
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తాజాగా మరో ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా కొత్త ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ హోదాల్లో ఉన్న సీపీ గుర్నాణీ డిసెంబర్ 19న పదవీ విరమణ చేశాక .. జోషి బాధ్యతలు చేపడతారు. బాధ్యతల మార్పిడి, కార్యకలాపాలపై అవగాహన కోసం అంతకన్నా ముందుగానే కంపెనీలో చేరతారని టెక్ మహీంద్రా తెలిపింది. మరోవైపు, జోషి తన పదవికి రాజీనామా సమర్పించారని, మార్చి 11 నుంచి ఆయన సెలవులో ఉంటారని ఇన్ఫీ పేర్కొంది.
కంపెనీలో ఆయన ఆఖరు పని దినం జూన్ 9గా ఉంటుందని వివరించింది. జోషి 2000లో ఇన్ఫీలో చేరారు. అంతకు ముందు ఆయన ఏబీఎన్ ఆమ్రో, ఏఎన్‌జెడ్ గ్రిండ్లేస్ తదితర సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, కొత్త టెక్నాలజీలు, భారీ డీల్స్ విషయంలో జోషికి ఉన్న అపార అనుభవం టెక్ మహీంద్రాకు సహాయకరంగా ఉండగలదని గుర్నాణీ తెలిపారు. టెక్ మహీంద్రా కొత్త మైలురాళ్లను అధిగమించడంలో అందరితో కలిసి పనిచేస్తానని, సానుకూల ఫలితాలు సాధించడానికి కృషి చేస్తానని జోషి పేర్కొన్నారు.