ఆఫర్ లెటర్లు అందుకుని ఎప్పుడెప్పుడు ఉద్యోగాలలో చేరి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అనిపించుకోవాలన్న ఫ్రెషర్లకు భారీ షాక్‌నే ఇచ్చాయి ఐటీ దిగ్గజాలు. అన్ని రౌండ్లు పూర్తి చేసి ఆఫర్ లెటర్ కూడా అందుకున్న విద్యార్ధుల ఉద్యోగాలలో జాప్యం చేసిన విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర వంటి దిగ్గజ కంపెనీలు తాజాగా యూటర్న్ తీసుకున్నాయి. ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
బిజినెస్‌లైన్ కథనం ప్రకారం.. విద్యార్థులు 3-4 నెలల క్రితమే టాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పలు రౌండ్ల ఇంటర్వ్యూల తర్వాత కంపెనీల నుంచి వారు ఆఫర్ లెటర్లు కూడా అందుకున్నారు. అయితే, ఆ తర్వాత జరిగే ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఐటీ సంస్థలు నెలల తరబడి ఆలస్యం చేశాయి. ప్రస్తుతం విద్యార్థులు కంపెనీల్లో చేరేందుకు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో వారి ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్లు ఆయా కంపెనీల నుంచి లెటర్స్ అందుకోవడంతో ఎంపికైన విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందులో కంపెనీలు వారి అర్హతా నిబంధనలు, కంపెనీ మార్గదర్శకాల అనుసరించి ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్టు తెలిపినట్లు చెబుతున్నారు. మార్కెట్లో మనీ ఫ్లో కఠినతరంగా మారడం, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుండడం వంటివి నెలల తరబడి ఉన్న స్టార్టప్‌ల నుంచి దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న టెక్ దిగ్గజాల వరకు అన్ని ఐటీ కంపెనీలపై ఈ పరిణామాలు ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.
ప్రతికూల వ్యాపార పరిస్థితుల కారణంగా చాలా కంపెనీలు నియామకాలను నిలిపివేసాయి. గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కూడా ఇటీవల నియామకాల ప్రక్రియను నిలిపివేయడంతో పాటు అందుబాటులో ఉన్న వనరులతో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
చదవండి: అక్టోబర్‌లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే!
Comments
Please login to add a commentAdd a comment