కరే నిర్వహించకుండా, మరింత మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్ కోసం వీటిని వేరు చేయాలంటూ సెబీ లోగడ నిబంధనలు తీసుకొచ్చింది. నూతన నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్ బోర్డు చైర్మన్, ఎండీ పదవులను వేరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి ఎంఎఫ్ ఫారూఖిని ఎంపిక చేసినట్టు సంస్థ ప్రకటించింది. ఇక ఇప్పటి వరకు చైర్మన్, ఎండీగా సేవలు అందించిన కంపెనీ వ్యవస్థాపకుడు పీఆర్ వెంకట్రామ రాజా ఎండీగా కొనసాగుతారని కంపెనీ ప్రకటించింది. ఎండీగా ఆయన పదవీకాలం ఈ ఏడాది జూన్ 3తో ముగియనుంది. అయితే, ఆ తదుపరి మరో ఐదేళ్ల కాలానికి ఎండీగా నియమించినట్టు రామ్‌కో సిమెం ట్స్ తెలిపింది. ఈ నిర్ణయాలకు రానున్న కంపెనీ ఏజీఎంలో వాటాదారుల ఆమోదం తీసుకోనుంది. -
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎండీగా కె.వి. ప్రదీప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ అయిన ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నూతన ఎండీగా వెంకటేశ్వర ప్రదీప్ కారుమూరు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. కొత్త బాధ్యతల్లో మూడేళ్లపాటు ఉంటారు. సివిల్ ఇంజనీర్ అయిన ప్రదీప్.. వ్యాపార అభివృద్ధి, ప్రాజెక్టుల అమలు, ఈపీసీ, విమానయాన రంగాల్లో 22 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ బస్ తయారీ సంస్థకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అత్యంత అధునాతన, పర్యావరణ అనుకూల ఈ–బస్‌లను ప్రవేశపెట్టడంలో భాగస్వామ్యం అవుతామని వివరించారు. ఆర్డర్ బుక్ 1,325 బస్‌లు.. ప్రస్తుతం ఒలెక్ట్రా ఖాతాలో 1,325 బస్‌లకు ఆర్డర్ ఉంది. ఇందులో 87 యూనిట్లు డెలివరీ చేశారు. కొత్తగా 300 బస్‌ల కాంట్రాక్టుకుగాను లోయెస్ట్ బిడ్డర్‌గా కంపెనీ నిలిచింది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. మరిన్ని టెండర్లలో పాలుపంచుకునే పనిలో కంపెనీ నిమగ్నమైంది. కాగా, జూన్ త్రైమాసికంలో ఒలెక్ట్రా రూ.5.65 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3.62 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ 86 శాతం అధికమై రూ.41.15 కోట్లు సాధించింది. ఇందులో ఈ–బస్ విభాగం వాటా రూ.23.36 కోట్లు ఉంది. విద్యుత్ పంపిణీకి అవసరమైన సిలికాన్ రబ్బర్/కంపోజిట్ ఇన్సులేటర్స్ తయారీలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ దేశంలో అతిపెద్ద కంపెనీ. -
ఎస్బీఐ ఎండీగా తెలుగు వ్యక్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఎండీగా చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగేలా కేంద్రం ఆయన నియామకాన్ని ఖరారు చేయటంతో... మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలియజేసింది. గతంలో ఈయన ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1988లో అహ్మదాబాద్ ఎస్బీఐలో ప్రొబెషనరీ అధికారిగా ఉద్యోగంలో చేరిన శ్రీనివాసులుకు వ్యవసాయమంటే ఎంతో ఇష్టం. దానికి తగ్గట్టే ఆయన హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (ప్రస్తుతం ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ) వ్యవసాయ విద్యను అభ్యసించారు. ఆ తరవాత అనుకోకుండా బ్యాంకింగ్ రంగంలో అడుగు పెట్టి అక్కడే స్థిరపడ్డారు. ఎస్బీఐలో వివిధ హోదాల్లో పనిచేసిన శ్రీనివాసులు... వృత్తి రీత్యా గతంలో కొన్నాళ్లపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. -
చైనా ట్విట్టర్ కు అమ్మాయే అధినేత
చైనాలో బిజినెస్ విస్తరణ కోసం ట్విట్టర్ కొత్త అధినేతగా ఓ మహిళను నియమించింది. ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న కాథే చెన్ ను చైనా కొత్త మేనేజింగ్ డెరైక్టర్ గా ప్రకటించింది. ఈ నియమకాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. చైనాలో సోషల్ మీడియా సైట్లు 340 శాతం వృద్ధిలో ఉన్నాయని, చాలామంది ప్రకటనదారులు ట్విట్టర్ నే మాద్యమంగా ఎంచుకుంటున్నారని ఆసియా- పసిఫిక్ ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్ శైలేష్ రావ్ తెలిపారు. ట్విట్టర్ ఇంత విజయవంతమైనందున తమ బిజినెస్ లను విస్తరించుకుంటామని రావ్ ప్రకటించారు. ట్విట్టర్ ను అభివృద్ధిలో నడిపిస్తూ వ్యాపారం నిర్వహించే బాధ్యత కాథే చెన్ పై ఉంటుందని చెప్పారు. సరైన సమయంలో చైనీయులు తమ సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి ట్విట్టర్ ఎంతో దోహదం పడుతుందని చెన్ ట్వీట్ చేశారు. అయితే 2009 నుంచి ఆ దేశంలో నిషేధంలో ఉన్న ట్విట్టర్, గతేడాది హాంకాంగ్‌లో కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయం ద్వారా చైనీస్ కంపెనీలకు ప్రకటన సేవలను అందిస్తోంది.