Mohit Joshi
-
టెక్ మహీంద్రా ఎండీగా మోహిత్ జోషి
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తాజాగా మరో ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా కొత్త ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ హోదాల్లో ఉన్న సీపీ గుర్నాణీ డిసెంబర్ 19న పదవీ విరమణ చేశాక .. జోషి బాధ్యతలు చేపడతారు. బాధ్యతల మార్పిడి, కార్యకలాపాలపై అవగాహన కోసం అంతకన్నా ముందుగానే కంపెనీలో చేరతారని టెక్ మహీంద్రా తెలిపింది. మరోవైపు, జోషి తన పదవికి రాజీనామా సమర్పించారని, మార్చి 11 నుంచి ఆయన సెలవులో ఉంటారని ఇన్ఫీ పేర్కొంది. కంపెనీలో ఆయన ఆఖరు పని దినం జూన్ 9గా ఉంటుందని వివరించింది. జోషి 2000లో ఇన్ఫీలో చేరారు. అంతకు ముందు ఆయన ఏబీఎన్ ఆమ్రో, ఏఎన్జెడ్ గ్రిండ్లేస్ తదితర సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, కొత్త టెక్నాలజీలు, భారీ డీల్స్ విషయంలో జోషికి ఉన్న అపార అనుభవం టెక్ మహీంద్రాకు సహాయకరంగా ఉండగలదని గుర్నాణీ తెలిపారు. టెక్ మహీంద్రా కొత్త మైలురాళ్లను అధిగమించడంలో అందరితో కలిసి పనిచేస్తానని, సానుకూల ఫలితాలు సాధించడానికి కృషి చేస్తానని జోషి పేర్కొన్నారు. -
ఇన్ఫోసిస్‌కి షాకిచ్చిన టెక్ఎం కొత్త సీఎండీ, రోజు సంపాదన ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ , టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా సీఎండీగా మోహిత్ జోషి ఎంపికైన సంగతి తెలిసిందే. భారతీయ ఐటీ పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన పదివిని వరించిన ఈ నేపథ్యంలో ఆయన విద్యార్హతలు, టెక్ ప్రపంచంలో అనుభవం, వార్షికవేతన తదితర అంశాలు చర్చకు దారి తీసాయి. మోహిత్ జోషి ఎవరు? టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో 22 సంవత్సరాల అనుభవజ్ఞుడైన మోహిత్ జోషి ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ఇప్పటివరకు ఆయన ఒక్క రోజు వేతనం రూ. 9.5 లక్షలు. రెండు దశాబ్దాల అనుభవంతో ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్,కన్సల్టింగ్ రంగంలో నిపుణుడు. ఇన్ఫోసిస్ కంటే ముందు అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో పనిచేశారు. (ఇదీ చదవండి: జాక్‌పాట్ అంటే ఇదే! నిమి...రతన్ టాటాను మించిపోయాడు!) 1974 ఏపప్రిల్13న జన్మించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం నుండి పాఠశాల విద్య పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో తన గ్రాడ్యుయేషన్, తరువాత ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (FMS) నుండి MBA చేసాడు. అమెరికా హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుండి ప్రపంచ నాయకత్వం , పబ్లిక్ పాలసీని కూడా అధ్యయనం చేశాడు. 2000లో ఇన్ఫోసిస్‌లో చేరి, వివిధ హోదాల్లో పనిచేశారు. మోహిత్ తన కెరీర్లో ఆసియా, అమెరికా,యూరప్, మెక్సికోలో పనిచేశారు. జోషికి భార్య ఇద్దరు కుమార్తెలతో లండన్‌లో నివసిస్తున్నారు. 2021 సంవత్సరంలో, మోహిత్ జీతం రూ. 15 కోట్ల నుండి రూ. 34. 82 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ ఫైలింగ్ ప్రకారం, అతను 2021-2022లో రూ. 34,89,95,497 (రూ. 34.89 కోట్లు) జీతం పొందారు. ఇన్ఫోసిస్‌కి పెద్ద దెబ్బే ఇటీవలి కాలంలో ఇన్ఫోసిస్‌కి ఇది రెండో అతిపెద్ద నిష్క్రమణ. ఇటీవలే రవికుమార్ ఎస్ ఇన్ఫోసిస్‌కి గుడ్‌బై చెప్పి కాగ్నిజెంట్‌కు సీఈఓగా చేరారు. జోషిని బోర్డులో ఉంచడానికి ఇన్ఫోసిస్ చివరి నిమిషం దాకా ప్రయత్నించింది విఫలమైందట. జోషి నిష్క్రమణ ఇన్ఫోసిస్‌కి పెద్ద లోటేనని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్ఫీ సీఎండీ సలీల్ పరేఖ్ తరువాత అత్యధిక పే అందుకున్నవారు జోషి మాత్రమే. (మైక్రోసాఫ్ట్‌లో మూడో రౌండ్ తీసివేతలు, ఈసారి ఎవరంటే?) గుర్నానీకి సరైన ప్రత్యామ్నాయం టెక్ మహీంద్రా సీఎండీ గుర్నానీ పదవీ విరమణ చేస్తున్న తరుణంలో ఆయనకు సరైన ప్రత్యామ్నాయంగా టెక్ఎం భావించడం విశేషం. డిసెంబర్ 20నుంచి మోహిత్ జోషి బాధ్యతలను స్వీకరించనున్నారని టెక్ మహీంద్ర స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ సమాచారంలోశనివారం ప్రకటించింది. అయితే టెక్ఎం సీఎండీగా జోషి వేతనం, ఇతర ప్రయోజనాలపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం ఏదీ అందుబాటులో లేదు. మోహిత్ జోషి గురించి మరిన్ని విషయాలు మోహిత్ జోషి ఇన్ఫోసిస్ మాజీ సీఈవొ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా సేవలు అవివా Plcలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా రిస్క్ & గవర్నెన్స్ నామినేషన్ కమిటీలలో సభ్యుడు CBI (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్ 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, దావోస్ యంగ్ గ్లోబల్ లీడర్ (YGL)గా ఎంపిక -
ఇన్ఫోసిస్‌కు బై..బై చెప్పి ప్రత్యర్థి కంపెనీకి సీఎండీగా బాధ్యతలు
సాక్షి, ముంబై: దేశీయ ఆరో అతిపెద్ద టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్త సీఈవోగా మోహిత్ జోషి ఎంపికయ్యారు. ప్రస్తుత సీఎండీ సీపీ గుర్నానీ స్థానంలో ఆయన సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరనున్నారు. డిసెంబర్ 20నుంచి మోహిత్ జోషి బాధ్యతలను స్వీకరించనున్నారని టెక్ మహీంద్ర ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో శనివారం ప్రకటించింది. గుర్నానీ పదవీ కాలం డిసెంబర్ 19న ముగియనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి ప్రత్యర్థి టెక్ మహీంద్రాలో చేరడానికి కంపెనీకి రాజీనామా చేసినట్లు రెండు సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలిపాయి. 2000 నుండి ఇన్ఫోసిస్‌లో భాగమైన మోహిత్ జోషి 2023,మార్చి 11రాజీనామా చేశారు.జోషి మార్చి 11 నుండి సెలవులో ఉంటారని, జూన్ 9 చివరి తేదీ అని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కి ఒక ప్రకటనలో ఇన్ఫోసిస్ తెలిపింది. అలాగే మోహిత్ జోషి డిసెంబర్ 2023 నుండి 5 (ఐదు) సంవత్సరాలపాటు 2028 వరకు పదవిలో ఉంటారని టెక్ ఎం వెల్లడించింది. ఇన్పీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ హెల్త్‌కేర్/లైఫ్ సైన్సెస్ వ్యాపార హెడ్‌గా పనిచేసిన జోషికి ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ మరియు కన్సల్టింగ్ స్పేస్‌లో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఇన్ఫోసిస్‌లో, జోషి గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ & హెల్త్‌కేర్, సాఫ్ట్వేర్ బిజినెస్‌కు నాయకత్వం వహించారు. అలాగే ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్‌కు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్‌తో పాటు, ABN AMRO, ANZ Grindlays వంటి ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కూడా పనిచేశారు. సీబీఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్‌గా సేవలందించారు. Aviva Plcలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గాను, రిస్క్ అండ్ గవర్నెన్స్ నామినేషన్ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గ్లోబల్ యంగ్ లీడర్ ప్రోగ్రామ్‌కు ఆహ్వానితుడు కూడా. మోహిత్ జోషి ఢిల్లీ యూనివర్శిటీ నుండి ఎంబీఏ, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. -
ఇన్ఫీ కొత్త చీఫ్.. కత్తిమీదసామే!
♦ ఎంపికపై వెంటాడుతున్న మూర్తి నీడ ♦ ప్రమోటర్ల జోక్యంతో అభ్యర్థుల వెనుకంజ! ♦ ఎవరూ పెద్దగా ఆసక్తి వ్యక్తంచేయకపోవచ్చు.... ♦ మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం... ♦ సీఈఓ ఎంపికకు 2018 మార్చి వరకూ గడువు న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ప్రమోటర్లు–మేనేజ్మెంట్ మధ్య పోరు తీవ్రతరం కావడంతో ఇప్పుడు ఆ కంపెనీ కొత్త చీఫ్ ఎంపిక కత్తిమీద సాముగా మారుతోంది. ప్రధానంగా ఇన్ఫీ విధానాలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తితో సహా మరికొందరు ప్రమోటర్లు నీడలా వెంటాడుతుండటంతో... కంపెనీకి సారథ్యం వహించేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడకపోవచ్చని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనపై కంపెనీ ప్రమోటర్లు పదేపదే నిరాధార ఆరోపణలు, విమర్శల దాడి చేయడాన్ని సహించలేక సీఈఓ, ఎండీ పదవికి విశాల్ సిక్కా గత శుక్రవారం అర్ధంతరంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన గుడ్‌బై చెప్పడానికి మూర్తే కారణమని ఇన్ఫోసిస్ బోర్డు తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా గుప్పించింది. దీంతో ప్రమోటర్లకు ప్రస్తుత మేనేజ్మెంట్కు మధ్య వ్యవహారం మరింత చెడింది. కాగా, కొత్త సీఈఓ నియామకానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ డెడ్‌లైన్‌ను బోర్డు నిర్ధేశించింది. తాత్కాలిక సీఈఓగా కంపెనీ ప్రస్తుత సీఎఫ్ఓ యూబీ ప్రవీణ్ రావుకు బాధ్యతలు అప్పగించారు. కొత్త చీఫ్ అన్వేషణలో కంపెనీలోని వ్యక్తులతోపాటు బయటివారిని కూడా బోర్డు పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఇన్ఫీకి తొలి ప్రమోటరేతర సీఈఓగా ఏరికోరి తీసుకొచ్చిన సిక్కాపై ప్రమోటర్ల ధోరణిని చూస్తుంటే బయటి వ్యక్తులు అంతగా ఆసక్తి చూపకపోవచ్చనేది నిపుణుల వాదన. కంపెనీలోని వ్యక్తులకే ప్రాధాన్యం ఇస్తే గనుక... ప్రవీణ్ రావుతో పాటు సీఎఫ్ఓ డి. రంగనాథ్, డిప్యూటీ సీఓఓ రవికుమార్, కీలకమైన బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్ విభాగాల హెడ్ మోహిత్ జోషి రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బహిరంగ విమర్శలతో కష్టమే... కంపెనీ తీసుకునే విధానపరమైన చర్యలను గుచ్చిగుచ్చి ప్రశ్నించడం, బహిరంగంగా విమర్శించడం వంటి ప్రమోటర్ల చర్యలతో ఎవరైనా మంచి నైపుణ్యం ఉన్న అభ్యర్థులు సీఈఓగా రావాలనుకున్నా జంకుతారని ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ అడ్వయిజరీ సర్వీసెస్ అనే సంస్థ వ్యాఖ్యానించింది. ప్రమోటర్లకు నమ్మకంగా ఉండే కంపెనీలోని వ్యక్తులను ఎంపికచేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సులువైన వ్యవహారమని పేర్కొంది. అయితే, సయోధ్య కోసం ఇలా రాజీపడిపోవడం కంపెనీ పోటీతత్వం, ప్రతిష్టపై ప్రతికూల ప్రభావానికి దారితీస్తుందని అభిప్రాయపడింది. ఇన్ఫీలో కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించి లోపాలు ఉన్నాయంటూ ప్రమోటర్లు ప్రధానంగా మూర్తి బహిరంగంగా ఆరోపణల దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క, కంపెనీ మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్ కు భారీగా వీడ్కోలు ప్యాకేజీ ఇవ్వడాన్ని, సీఈఓ విశాల్ సిక్కా వేతన ప్యాకేజీ పెంపుపైనా మూర్తి బహిరంగంగా విమర్శలు గుప్పించడంతోపాటు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. కాగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫీకి కొత్త సీఈఓ అన్వేషణ చాలా కష్టతరమైన అంశమేనని ఐటీ పరిశ్రమ నిపుణుడు ప్రమోద్ బాసిన్ పేర్కొన్నారు. విశ్వాసం పెంచాలి: నటరాజన్ విశాల్ సిక్కా ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాల్లో ఎలాంటి సమస్యలూ లేవన్న భరోసాను, నమ్మకాన్ని కల్పించే చర్యలు ఇప్పుడు చాలా అవసరమని ఐటీ పరిశ్రమకు చెందిన గణేశ్ నటరాజన్ వ్యాఖ్యానించారు. ఇందుకోసం కొత్త సీఈఓ అన్వేషణ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా సిక్కా వెళ్లిపోయినా... కంపెనీని ముందుండి నడిపించేందుకు, సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు చాలామంది నిపుణులు వరుసలో ఉన్నారన్న బలమైన సందేశాన్ని ఇన్ఫోసిస్ యాజమాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రొఫెషనల్ నాయకత్వం దిశగా భారత్ కొర్పొరేట్లు అడుగులేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇన్ఫీలో తలెత్తిన సంక్షోభం.. చాలా కీలకమైన ప్రశ్నలను లేవనెత్తిందని ఐటీ పరిశ్రమ చాంబర్ నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ సోమ్ మిట్టల్ వ్యాఖ్యానించారు. కంపెనీ యాజమాన్య వ్యవహరాల నుంచి పూర్తిగా వైదొలగిన ఓనర్లు/వ్యవస్థాపకులు... భావి నాయకత్వ ప్రణాళికలకు సంబంధించి తమ పాత్ర ఏంటనే విషయంలో చాలా జాగ్రత్తగా, స్పష్టమైన రీతిలో వ్యవహరించాలని మిట్టల్ సూచించారు. క్లయింట్లు చేజారే ప్రమాదం...! ఇన్ఫీలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు ఉన్నాయంటూ స్వయంగా ప్రమోటర్లే గొంతెత్తడం.. చివరకు ఇది సిక్కా వైదొలగేవరకూ వెళ్లడంతో ఇప్పుడు కంపెనీలో ఉద్యోగులు, క్లయింట్లలో స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో సిబ్బంది వలసలు పెరిగిపోవడంతోపాటు కొంతమంది క్లయింట్లు కూడా చేజారే ప్రమాదం పొంచి ఉందని పేరువెల్లడించడానికి ఇష్టపడని ఐటీ రంగానికి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఇన్ఫీలో జరుగుతున్న ఉదంతంపై క్లయింట్లలో కచ్చి తంగా ఆందోళన నెలకొంటుంది. పటిష్టమైన నాయకత్వం లేకపోవడంతో కంపెనీని మరిన్ని సమస్యలు చుట్టుముట్టొచ్చు. ఐటీ పరిశ్రమలో తీవ్ర పోటీ దృష్ట్యా.. ప్రత్యర్థి కంపెనీలు దీన్ని అనుకూలంగా మలచుకొని ఇన్ఫీ క్లయింట్లను తమవైపు తిప్పుకోడానికి అవకాశం లభిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. మరోపక్క, ఇన్ఫీలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలపై అమెరికాలో క్లాస్ యాక్షన్ దావాలు దాఖలయ్యే అవకాశాలు ఉండటం కూడా అటు క్లయింట్లు ఇటు ఇన్వెస్టర్లలో భయాందోళనలు సృష్టించవచ్చని పరిశీలకులు పేర్కొంటున్నారు. చిచ్చురేపిన పనయా డీల్! సిక్కా సారథ్యంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ కంపెనీ పనయాను ఇన్ఫోసిస్ 2015లో 20 కోట్ల డాలర్లకు(దాదాపు రూ. 1250 కోట్లు) కొనుగోలు చేసింది. అయితే, ఈ డీల్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ కంపెనీ అంతర్గత వేగులు(విజిల్ బ్లోయర్స్) ఆరోపించడం, నియంత్రణ సంస్థలకు ఫిర్యాదు చేయడంతో వివాదం రాజుకుంది. దీనిపై ఆతర్వాత ప్రమోటర్లు కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో స్వతంత్ర న్యాయ సంస్థతో కంపెనీ దర్యాప్తు జరిపించడం తెలిసిందే. అయితే, ఎలాంటి అవకతవకలూ జరగలేదని న్యాయ, ఫోరెన్సిక్ ఆడిట్ సంస్థలు నివేదిక ఇచ్చాయి. ఈ నివేదికను బహిరంగపరచాలన్న మూర్తి డిమాండ్‌ను కంపెనీ బోర్డు తోసిపుచ్చింది. నివేదికను బయటపెట్టకపోవడం అంటే దర్యాప్తు పారదర్శకంగా జరగలేదనే అర్ధమంటూ మూర్తి వ్యాఖ్యానించడం, ఆయనకు మరికొందరు మాజీలు మద్దతుతెలపడంతో యాజమాన్యానికి, ప్రమోటర్లకు మధ్య విభేదాలను మరింత పెంచేలా చేసింది. ఇది కూడా సిక్కా రాజీనామాకు ప్రధాన కారణాల్లో ఒకటని పరిశీలకులు పేర్కొంటున్నారు.